3
1 ✽అందుచేత✽, పరలోకసంబంధమైన పిలుపు✽లో పాల్గొన్న పవిత్రులైన✽ సోదరులారా, మనం ఒప్పుకొన్న రాయబారి✽, ప్రముఖయాజి✽ క్రీస్తు యేసును గురించి బాగా తలపోయండి. 2 ✽మోషే దేవుని ఇంటి విషయాలన్నిటిలో ఎలా నమ్మకంగా ఉన్నాడో అలాగే యేసు కూడా తనను నియమించినవానికి నమ్మకంగా ఉన్నాడు. 3 ✽కానీ ఇంటికంటే ఇల్లు కట్టేవాడు ఎక్కువగా గౌరవార్హుడు. అలాగే ఈయన మోషేకంటే ఎక్కువ మహిమకు తగినవాడుగా లెక్కలోకి వచ్చాడు. 4 ప్రతి ఇల్లూ ఎవరో ఒకరు నిర్మిస్తారు గాని సమస్తమూ నిర్మించినవాడు దేవుడే. 5 ✽మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నది సేవకుడుగానే. అది తరువాత చెప్పబడేవాటికి సాక్ష్యంగా ఉంది. 6 క్రీస్తు అయితే నమ్మకంగా ఉన్నది కుమారుడుగానే తన సొంత ఇంటి మీదే. మనం అంతంవరకూ ఆశాభావంవల్ల కలిగే ధైర్యాన్నీ అతిశయాన్నీ గట్టిగా చేపట్టామంటే✽ మనమే ఆయన ఇల్లు✽.7 ✽అందుచేత పవిత్రాత్మ ఇలా చెపుతున్నాడు:✽ “ఈ రోజు✽ మీరు ఆయన స్వరం వింటే, 8 మీ పూర్వీకులు నాకు కోపం రేపే సందర్భంలో✽ ఎడారిలో ఆ పరీక్ష రోజున జరిగినట్టు మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి. 9 అప్పుడు వారు నన్ను శోధిస్తూ పరీక్షించారు. నలభై సంవత్సరాలు✽ నా కార్యకలాపాలు చూశారు కూడా. 10 గనుక నేను ఆ తరంవారిమీద కోపపడ్డాను✽. ‘వారు హృదయాల్లో ఎప్పుడూ దారి తప్పి✽ పోతున్నారు. నా త్రోవలు వారు ఎరగనే ఎరగరు’ అన్నాను. 11 అందుచేత నేను నా ఆగ్రహంతో ‘వారు నా విశ్రాంతి✽లో ప్రవేశించరు’ అని శపథం చేశాను.”
12 ✽సోదరులారా! మీలో ఎవరికైనా ఒక వేళ నమ్మకం లేని చెడ్డ హృదయం, దేవుణ్ణి విడిచిపెట్టిపోయే హృదయం ఉందేమో అని జాగ్రత్త వహించండి✽! 13 ✽“ఈ రోజు ఆయన స్వరం వింటే మీ పూర్వీకులు నాకు కోపం రేపిన సందర్భంలో జరిగినట్టు మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి” అని ఆయన చెప్పాడు గదా. 14 అందుచేత “ఈ రోజు” అనే సమయం ఇంకా ఉండగానే మీలో ఎవరైనా ఒకవేళ పాపం ద్వారా కలిగే మోసంచేత కఠినులు కాకుండా దినదినం ఒకరినొకరు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. 15 ✽ ఎందుకంటే, మొదట మనకున్న విశ్వాస నిశ్చయత అంతం వరకూ గట్టిగా చేపట్టితేనే క్రీస్తులో పాలిభాగస్తులమయ్యాం.
16 దేవుని స్వరం విని ఆయనకు కోపం రేపినదెవరు? ఈజిప్ట్✽దేశం నుంచి మోషే తీసుకువచ్చిన వారంతా✽ గదా! 17 ✽ నలభై సంవత్సరాలపాటు దేవుడు కోపపడినది ఎవరిమీద? అపరాధం చేసినవారిమీదే గదా! వారి మృత దేహాలు ఎడారిలో కూలిపోయాయి కూడా.
18 ✽ తన విశ్రాంతిలో ప్రవేశించరని ఆయన శపథం చేసినది ఎవరిని గురించి? అవిధేయులను గురించే గదా. 19 గనుక వారు అవిశ్వాసం కారణంగా ప్రవేశించలేక పోయారని గ్రహిస్తున్నాం.