2
1 అందుచేత, మనం విన్న సంగతులనుంచి కొట్టుకు పోకుండా వాటిలో మరి ఎక్కువ శ్రద్ధ వహించాలి. 2 దేవదూతలచేత దేవుడు పలికించిన వాక్కు స్థిరంగా ఉండడంవల్ల ప్రతి అతిక్రమానికీ అవిధేయత క్రియకూ న్యాయమైన ప్రతిఫలం కలిగింది. 3 ఇలాంటప్పుడు మనం ఇంత గొప్ప ముక్తి లెక్క చేయకపోతే ఎలా తప్పించుకొంటాం? ఈ ముక్తి మొదట ప్రభువు తానే ప్రకటించాడు, ఆయన మాటలు విన్నవారు దానిని మనకు రూఢి చేశారు. 4 దేవుడు కూడా తన ఇష్టప్రకారం సూచకమైన క్రియలూ వింతలూ నానా విధాల అద్భుతాలూ పవిత్రాత్మ ఉచిత వరాలు అనుగ్రహించడం ద్వారా వారితోపాటు సాక్ష్యం ఇచ్చాడు.
5 మేము రాబోయే లోకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దానిని దేవుడు దేవదూతల వశం చేయలేదు. 6 కానీ ఒక వ్యక్తి ఒక చోట ఇలా సాక్ష్యం చెప్పాడు: “నీవు మనిషిని తలచుకోవడానికి వాడెంతటివాడు? నరపుత్రుణ్ణి గురించి ఆలోచించడానికి వాడేపాటివాడు? 7 అతణ్ణి కొంత కాలంపాటు దేవదూతలకంటే తక్కువవాణ్ణి చేశావు గానీ మహిమ, ఘనతలు అతనిమీద కిరీటంలాగా ధరింపచేశావు. నీ చేతితో నిర్మించిన వాటిమీద అతనికి అధికారమిచ్చావు. 8 సమస్తమూ అతని వశంలో అతని పాదాల క్రింద ఉంచావు.” దేవుడు సమస్తమూ అతని వశంలో అతని క్రింద అంటే అతని క్రింద ఉంచక విడిచిపెట్టింది ఏదీ లేదన్నమాట. అయినా సమస్తమూ అతని క్రింద ఉంచడం మనమింకా చూడలేదు. 9 అయితే మనం చూచేది ఏమిటంటే, మరణబాధలు అనుభవించడానికి కొంత కాలంపాటు దేవదూతలకంటే తక్కువవాడుగా చేయబడ్డ యేసు మీద మహిమ, ఘనతలు కిరీటంలాగా ధరింపచేయడం. దేవుని అనుగ్రహంవల్ల ప్రతి ఒక్కరికోసమూ ఆయన చనిపోవాలని దేవుని ఉద్దేశం. 10 ఎందుకంటే, ఎవరికోసం సమస్తమూ ఉన్నదో, ఎవరిద్వారా సమస్తమూ ఉన్నదో ఆయన అనేకమంది కుమారులను మహిమలోకి తేవడంలో వారి విముక్తికర్తను బాధల ద్వారా పరిపూర్ణుణ్ణి చేశాడు. అలా చేయడం ఆయనకు తగినదే. 11 ఎందుకంటే, పవిత్రపరిచేవాడు పవిత్ర పరచబడ్డవారు ఒకరికే చెందినవారు. అందుచేత ఆయన వారిని సోదరులనడానికి సిగ్గుపడడు. 12 “నీ పేరు నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్య నీ కీర్తిని సంకీర్తనం చేస్తాను” అన్నాడు; “ఆయనమీద నా నమ్మకం ఉంచుతాను” అన్నాడు; 13 “నన్నూ, దేవుడు నాకిచ్చిన పిల్లలనూ చూడండి” అని కూడా అన్నాడు.
14 ఆ పిల్లలకు రక్తమాంసాలు ఉన్నకారణంగా ఆయన కూడా రక్తమాంసాలు గలవాడయ్యాడు. తన మరణం ద్వారా మరణ శక్తి గలవాణ్ణి, అంటే అపనింద పిశాచాన్ని శక్తిహీనుణ్ణి చేయాలనీ 15 మరణ భయంచేత తాము బ్రతికినంత కాలం బానిసత్వానికి లోనైనవారిని విడిపించాలనీ అందులో ఆయన ఉద్దేశం. 16 ఆయన చేపట్టినది దేవదూతలను కాదు గాని అబ్రాహాము సంతానాన్నే.
17 అందుచేత అన్నిట్లో ఆయనను తన సోదరుల లాంటివాణ్ణిగా చేయవలసివచ్చింది. ఎందుకని? ఆయన దేవుని విషయాలలో జాలి గల నమ్మకమైన ప్రముఖయాజి అయి ప్రజల పాపాలను గురించి తనను బలిగా సమర్పించి దేవుని కోపాన్ని తొలగించవలసివచ్చింది. 18  ఆయన విషమ పరీక్షలకు గురి అయి బాధ అనుభవించాడు గనుక విషమ పరీక్షలకు గురి అయిన వారికి తోడ్పడగలడు.