హీబ్రూవారికి లేఖ
1
1 పూరాతన కాలంలో దేవుడు అనేక సమయాలలో, నానా విధాలుగా✽ మన పూర్వీకులతో✽ ప్రవక్తల✽ ద్వారా మాట్లాడాడు✽. 2 ✽ఈ చివరి రోజులలోనైతే తన కుమారునిద్వారా✽ మనతో మాట్లాడాడు. ఆయన తన కుమారుణ్ణి అన్నిటికీ వారసుడు✽గా నియమించాడు. కుమారుని ద్వారానే విశ్వాన్ని✽ సృజించాడు కూడా. 3 ఆ కుమారుడు దేవుని మహిమాతేజస్సు✽, దేవుని స్వభావ స్వరూపం✽. ఆయన బలప్రభావాలు గల తన వాక్కు✽చేత అన్నిటినీ వహిస్తూ ఉన్నాడు. మన పాపాల విషయంలో శుద్ధీకరణ✽ తానే చేసిన తరువాత ఆయన ఉన్నతస్థానంలో మహా ఘనపూర్ణుని కుడిప్రక్కన కూర్చున్నాడు.✽4 ✽దేవదూతలకంటే ఆయన వారసత్వంగా ఎంత శ్రేష్ఠమైన పేరు✽ పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడయ్యాడు కూడా✽. 5 ✽ దేవుడు దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇలా చెప్పాడా? – “నీవు నా కుమారుడవు. ఈ రోజు నిన్ను కన్నాను.” లేదా, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు.”
6 అంతే కాదు, ఆయన ఆ ప్రముఖుణ్ణి✽ లోకంలోకి మళ్ళీ రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను ఆరాధించాలి✽ అన్నాడు. 7 ✽ దేవదూతలను గురించి ఆయన ఇలా అంటున్నాడు: “తన దూతలను గాలివంటివారుగా, తన సేవకులను మంటలలాంటివారుగా చేసుకొనేవాడు.” 8 తన కుమారునితో అయితే ఇలా అంటున్నాడు: “దేవా! నీ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది, నీ రాజదండం న్యాయదండం. 9 నీవు న్యాయాన్ని ప్రేమించావు, అన్యాయాన్ని అసహ్యించుకొన్నావు. అందుచేత దేవుడు – నీ దేవుడు✽ – నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనంద తైలంతో అభిషేకించాడు”.
10 కుమారుణ్ణి గురించి ఇంకా అన్నాడు:✽ “ప్రభూ! ఆరంభంలో నీవు భూమికి పునాది వేశావు. ఆకాశాలు కూడా నీవు చేతితో చేసినవే. 11 అవి అంతరించిపోతాయి. నీవైతే ఉంటావు. అవన్నీ వస్త్రంలాగా పాతబడిపోతాయి. 12 పైపంచె లాగా వాటిని మడిచివేస్తావు. అవి మార్చబడుతాయి. గానీ నీవు ఒకే తీరున ఉండేవాడవు. నీ సంవత్సరాలకు అంతం అంటూ ఉండదు.”
13 ✽ దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇలా చెప్పాడా? – “నీ శత్రువులను నీ పాదాలక్రింద పీటగా నేను చేసేవరకూ నా కుడిప్రక్కన కూర్చుని ఉండు.”
14 ✽దేవదూతలంతా ముక్తి వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపబడి సేవ చేస్తున్న ఆత్మలే గదా?