2
1  నీవైతే క్షేమకరమైన ఉపదేశానికి అనుకూలమైనవే చెపుతూ ఉండు. 2 అంటే వృద్ధ పురుషులు ఆశానిగ్రహం గలవారై గౌరవనీయులు, మనసును అదుపులో ఉంచుకొనేవారై విశ్వాసం, ప్రేమభావం, సహనంలో స్థిరబుద్ధిగలవారై ఉండాలి.
3 అలాగే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలు కాకుండా, ద్రాక్షమద్యం వశంలో ఉండకుండా, నడవడిలో భయభక్తులు గలవారై మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. 4 వారు యువ స్త్రీలకు బుద్ధి చెప్పాలి. ఏమంటే దేవుని వాక్కు దూషణకు గురి కాకుండా వారు తమ భర్తలనూ సంతానాన్నీ ప్రేమతో చూడాలి, 5 మనసును అదుపులో ఉంచుకోవాలి, పవిత్ర శీలవతులై ఇంటిలో ఉండి తమ పనులు చేయాలి, దయ గలవారై ఉండాలి. తమ భర్తలకు లోబడి ఉండాలి.
6 అలాగే యువకులు మనసును అదుపులో ఉంచుకోవాలని వారిని ప్రోత్సాహపరచు. 7 మనలను ఎదిరించేవారు నీ గురించి చెడ్డ మాట ఏదీ చెప్పలేక సిగ్గుపడాలి, 8 గనుక అన్ని విషయాలలో మంచినే చేయడంలో నీవు ఆదర్శంగా ఉండు. ఉపదేశంలో న్యాయ బుద్ధినీ గంబీరతనూ చిత్త శుద్ధినీ కనుపరచుకో, నిందించరాని సవ్యమైన మాటలు వినియోగించు. 9 దాసులు తమ యజమానులకు అణిగి ఉండాలి. అన్ని విషయాలలో వారిని సంతోషపెట్టాలి. ఎదురు మాట చెప్పకుండా, 10 దొంగతనం చేయకుండా, తాము పూర్తిగా నమ్మకమైనవారమని కనుపరచు కొంటూ ఉండాలి. అన్నిటిలో మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని ఆకర్షణీయంగా చేయాలి. ఈ సంగతులు వారికి నేర్పించు.
11  ఎందుకంటే, పాపవిముక్తి, రక్షణ తెచ్చే దేవుని కృప మనుషులందరికీ వెల్లడి అయింది. 12 అది మనకు నేర్పుతున్నది ఏమంటే, మనం భక్తిహీనతనూ లోక సంబంధమైన ఇచ్ఛలనూ విసర్జించి ఈ యుగంలో మనసును అదుపులో ఉంచుకొంటూ ఉండాలి; నీతిన్యాయాలతో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి; 13 దివ్యమైన ఆశాభావం కోసం, మన గొప్ప దేవుడూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉండాలి. 14 ఆయన మనలను దుర్మార్గమంతటి నుంచీ విమోచించి, తన సొంత ప్రత్యేక ప్రజగా ఆసక్తితో మంచి పనులు చేసేవారుగా తన కోసం పవిత్రపరచుకోవాలని మనకోసం తనను తాను అర్పించుకొన్నాడు. 15 ఈ సంగతులు చెప్పు. పూర్తి అధికారంతో ప్రోత్సాహపరచు, మందలించు. నిన్ను ఎవ్వరూ నిర్లక్ష్యపెట్టకుండా చూచుకో.