3
1 వారికి ఈ సంగతులు జ్ఞాపకం చెయ్యి: వారు పరిపాలకులకూ అధికారులకూ లోబడాలి, విధేయులై, ప్రతి మంచి పనికోసమూ సంసిద్ధంగా ఉండాలి. 2 ఎవరినీ దూషించకుండా, ఎవరితో జగడమాడకుండా, సాత్వికంగా మనుషులందరిపట్లా సంపూర్ణమైన వినయం చూపుతూ ఉండాలి.
3 ఎందుకంటే, మునుపు మనం కూడా తెలివితక్కువవారం, అవిధేయులం, మోసపోయినవారం, నానా విధాల కోరికలకూ సుఖానుభవాలకూ బానిసలం, దుష్ట భావంతో అసూయతో బ్రతికేవారం, అసహ్యులం, ఒకరినొకరం ద్వేషించేవారమూ. 4 అయితే మానవుల పట్ల మన రక్షకుడైన దేవుని దయ, ప్రేమ కనిపించినప్పుడు, 5 ఆయన మనకు పాపవిముక్తి, రక్షణ అనుగ్రహించాడు. దీనికి మూలాధారం ఆయన కరుణే గాని మనం చేసిన నీతిన్యాయాల పనులు కాదు. కొత్త జన్మం అనే స్నానం ద్వారా, పవిత్రాత్మ మనకు నవీకరణ కలిగించడం ద్వారా ఆయన ఆ విధంగా చేశాడు. 6 ఆయన పవిత్రాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా కుమ్మరించాడు. 7 ఇందులో ఆయన ఉద్దేశమేమంటే, మనం ఆయన కృపచేత నిర్దోషుల లెక్కలోకి వచ్చి, శాశ్వత జీవం గురించిన ఆశాభావం ప్రకారంగా వారసులమై ఉండాలి. 8 ఈ మాట నమ్మతగినదే. దేవుణ్ణి నమ్మినవారు మంచి పనులు మనస్ఫూర్తిగా కొనసాగిస్తూ ఉండాలి. నీవు ఈ విషయాలు నొక్కి చెపుతూ ఉండాలని నా కోరిక. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.
9  కానీ అర్థం లేని వాదాలకూ వంశ చరిత్రలకూ ధర్మశాస్త్రం గురించిన కలహాలకూ జగడాలకూ దూరంగా ఉండు. ఎందుకంటే, అవి ప్రయోజనం లేనివి, వ్యర్థమైనవి. 10 చీలికలు కలిగించడానికి చూచే మనిషిని ఒక సారి హెచ్చరించు, రెండో సారి హెచ్చరించు. 11 అప్పుడు, అలాంటి వ్యక్తి వక్ర బుద్ధిగలవాడూ అపరాధం చేస్తున్నవాడూ తనకు తానే శిక్ష విధించుకొనేవాడూ అని గుర్తించి అతడితో తెగతెంపులు చేసుకో.
12 చలికాలం నికొపొలిలో గడపడానికి నేను నిశ్చయించు కొన్నాను, గనుక నేను అర్తెమాస్‌ను గానీ తుకికస్‌ను గానీ నీ దగ్గరకు పంపినప్పుడు అక్కడికి నా దగ్గరకు రావడానికి గట్టి ప్రయత్నం చెయ్యి. 13 న్యాయవాది జేనాస్‌కూ అపొల్లోకూ ఏమీ తక్కువ కాకుండా చూచి వారిని త్వరగా సాగనంపు. 14 మనవారు కూడా నిష్ఫలులు కాకుండా అత్యవసరాలు తీర్చడానికి మంచి పనులు చేయడంలో నిలకడగా ఉండడం నేర్చుకోవాలి.
15 నా దగ్గర ఉన్నవారంతా నీకు అభివందనాలు చెపుతున్నారు. క్రీస్తుమీది విశ్వాసాన్ని బట్టి మమ్ములను ప్రేమభావంతో చూచేవారికి మా అభివందనాలు చెప్పు. మీకందరికీ కృప తోడై ఉంటుంది గాక. తథాస్తు.