తీతుకు లేఖ
1
1 మన అందరి విశ్వాసం విషయంలో నా సొంత కుమారుడు తీతుకు పౌలు రాస్తున్న సంగతులు. దేవుడు ఎన్నుకొన్న వారి విశ్వాసం ప్రకారంగా, దైవభక్తికి అనుగుణమైన సత్యాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానం ప్రకారంగా నేను దేవుని దాసుణ్ణి, యేసు క్రీస్తు రాయబారిని. 2 ఇదంతా శాశ్వత జీవాన్ని గురించిన ఆశాభావంతో కూడినది. అబద్ధమాడలేని దేవుడు యుగాల ఆరంభానికి ముందే దీన్ని వాగ్దానం చేశాడు. 3 తగిన కాలంలో ప్రకటించడం ద్వారా తన వాక్కు వెల్లడి చేశాడు. ఈ పనిని మన రక్షకుడైన దేవుడు ఆజ్ఞ పూర్వకంగా నాకు అప్పగించాడు. 4 తండ్రి అయిన దేవునినుంచీ మన రక్షకుడైన యేసు క్రీస్తునుంచీ కృప, కరుణ, శాంతి నీకు కలుగుతాయి గాక.
5 నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చిన కారణమేమంటే, నేను నీకు ఆదేశించినట్లు నీవు లోపాలను చక్కపెట్టి, ప్రతి పట్టణంలో క్రీస్తు సంఘంలో పెద్దలను నియమించాలని. 6 సంఘం పెద్ద నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతను ఏకపత్నీ పురుషుడై ఉండాలి. అతని సంతానం విశ్వాసులై దుబారా చేసేవారని తిరగబడేవారనే నిందకు గురి కానివారై ఉండాలి. 7 ఎందుకంటే, సంఘ నాయకుడు దేవుని గృహ సేవ నిర్వహించేవాడు. అందుచేత అతడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు స్వార్థపరుడు, ముక్కోపి, త్రాగుబోతు, ఇతరులను కొట్టేవాడు, అక్రమ లాభం ఆశించేవాడు అయి ఉండకూడదు. 8 అతిథి మర్యాదలు చేసేవాడు, మంచిని ప్రేమభావంతో చూచేవాడు, మనసు అదుపులో ఉంచుకొనే వాడు, న్యాయవంతుడు, పవిత్రుడు, తన ఆశలు అదుపులో ఉంచుకొనేవాడై ఉండాలి. 9 అతడు క్షేమకరమైన సిద్ధాంతాలతో ప్రోత్సాహ పరచడానికీ ఎదురాడేవారిని ఒప్పించడానికీ సమర్థుడయ్యేలా తనకు వచ్చిన ఉపదేశం ప్రకారం నమ్మకమైన వాక్కును గట్టిగా చేపట్టి ఉండేవాడై ఉండాలి.
10 ఎందుకంటే, తిరుగుబాటుదారులు, వదరుబోతులు, మోసగాళ్ళు, ముఖ్యంగా సున్నతిగల వారిలో, అనేకులు ఉన్నారు. 11 వారు నేర్పకూడనివి అక్రమ లాభంకోసం నేర్పుతూ, కొంపలు కూలుస్తూ ఉన్నారు, గనుక వారి నోళ్ళు మూయించాలి. 12 వారిలో ఒకడు, వారి సొంత ప్రవక్త ఒకడు, “క్రేతు ద్వీపవాసులు ఎప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగాలు, సోమరులైన తిండిబోతులు” అన్నాడు. 13 ఈ సాక్ష్యం నిజమే. ఈ కారణంచేత వారు యూదుల కల్పిత కథలనూ, సత్యంనుంచి వైదొలగిన మనుషుల ఆదేశాలనూ లెక్కచేయ కుండా, 14 విశ్వాస సత్యాలలో స్థిరబుద్ధిగలవారై ఉండేలా వారిని కఠినంగా మందలించు. 15 శుద్ధ హృదయులకు అన్నీ శుద్ధమే గానీ విశ్వాసం లేని భ్రష్టులకు ఏదీ శుద్ధం కాదు. వారి మనసు, అంతర్వాణి కూడా భ్రష్టంగా ఉన్నాయి. 16 దేవుడంటే తమకు తెలుసు అని చెప్పుకొంటారు గాని వారి పనులనుబట్టి చూస్తే ఆయనను కాదంటున్నారు. వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి మంచి పనికీ కొరగానివారు.