3
1 ఈ సంగతి తెలుసుకో – చివరి రోజులలో మహా కష్టమైన సమయాలు వస్తాయి. 2 ఎందుకంటే, మనుషులు ఇలా ఉంటారు: స్వార్థప్రియులు, డబ్బంటే వ్యామోహం గలవారు, బడాయికోరులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, 3 ప్రేమ లేనివారు, తీరని పగ గలవారు, అపనిందలు ప్రచారం చేసేవారు, తమను అదుపులో పెట్టుకోనివారు, క్రూరులు, మంచి అంటే గిట్టనివారు, 4 ద్రోహులు, జాగ్రత్త లేని మూర్ఖులు, గర్విష్ఠులు, దేవునికి బదులు సుఖాన్నే ప్రేమించేవారు. 5 పై రూపం చూస్తే వారు భక్తిపరులలాగా ఉంటారు గాని భక్తికి చెందిన బలప్రభావాలను నిరాకరిస్తారు. ఇలాంటివారి నుంచి వైదొలగు.
6 ఇలాంటివారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇండ్లలోకి చొరబడి వారిని వశం చేసుకొంటారు. ఆ స్త్రీలు అపరాధాల భారంతో క్రుంగిపోయి నానా విధాల ఉద్రేకాలచేత కొట్టుకుపోయేవారు, 7 ఎప్పుడూ నేర్చుకొంటూ ఉన్నా సత్యాన్ని గుర్తించలేకపోయేవారు. 8 యన్నేస్, యంబ్రేస్‌‌ మోషేను ఎదిరించారు. అలాగే ఈ పురుషులు సత్యాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. వీరు విశ్వాసం విషయంలో నిరాకరణకు గురి అయినవారు, భ్రష్టమైపోయిన మనసు గలవారు. 9 అయితే వీరు ఇంకా ముందుకు సాగిపోరు. ఎందుకంటే, ఆ మనుషులలాగే వీరి తెలివితక్కువతనం అందరికీ తేటతెల్లమవుతుంది.
10 నీవైతే నా ఉపదేశం, ప్రవర్తన, ఉద్దేశం, విశ్వాసం, ఓర్పు, ప్రేమభావం, సహనశీలత, 11 అంతియొకయలో ఈకొనియలో లుస్త్రలో నాకు కలిగిన హింసలూ కడగండ్లూ – ఎలాంటి హింసలు నేను అనుభవించానో – ఇదంతా తెలుసుకొని శ్రద్ధతో అనుసరించావు. అన్ని హింసలలో నుంచి ప్రభువు నన్ను విడిపించాడు. 12 వాస్తవంగా, క్రీస్తు యేసులో దైవభక్తితో బ్రతకడానికి ఇష్టమున్నవారంతా హింసకు గురి అవుతారు. 13 దుర్మార్గులూ వంచకులూ అయితే మోసపరుస్తూ, మోసపోతూ అంతకంతకూ చెడిపోతూ ఉంటారు.
14 నీవైతే నేర్చుకొని రూఢిగా నమ్ముకొన్నవి ఎవరివల్ల నేర్చుకొన్నావో నీకు తెలుసు. వాటిలో నిలకడగా ఉండాలి. 15 చిన్నప్పటినుంచీ పవిత్ర లేఖనాలు ఎరిగినవాడివని కూడా నీకు తెలుసు. అవి క్రీస్తు యేసులో ఉంచిన నమ్మకం ద్వారా మోక్షం కోసమైన జ్ఞానం నీకు కలిగించగలవి.
16 బైబిలు లేఖనాలన్నీ దైవావేశంవల్ల కలిగినవి, దేవుని మనిషి సంసిద్ధుడై ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థుడై ఉండేలా చేసేవి. 17 ఎలాగంటే ఉపదేశించడానికీ మందలించడానికీ తప్పులు సరిదిద్దడానికీ నీతిన్యాయాల విషయంలో క్రమశిక్షణ చేయడానికి అవి ప్రయోజనకరమైనవి.