2
1 నా కుమారుడా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడై ఉండు. 2 చాలామంది సాక్షుల సముఖంలో నావల్ల నీవు విన్న సంగతులను ఇతరులకు నేర్పగల నమ్మకమైన మనుషులకు అప్పచెప్పు.
3 క్రీస్తు యేసు మంచి సైనికునిలాగా కడగండ్లు అనుభవించు. 4 యుద్ధానికి వెళ్ళేవాడెవడూ మామూలు జీవిత విషయాలలో చిక్కుకోడు. తనను సైనికుడుగా నమోదు చేసినవాణ్ణి సంతోషపెట్టాలని అతడి ఆశ. 5 మరొకటి – ఎవడైనా సరే ఆటల పోటీలో పాల్గొంటూ ఉంటే అతడు నియమాల ప్రకారం చేయకపోతే అతడికి కిరీటం లభించదు. 6  ప్రయాసపడే రైతుకు మొదటి పంటలో పాలు రావాలి. 7 నేను చెప్పేది ఆలోచించుకో, ప్రభువు అన్ని విషయాలలో నీకు గ్రహింపు దయ చేస్తాడు గాక.
8 నా శుభవార్త ప్రకారంగా, దావీదు సంతానమైన యేసు క్రీస్తు చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేచాడని జ్ఞాపకం ఉంచుకో. 9  శుభవార్తకోసం నేను నేరస్థుడిలాగా సంకెళ్లపాలై కష్టాలు అనుభవిస్తూ వున్నాను గానీ దేవుని వాక్కు సంకెళ్ళపాలు కాలేదు. 10 అందువల్ల దేవునిచేత ఎన్నికైనవారికి క్రీస్తు యేసులో ఉన్న విముక్తి, రక్షణ, దానితోపాటు శాశ్వత మహిమ కలగాలని వారికోసం అన్నీ ఓర్చుకొంటున్నాను.
11 ఈ మాట నమ్మతగినది: మనం ఆయనతో చనిపోయినవారమైతే ఆయనతో జీవిస్తాం కూడా. 12 సహించేవారమైతే ఆయనతో పరిపాలన చేస్తాం కూడా. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనంటాడు. 13  మనం అపనమ్మకస్థులమైనా ఆయన నమ్మకమైనవాడుగానే ఉండిపోతాడు. తనను తాను ఎరగననలేడు.
14 ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయి. ప్రభు సమక్షంలో వారిని ప్రోత్సహిస్తూ ఏవేవో మాటల గురించి జగడమాడకూడదని వారికి చెప్పు. అలాంటి జగడం వ్యర్థమైనది, వినేవారిని చెడగొట్టేది. 15 నీవైతే యోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్కు సరిగా ప్రయోగించేవాడుగా నిన్ను నీవు దేవునికి కనబరచుకోవడానికి ఆసక్తితో కృషి చేయి.
16 అపవిత్రమైన వట్టి వదరుబోతుతనం విసర్జించు. అలా మాట్లాడేవారు అంతకంతకు భక్తిహీనులవుతారు. 17 వారి మాటలు కుళ్ళు చేసే కొరుకు పుండులాగా ప్రాకిపోతాయి. అలాంటివారిలో హుమెనైయస్, ఫిలేతస్ ఉన్నారు. 18 వారు సత్యం నుంచి వైదొలగి, చనిపోయినవారు లేచే కాలం ఇంతకుముందే గతించిందని చెపుతూ కొందరి విశ్వాసాన్ని తారుమారు చేస్తున్నారు. 19 అయినా, దేవుడు వేసిన గట్టి పునాది నిలిచే ఉంది. దానిమీద ముద్రగా ఇలా రాసి ఉంది: “తనవారు ప్రభువుకు తెలుసు”; “క్రీస్తు పేరు ఒప్పుకునే ప్రతి ఒక్కరూ దుర్మార్గంనుంచి వైదొలగాలి”.
20 గొప్ప ఇంటిలో బంగారు, వెండి పాత్రలు మాత్రమే కాకుండా, చెక్కతో, మట్టితో చేసినవి కూడా ఉన్నాయి. కొన్ని ఘనతకోసం, మరి కొన్ని ఘనహీనతకోసం ఉన్నాయి. 21 ఎవడైనా ఈ రెండో గుంపుకు వేరై తనను శుద్ధి చేసుకొంటే, అతడు ఘనతకోసమైన పాత్ర అయి ఉంటాడు, పవిత్రమై, యజమానికి ఉపయోగకరమైనవాడై ప్రతి మంచి పనికీ తయారవుతాడు.
22  యువకులకు కలిగే చెడు కోరికలనుంచి పారిపో, శుద్ధ హృదయంతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కూడా నీతిన్యాయాలను, నమ్మకాన్ని, ప్రేమను, శాంతిని ఆసక్తితో అనుసరించు. 23  తెలివితక్కువ మూర్ఖ వివాదాలనుంచి తప్పుకో. అవి జగడాలను పుట్టిస్తాయని నీకు తెలుసు. 24 ప్రభు సేవకుడు జగడమాడకూడదు గాని అందరిమీద దయ చూపాలి. ఉపదేశించగలవాడై ఉండాలి. అపకారాన్ని సహించాలి. 25 ఎదిరించేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. సత్యం తెలుసుకోవడానికి దారితీసే పశ్చాత్తాపం వారికి దేవుడు అనుగ్రహిస్తాడేమో. 26 తన ఇష్టప్రకారం చేయడానికి వారిని చెరపట్టిన అపనింద పిశాచం వలలో నుంచి వారు బుద్ధి తెచ్చుకొని తప్పించుకొంటారేమో.