2 తిమోతికి లేఖ
1
1 ప్రియ కుమారుడైన తిమోతికి క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం, దేవుని సంకల్పంవల్ల యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు రాస్తున్న సంగతులు. 2 తండ్రి అయిన దేవునినుంచీ మన ప్రభువైన క్రీస్తు యేసునుంచీ నీకు కృప, కరుణ, శాంతి కలుగుతాయి గాక.
3 రాత్రింబగళ్ళు నా ప్రార్థనలలో నిన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ, నా పూర్వీకులలాగా స్వచ్ఛమైన అంతర్వాణితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాను. 4 నీ కన్నీళ్ళు తలచుకొని నేను ఆనందంతో నిండిపోయేలా నిన్ను చూడాలని నాకు ఎంతో ఆశ. 5 నీలో ఉన్న కపటం లేని నమ్మకం నాకు జ్ఞాపకం ఉంది. ఆ నమ్మకం మొదట నీ అవ్వ లోయిస్‌లో, నీ తల్లి యునిస్‌లో ఉంది. అది నీలో కూడా ఉందని నా నిశ్చయత. 6 ఈ కారణంచేత, నీమీద నా చేతులు ఉంచడం ద్వారా నీలో ఉన్న దేవుని ఆధ్యాత్మిక వరాన్ని నీవు రాజబెట్టాలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7 ఎందుకంటే దేవుడు మనకు ప్రసాదించినది పిరికితనం పుట్టించే ఆత్మ కాదు గాని బలం, ప్రేమభావం, నిగ్రహం కలిగించే ఆత్మే.
8 కాబట్టి మన ప్రభువును గురించిన సాక్ష్యం విషయంలో, ఆయనకోసం ఖైదీనైన నా విషయంలో సిగ్గుపడకు, గాని శుభవార్తకోసం కడగండ్లలో దేవుని బలప్రభావాలను బట్టి నాతో కూడా పాలిభాగస్తుడివై ఉండు. 9 దేవుడు మనకు పాపవిముక్తి, రక్షణ కలిగించి పవిత్రమైన పిలుపుతో పిలిచాడు. ఇది మనం చేసినదానినిబట్టి కాక ఆయన సంకల్పం, కృప ప్రకారమే జరిగింది. యుగాల ఆరంభానికి ముందే ఈ కృప క్రీస్తు యేసులో మనకు ప్రసాదించబడింది. 10 ఇప్పుడైతే అది మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షం కావడంవల్ల వెల్లడి అయింది. ఆయనే చావును రద్దు చేసి శుభవార్త ద్వారా జీవాన్నీ అక్షయతనూ వెలుగులోకి తెచ్చాడు.
11 ప్రకటించేవాడుగా, క్రీస్తు రాయబారిగా, ఇతర జనాలకు ఉపదేశకుడుగా నన్ను నియమించినది ఈ శుభవార్తకోసమే. 12 నేనీ బాధలు అనుభవిస్తున్న కారణం ఇదే. అయినా, నేను సిగ్గుపడడం లేదు. ఎందుకంటే నేను నమ్మినవాడు నాకు తెలుసు. నేను ఆయనకు అప్పగించినదానిని ఆ రోజువరకూ ఆయన కాపాడగలడని నా దృఢ విశ్వాసం.
13 నీవు నావల్ల విన్నదానిని – ఆ సవ్యమైన బోధన మాదిరిని – క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసంతో, ప్రేమతో అవలంబించు. 14 నీకు అప్పగించిన ఆ మంచిదానిని మనలో నివాసమున్న పవిత్రాత్మవల్ల కాపాడుకో.
15 ఆసియా రాష్ట్రంలో ఉన్న వారంతా – వారిలో ఫుగెల్లస్, హెర్‌మొగెనెస్ ఉన్నారు – నన్ను వదలివేశారని నీకు తెలుసు. 16 ఒనేసిఫోరస్ నా సంకెళ్ళ విషయంలో సిగ్గుపడకుండా, తరచుగా నాకు సేద తీర్చాడు. అతని ఇంటివారిమీద ప్రభువు జాలి చూపుతాడు గాక! 17 అతడు రోమ్‌లో ఉన్నప్పుడు నాకోసం చాలా శ్రద్ధతో వెదికి నన్ను కనుగొన్నాడు. 18 అంతే కాదు, ఎఫెసులో అతడు ఎంతో పరిచర్య చేశాడు – ఇది నీకు బాగా తెలుసు. ఆ రోజున అతనిమీద ప్రభువు జాలి చూపేలా ప్రభువే దయ చేస్తాడు గాక.