4
1 కాబట్టి దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షం, రాజ్యం సమయంలో సజీవులకూ చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నీకీ ఆదేశం ఇస్తున్నాను. 2 దేవుని వాక్కు ప్రకటించు, యుక్తకాలంలో, అకాలంలో సిద్ధంగా ఉండు. నిండు ఓర్పుతో ఉపదేశంతో ఒప్పించు, మందలించు, ప్రోత్సహించు. 3 ఎందుకంటే, ప్రజలు క్షేమకరమైన సిద్ధాంతాలను సహించని సమయం వస్తుంది. వారు దురద చెవులు కలిగి తమ చెడ్డ కోరికల ప్రకారం గురువులను తమకోసం పోగు చేసుకొంటారు. 4 వాళ్ళు తమ చెవులను సత్యం నుంచి త్రిప్పుకొని కల్పిత కథలవైపు తొలగిపోతారు. 5 నీవైతే అన్నిటిలోనూ మందమతి కాకుండా ఉండు. కష్టాలు ఓర్చుకో. శుభవార్త ప్రచారకుడి పని చెయ్యి. నీ సేవను నెరవేర్చు.
6 నేనిప్పుడే పానార్పణంగా పోయబడుతూ ఉన్నాను. నేను పోయే సమయం దగ్గరపడింది. 7 మంచి పోరాటం పోరాడాను. నా పరుగు తుదముట్టించాను. విశ్వాస సత్యాలను పాటించాను. 8 ఇకమీదట నీతిన్యాయాల కిరీటం నాకోసం ఉంచబడి ఉంది. ఆ రోజున ప్రభువు – న్యాయవంతుడైన ఆ న్యాయాధిపతి – దానిని నాకిస్తాడు. నాకే కాదు, ఆయన ప్రత్యక్షత అంటే ప్రేమభావం గలవారందరికీ ఇస్తాడు.
9 నా దగ్గరికి త్వరలో రావడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యి. 10 ఎందుకంటే దేమాస్ ఈ లోకంమీద ప్రీతి కలిగి నన్ను విడిచిపెట్టి తెస్సలొనీకకు వెళ్ళాడు. క్రెస్కెన్స్ గలతీయకు, తీతు దల్మతియకు వెళ్ళారు. 11 లూకా ఒక్కడే నా దగ్గర ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకురా. సేవలో అతడు నాకు ప్రయోజనకరుడు. 12 తుకికస్‌ను ఎఫెసుకు పంపాను. 13 నీవు వచ్చేటప్పుడు, త్రోయలో కర్పస్ దగ్గర నేను ఉంచి వచ్చిన పైవస్త్రం, పుస్తకాలు, విశేషంగా తోలు కాగితాలు తీసుకురా.
14  కంచరివాడు అలెగ్జాందర్ నాకు చాలా కీడు చేశాడు. అతడి క్రియలప్రకారం ప్రభువు అతడికి ప్రతిఫలమిస్తాడు. 15 అతడి గురించి నీవు కూడా జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను ఎంతో ఎదిరించాడు.
16 తీర్పు జరిగినప్పుడు నేను మొదటి సమాధానమిస్తే నా పక్షం ఎవ్వరూ వహించలేదు. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇది వారి లెక్కలోకి నేరంగా రాకపోతుంది గాక. 17 అయినా, ప్రభువు నా పక్షాన నిలిచి నాకు బలం కలిగించాడు. నా ద్వారా శుభవార్త ప్రకటన పూర్తిగా జరగాలనీ, యూదులు కాని ఇతర జనాలంతా దానిని వినాలనీ ఆయన ఉద్దేశం. కనుక సింహం నోటినుంచి నాకు విడుదల కలిగింది. 18 ప్రభువు నన్ను ప్రతి చెడు పని నుంచీ విడిపిస్తాడు, తన పరలోక రాజ్యానికి సురక్షితంగా చేరుస్తాడు. ఆయనకే మహిమ యుగయుగాలకూ కలుగుతుంది గాక! తథాస్తు!
19 ప్రిస్కకూ, అకులకూ, ఒనేసిఫోరస్ ఇంటివారికి నా అభివందనాలు చెప్పు. 20 ఎరస్తస్ కొరింతులో ఆగిపోయాడు. త్రోఫిమస్ అనారోగ్యంగా ఉన్నాడు. నేనతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.
21  చలికాలం రాకముందే రావడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యి. యుబూలస్, పుదెన్స్, లినస్, క్లౌదియ, సోదరులంతా నీకు అభివందనాలు చెపుతున్నారు.
22 ప్రభువైన యేసుక్రీస్తు నీ ఆత్మకు తోడైవుంటాడు గాక. కృప నీకు తోడై ఉంటుంది గాక. తథాస్తు.