5
1 ✽ముసలివాణ్ణి తిట్టకు. తండ్రిగా భావించి అతణ్ణి ప్రోత్సాహపరచు. అన్నదమ్ములని యువకులనూ, 2 తల్లులని ముసలి స్త్రీలనూ, అక్క చెల్లెండ్లని యువతులనూ పూర్ణ పవిత్రతతో ప్రోత్సహించు.3 ✽నిజంగా దిక్కులేని విధవరాండ్రను గౌరవంతో ఆదుకో. 4 ✽అయితే ఒక విధవరాలికి పిల్లలు గానీ పిల్లల సంతానం గానీ ఉంటే, వీరు మొదట తమ భక్తిని ఇంట్లో చూపేందుకు✽ నేర్చుకొని తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టిలో మంచిది, అంగీకారమైనది. 5 ✽నిజంగా దిక్కులేని విధవరాలు ఒంటరిగా ఉండి దేవునిమీదే నమ్మకం ఉంచి రాత్రింబగళ్ళు దేవునికి విన్నపాలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. 6 కానీ సుఖాసక్తితో బ్రతుకుతున్న ఆమె జీవచ్ఛవం✽ లాంటిదే. 7 వారు నిందపాలు కాకుండా ఈ విషయాలు ఆదేశించు.
8 ఎవడైనా సరే తనవారిని, విశేషంగా తన ఇంటివారిని పోషించకపోతే అతడు విశ్వాస సత్యాలను కాదన్నట్టే. అతడు విశ్వాసం✽ లేనివాడికంటే చెడ్డవాడు.
9 అరవై ఏళ్ళకంటే తక్కువ వయస్సు ఉన్న విధవరాలిని జాబితాలో✽ నమోదు చేయకూడదు. అంతే కాక మునుపు ఆమె ఒక్కరినే పెళ్ళాడి ఉండాలి, 10 మంచి పనులకు పేరు పొంది ఉండాలి – అంటే, పిల్లలను పెంచడం, పరాయి వ్యక్తులకు అతిథి సత్కారం✽ చూపడం, పవిత్రుల పాదాలు కడగడం✽, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం, అన్ని రకాల మంచి పనులకు పూనుకోవడం.
11 ✽తక్కువ వయస్సు ఉన్న విధవరాండ్రను ఆ జాబితాలో నమోదు చేయకు. వారు క్రీస్తుకు వ్యతిరేకంగా సుఖభోగాలవైపు మొగ్గి పెళ్ళి చేసుకోవాలని ఆశిస్తారు. 12 అలా వారు తమ మొదటి నిశ్చయతను విడిచిపెట్టి తలమీదికి తీర్పు తెచ్చుకొంటారు. 13 ✽అంతే కాదు. వారు ఇంటింటా తిరుగుతూ వృథా కాలయాపన చేయడం నేర్చుకొంటారు. కాలయాపన చేసేవారుగా మాత్రమే గాక చెప్పకూడని సంగతులు చెపుతూ, వదరుబోతులుగా ఇతరుల జోలికి పోయేవారుగా తయారౌతారు.
14 ✽అందుచేత తక్కువ వయస్సు ఉన్న విధవరాండ్రు పెళ్ళి చేసుకొని పిల్లలను కని ఇంటి వ్యవహారాలు నిర్వహించుకొంటూ, శత్రువు✽కు నిందించే అవకాశం ఇవ్వకుండా ఉండాలని నా ఆశ. 15 ✽ఇంతకుముందే కొందరు సైతాను వెంట తొలగారు✽. 16 ✽విశ్వాసం ఉన్న పురుషుడు గానీ స్త్రీ గానీ కుటుంబంలోని విధవరాండ్రుంటే వారికి సహాయం చేయాలి. ఆ భారం క్రీస్తు సంఘం మీదికి రాకూడదు. అప్పుడు సంఘం నిజంగా దిక్కులేని విధవరాండ్రకు సహాయం చేయగలదు.
17 ✽క్రీస్తు సంఘం నాయకత్వం బాగా వహించే పెద్దలు విశేషంగా వాక్కు ప్రకటించడంలో, నేర్పడంలో✽ ప్రయాసపడే పెద్దలు రెట్టింపు గౌరవానికి✽ యోగ్యులని భావించాలి. 18 ✝లేఖనం ఇలా అంటుంది గదా: “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు”. “పనివాడు తన జీతానికి యోగ్యుడు.” 19 ✽ఇద్దరు ముగ్గురు సాక్షులు✽ ఉంటేనే తప్ప సంఘం పెద్దమీద నిందారోపణ అంగీకరించకు. 20 ✽అపరాధం చేయడానికి ఇతరులు భయపడేలా అపరాధం చేస్తున్నవారిని అందరి ఎదుటా మందలించు.
21 ✽పక్షపాతం గానీ అభిమాన ప్రదర్శన గానీ ఏమీ లేకుండా ఈ నియమాలను పాటించు, దేవుని ఎదుట, ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట, దేవుడు ఎన్నుకొన్న దేవదూతల ఎదుట నేను సాక్షిగా నిన్ను ప్రోత్సహిస్తున్నాను. 22 ఎవరిమీదా చేతులుంచడానికి✽ త్వరపడకు, ఇతరుల అపరాధాలలో పాలిభాగస్తుడివి కాకు, ఎప్పుడూ పవిత్రంగా ఉండేలా నిన్ను నీవే కాపాడుకో. 23 ఇకనుంచి నీళ్ళు మాత్రమే త్రాగక, నీ కడుపుకోసం, తరచుగా వచ్చే జబ్బులకోసం✽ కొంచెం ద్రాక్షరసం కూడా వినియోగించు.
24 ✽కొందరి అపరాధాలు తేటతెల్లంగానే ఉండి వారికి ముందు న్యాయస్థానానికి సాగిపోతూ ఉన్నాయి. మరి కొందరి అపరాధాలు వారి వెంట వెళ్ళిపోతూ ఉన్నాయి. 25 అలాగే మంచి చర్యలు తేటతెల్లమే. తేటతెల్లం కానివి కూడా మరుగై ఉండలేవు.