3
1 స్థానిక సంఘ నాయకుడు కావడానికి ఎవడైనా ఆశిస్తున్నాడంటే అతడు శ్రేష్ఠమైన పని చేయాలని కోరుతున్నాడన్న మాట నమ్మతగినదే. 2 నాయకుడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీ పురుషుడై ఉండాలి. ఆశానిగ్రహం గల వాడూ, మనసు అదుపులో ఉంచుకొనే వాడూ, మర్యాదస్థుడూ, అతిథి సత్కారాలు చేసేవాడూ, ఉపదేశించడానికి సమర్థుడూ అయి ఉండాలి. 3 అతడు సాత్వికుడై ఉండాలి గాని ఇతరులను కొట్టేవాడూ, త్రాగుబోతూ, జగడగొండీ, ధనాపేక్ష గలవాడూ పేరాశగలవాడూ అయి ఉండకూడదు. 4 తన సంతానం తనకు పూర్తి గౌరవంతో లోబడేలా చేసుకొంటూ తన కుటుంబానికి నాయకత్వం సరిగా నిర్వహించుకొనేవాడై ఉండాలి. 5 ఎవడైనా సరే తన కుటుంబానికి నాయకత్వం నిర్వహించుకోవడమెలాగో తెలియనివాడైతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూచుకోగలడు? 6 అతడు కొత్తగా చేరినవాడుగా ఉండకూడదు. లేకపోతే అతడు విర్రవీగి అపనింద పిశాచం తీర్పుకు గురి అవుతాడేమో. 7 అంతే కాక, అతడు నిందపాలై అపనింద పిశాచం ఉరిలో చిక్కుపడకుండా బయట ఉన్న వారిమధ్య మంచి పేరు పొందినవాడై ఉండాలి.
8 అలాగే పరిచారకులు కూడా గౌరవానికి తగినవారూ నిష్కపటులూ అయి ఉండాలి. త్రాగుబోతులూ, అక్రమలాభం ఆశించేవారూ అయి ఉండకూడదు. 9 వారు స్వచ్ఛమైన అంతర్వాణితో విశ్వాస సంబంధమైన రహస్య సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. 10 అంతే కాదు, మొదట వారిని పరీక్షించాలి. అప్పుడు వారు నిందకు చోటివ్వనివారై ఉంటే పరిచారకులుగా సేవ చేయవచ్చు.
11 అలాగే వారి భార్యలు కూడా గౌరవానికి తగినవారూ అపనిందలు ప్రచారం చేయనివారూ, కోరికలు అదుపులో ఉంచుకొనేవారూ అన్ని విషయాలలో నమ్మకమైనవారూ అయి ఉండాలి.
12 పరిచారకులు ఏకపత్నీ పురుషులై ఉండాలి. వారు తమ సంతానానికీ కుటుంబానికీ నాయకత్వం సరిగా నిర్వహించు కొనేవారై ఉండాలి. 13 పరిచారకులుగా సేవ బాగా చేసేవారికి మంచి గౌరవం, క్రీస్తు యేసుమీది విశ్వాసంలో గొప్ప ధైర్యం లభిస్తాయి.
14 త్వరలో నీ దగ్గరకు రావాలని నా ఆశాభావం. 15 ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే, దేవుని గృహంలో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో నీవు ఎలా ప్రవర్తించాలో నీకు తెలిసేలా ఈ సంగతులు రాస్తున్నాను. దేవుని సంఘం సత్యానికి స్తంభం, బురుజు.
16 దైవభక్తిని గురించిన రహస్య సత్యం గొప్పది. ఇది నిశ్చిత విషయం. దేవుడు శరీరంతో వెల్లడి అయ్యాడు. ఆయన నిర్దోషి అని దేవుని ఆత్మవల్ల నిర్ణయం అయింది. ఆయనను దేవదూతలు చూశారు. ఆయనను జనాలలో ప్రకటించడం, లోకంలో నమ్మడం, మహిమతో పైకి తీసుకువెళ్ళడం జరిగింది.