3
1 మీరు క్రీస్తుతోకూడా సజీవంగా లేపబడి ఉంటే పైన ఉన్నవాటినే వెదకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. 2 ఆ పైవాటిమీదే మీ మనస్సు నిలుపుకోండి గాని భూలోక విషయాలమీద కాదు. 3 ఎందుకంటే, మీరు మృతి చెందినవారే! మీ జీవం క్రీస్తుతో దేవునిలో మరుగై ఉంది. 4 మన జీవమై ఉన్న క్రీస్తు కనిపించేటప్పుడు మీరూ ఆయనతోకూడా మహిమలో కనిపిస్తారు.
5 అందుచేత భూమిమీద ఉన్న మీ శరీరభాగాలను, అంటే లైంగిక అవినీతి, కల్మషం, కామోద్రేకం, చెడు కోరికలు, అత్యాశ (ఇది విగ్రహ పూజ) రూపుమాపండి. 6 వీటికారణంగా దేవుని కోపం అవిధేయులమీదికి వస్తుంది. 7 మునుపు వాటిలో బ్రతికినప్పుడు మీరూ వీటిని అనుసరించి నడుచుకొన్నారు. 8 ఇప్పుడైతే కోపం, ఆగ్రహం, దుర్మార్గం, కొండెం, మీ నోట నుంచి చెడ్డ మాటలు – వీటన్నిటిని కూడా విసర్జించండి. 9 ఒకరితో ఒకరు అబద్ధమాడకండి. ఎందుకంటే మీ పాత “మానవుణ్ణి” దాని పనులతోపాటు విసర్జించి 10 సృష్టికర్త పోలిక ప్రకారం సంపూర్ణమైన అవగాహనలో నవనూతన మవుతూ ఉన్న కొత్త “మానవుణ్ణి” ధరించుకొన్నారు. 11  ఈ విషయంలో క్రీస్తే సమస్తమూ, అందరిలో ఉన్నవాడు గాని యూదుడు, గ్రీసు దేశస్థుడు, సున్నతి గలవాడు, సున్నతి లేనివాడు, విదేశీయుడు, సిథియ దేశస్థుడు, స్వతంత్రుడు, దాసుడు అంటూ భేదమేమీ లేదు.
12 దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నాడు. మీరు పవిత్రులు, దేవుని ప్రియ ప్రజలు. కాబట్టి జాలిగల మనసునూ దయనూ వినయాన్నీ సాత్వికాన్నీ ఓర్పునూ ధరించుకోండి. 13 ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరిమీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపండి, ఒకరినొకరు క్షమించండి. క్రీస్తు మిమ్ములను క్షమించినట్టే మీరూ క్షమించండి. 14 వీటన్నిటికీ పైగా ప్రేమను దాల్చుకోండి. పరిపూర్ణ ఐక్యత కలిగించే బంధం ప్రేమే. 15 మీ హృదయాలలో దేవుని శాంతిని పరిపాలిస్తూ ఉండనివ్వండి. దీనికి కూడా ఒకే శరీరంలో మీకు పిలుపు వచ్చింది. కృతజ్ఞులై ఉండండి.
16  క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. సమస్త జ్ఞానంతో ఒకరికొకరు నేర్పుకొంటూ బుద్ధి చెప్పుకొంటూ ఉండండి. కృపభావంతో కీర్తనలూ భజనలూ ఆధ్యాత్మిక సంగీతాలూ హృదయంతో ప్రభువుకు పాడుతూ ఉండండి. 17 అంతేకాక, మీరేమి చేసినా – అది మాట గానీ చర్య గానీ – అంతా ప్రభువైన యేసు పేర చేసి ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.
18 పెళ్ళి అయిన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన. 19 పెళ్ళి అయిన పురుషులారా, మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి. వారికి కష్టం కలిగించకండి. 20 పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎందుకంటే ఇది ప్రభువుకు సంతోషకరం. 21 తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహ పడకుండా వారిని చికాకుపరచకండి.
22 దాసులారా, శరీరసంబంధంగా మీ యజమానులపట్ల అన్ని విషయాలలో విధేయత చూపండి. మనుషులను మెప్పించాలని వారి కళ్ళెదుటే కాక, దేవుని మీది భయభక్తులతో, కపటం లేని మనసులతో విధేయత చూపండి. 23 ప్రభువువల్ల ఒక వారసత్వం మీకు బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు గనుక మీరు ఏమి చేసినా అది మనుషుల కోసం కాక, ప్రభువు కోసమని మనస్ఫూర్తిగా చేయండి. 24 మీరు సేవ చేస్తున్నది ప్రభువైన క్రీస్తుకే. 25 అక్రమం చేసేవాడు చేసిన దానికి ప్రతిఫలం పొందుతాడు. పక్షపాతం ఉండదు.