4
1 యజమానులారా, పరలోకంలో మీకు కూడా యజమానుడొకడు ఉన్నాడని తెలిసి మీ దాసులపట్ల న్యాయంగా నిష్‌పక్షపాతంగా వ్యవహరించండి.
2 మెళకువగా ఉండి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉండండి. 3 మా కోసం కూడా ప్రార్థించండి. క్రీస్తు రహస్య సత్యం కోసం నేను సంకెళ్ళ పాలయ్యాను. మేమీ సత్యం ప్రకటించడానికి దేవుడు తన వాక్కుకోసం మాకు తలుపు తెరిచేలా, 4 నేను మాట్లాడవలసిన విధంగానే దానిని స్పష్టం చేసేలా ప్రార్థించండి.
5 సమయాన్ని సద్వినియోగం చేస్తూ బయటివారిపట్ల జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉండండి. 6 ప్రతి ఒక్కరికీ ఎలా జవాబివ్వాలో అది మీరు తెలుసుకొనేలా దయతో, ఉప్పు వేస్తే రుచి కలుగుతున్నరీతిగా మీ మాటలు ఎల్లప్పుడు ఉండేలా చూడండి.
7 నా విషయాలన్నీ తుకికస్ మీకు చెపుతాడు. ఇతడు ప్రియ సోదరుడు, ప్రభువులో నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుడు. 8 అతనికి మీ పరిస్థితులు తెలియాలనీ, ఇతడు మీ హృదయాలకు ప్రోత్సాహం కలిగించాలనీ ఈ కారణాల చేతనే నేనతణ్ణి మీదగ్గరకు పంపుతున్నాను. 9 మన నమ్మకమైన ప్రియ సోదరుడూ మీలో ఒకడూ అయిన ఒనేసిమును అతనితోకూడా పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియజేస్తారు.
10 నాతోకూడా ఖైదులో ఉన్న అరిస్తార్కస్, బర్నబాకు సమీప బంధువుడైన మార్కు మీకు అభినందనలు చెపుతున్నారు. మార్కును గురించి మీకు ఆదేశాలు వచ్చాయి. అతడు మీదగ్గరకు వస్తే అతణ్ణి స్వీకరించండి. 11 యూస్తస్ అనే యేసు కూడా అభివందనాలు చెపుతున్నాడు. దేవుని రాజ్యంకోసం నా జతపనివారిలో వీరు మాత్రమే సున్నతి పొందినవారు. వీరివల్ల నాకు ఓదార్పు కలిగింది.
12 క్రీస్తు దాసుడూ, మీలో ఒకడూ అయిన ఎపఫ్రామీకు అభివందనాలు చెపుతున్నాడు. మీరు దేవుని సంకల్పమంతటిలో పరిపూర్ణులుగా సంపూర్ణులుగా నిలిచి ఉండేలా అతడు మీ కోసం ఎప్పుడూ ప్రార్థనలో ఉత్సుకతతో పోరాడుతూ ఉన్నాడు. 13 ఇతనికి మీకోసం, లవొదికయలో హియెరాపొలిలో ఉన్నవారికోసం ఎంతో ఆసక్తి ఉందని ఇతణ్ణి గురించి నా సాక్ష్యం.
14 ప్రియ వైద్యుడైన లూకా, దేమాస్ కూడా అభివందనాలు చెపుతున్నారు.
15 లవొదికయలో ఉన్న సోదరులకూ, నుంఫాకూ అతని ఇంట్లో ఉన్న సంఘానికీ అభివందనాలు చెప్పండి. 16 ఈ లేఖ మీమధ్య చదివి వినిపించిన తరువాత లవొదికయ వారి సంఘంలో కూడా చదివించండి. లవొదికయనుంచి వచ్చిన లేఖ మీరు చదివి వినిపించండి.
17 అర్కిప్పస్‌తో ఈ మాట చెప్పండి: “ప్రభువు మీకప్పగించిన పని పూర్తి చేయడానికి శ్రద్ధ వహించండి.”
18 నేను – పౌలును – నా సొంత చేతితో ఈ అభివందనాలు రాస్తున్నాను. నేను ఖైదీనని జ్ఞాపకం ఉంచుకోండి. కృప మీకు తోడై ఉంటుంది గాక! తథాస్తు.