కొలస్సయివారికి లేఖ
1
1  కొలస్సయిలో నివాసముంటూ, క్రీస్తులో పవిత్రులై నమ్మకమైన సోదరులకు 2 దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు రాయబారి పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ మీకు కృప, శాంతి కలుగుతాయి గాక.
3 క్రీస్తు యేసుమీది మీ నమ్మకం గురించీ పవిత్రులందరిపట్ల మీ ప్రేమ గురించీ మేము విన్నాం. 4 అప్పటినుంచి, పరలోకంలో మీ కోసం ఉంచబడ్డ ఆశాభావాన్ని బట్టి, మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెపుతూ, మీ కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. 5 శుభవార్త అనే సత్య వాక్కు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఆశాభావం గురించి మీరు విన్నారు. 6 ఈ శుభవార్త లోకం అంతటా వ్యాపిస్తూ, ఫలిస్తూ ఉంది. మీరు దానిని విని దేవుని కృపను నిజంగా గ్రహించిన నాటినుంచీ అది మీమధ్య కూడా అలాగే ఫలిస్తూ ఉంది. 7 మీరు మా ప్రియమైన సాటి దాసుడు ఎపఫ్రా వల్ల శుభవార్త నేర్చుకొన్నారు. 8 అతడు మీ విషయంలో క్రీస్తుకు నమ్మకమైన సేవకుడు. దేవుని ఆత్మలోని మీ ప్రేమభావాన్ని అతడు మాకు తెలియజేశాడు కూడా.
9 ఈ కారణం చేత ఈ సంగతి గురించి విన్ననాటినుంచి మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం, తెలివి కలిగి ఆయన సంకల్పం పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుతూ ఉన్నాం. 10 దీనిద్వారా మీరు ప్రభువుకు తగిన విధంగా నడుచుకొంటూ, ప్రతి మంచి పనిలో ఫలిస్తూ, అంతకంతకూ దేవుణ్ణి తెలుసుకొంటూ అన్ని విషయాలలో ప్రభువుకు ఆనందం కలిగించాలని ప్రార్థిస్తున్నాం. 11 మీకు ఆనందంతో కూడిన సంపూర్ణమైన సహనం, ఓర్పు కలిగేలా మీరు ఆయన దివ్య బలప్రభావాల ప్రకారం సంపూర్ణంగా బలపడి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెపుతూ ఉండాలని మా ప్రార్థన. 12 వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వంలో పాలిభాగస్థులు కావడానికి ఆయన మనలను తగినవారుగా చేశాడు. 13 ఆయన మనలను చీకటి పరిపాలన నుంచి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యంలోకి తెచ్చాడు. 14 కుమారునిలో ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి, అంటే, పాపక్షమాపణ ఉంది.
15 ఆయన కనిపించని దేవుని ప్రత్యక్ష స్వరూపం, సర్వసృష్టికి ప్రముఖుడు. 16 ఎందుకంటే ఆయనవల్ల సృష్టిలో అన్నీ ఉనికిలోకి వచ్చాయి. ఆకాశాలలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, కనబడేవి, కనబడనివి, సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా – సమస్తాన్నీ ఆయనద్వారా, ఆయనకోసం సృజించడం జరిగింది. 17 ఆయనే అన్నిటికీ పూర్వమున్నవాడు, ఆయనలోనే అన్నీ ఒక దానితో ఒకటి కలిసి స్థిరంగా నిలుస్తాయి. 18 అంతేకాదు శరీరానికి, అంటే, తన సంఘానికి ఆయనే శిరస్సు. ఆయనే ప్రతిదానిలోనూ ఆధిక్యత కలిగి ఉండాలని ఆయనే ఆది, చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేచేవారందరిలోనూ ప్రముఖుడు. 19 ఎందుకంటే, సంపూర్ణత అంతా ఆయనలో ఉండాలని తండ్రి అయిన దేవుని ఇష్టం. 20 క్రీస్తు సిలువమీద చిందిన రక్తంద్వారా సంధి చేసి అన్నిటినీ తనతో సఖ్యపరచుకోవాలని కూడా తండ్రి ఇష్టం. “అన్నీ” అంటే, భూమిమీద ఉండేవీ, పరలోకంలో ఉండేవీ.
21 గతంలో మీరు దేవుని విషయంలో పరాయివారు. మీ చెడు పనుల కారణంగా ఆయన పట్ల విరోధ భావం గలవారు. 22 ఇప్పుడైతే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం ద్వారా ఆయన మిమ్ములను తనతో సఖ్యపరచుకొన్నాడు. ఆయన దృష్టిలో మిమ్ములను తనముందు పవిత్రంగా, నిర్దోషంగా, అనింద్యంగా నిలబెట్టుకోవాలని ఇందులో ఆయన ఉద్దేశం. 23 మీరు సుస్థిరంగా, దృఢంగా ఉంటూ, మీరు విన్న శుభవార్త ఇచ్చే ఆశాభావం నుంచి తొలగిపోకుండా విశ్వాసంతో సాగిపోతూ ఉంటే ఆయన అలా చేస్తాడు. ఈ శుభవార్త ప్రకటన ఆకాశంక్రింద ఉన్న సర్వ సృష్టిలో జరిగింది. దీనికి నేను – పౌలును – సేవకుణ్ణయ్యాను.
24 ఇప్పుడు మీకోసమైన నా బాధలలో ఆనందిస్తూ ఉన్నాను. తన శరీరం, అంటే సంఘం కోసం క్రీస్తు కష్టాలలో తక్కువ పడినదానిని నా శరీరంలో పూర్తి చేస్తూ ఉన్నాను. 25 మీ కోసం దేవుని వాక్కు, అంటే రహస్య సత్యం పూర్తిగా ప్రకటించడానికి దేవుడు నాకు అప్పగించిన నిర్వహణ ప్రకారం నేను ఈ సంఘానికి సేవకుణ్ణయ్యాను. 26 ఈ రహస్య సత్యం గత యుగాలపాటు, తరాలపాటు మరుగైనది గాని ఇప్పుడు ఆయన పవిత్రులకు వెల్లడి అయింది. 27 యూదులు కాని ఇతర జనాల మధ్య ఉన్న ఈ రహస్య సత్యం దివ్య ఐశ్వర్యం తన పవిత్రులకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ రహస్య సత్యం మీలో ఉన్న క్రీస్తు. ఆయనే మహిమను గురించిన ఆశాభావం. 28 మేమాయనను ప్రకటిస్తూ, సర్వ జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరికీ ఉపదేశిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరినీ క్రీస్తు యేసులో పరిపూర్ణులుగా దేవుని ముందు నిలబెట్టాలని మా ఉద్దేశం. 29 ఇందుకే నేను పాటుపడుతూ ఉన్నాను, నాలో బలంగా పని చేస్తున్న ఆయన కట్టుదిట్టమైన క్రియాశీలత ప్రకారం నేను పోరాడుతూ ఉన్నాను.