4
1 అందుచేత, నా ప్రియ సోదరులారా, ప్రభువులో నిలకడగా ఉండండి. నా ప్రియులారా, మిమ్ములను చూడాలని నాకెంతో ఆశ. నా ఆనందం, నా కిరీటం మీరే!
2 ప్రభువులో ఏక మనసుతో ఉండండి అంటూ నేను యువొదియనూ సుంటుకేనూ బ్రతిమిలాడుతున్నాను. 3 నా నిజమైన సహకారీ, నీతో కూడా ఒక మాట – ఈ స్త్రీలకు సహాయం చేయమని నిన్ను అడుగుతున్నాను. వారు క్లెమెంతుతో, నా ఇతర జతపనివారితో కూడా నాతో శుభవార్త విషయంలో ప్రయాసపడ్డారు. వారందరి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి.
4 ప్రభువులో ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి. మళ్ళీ చెపుతాను, ఆనందిస్తూ ఉండండి. 5 మనుషులందరికీ మీ సాత్వికం తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. 6 ఏ విషయంలోనూ కలత చెందకండి గాని అన్నిట్లో కృతజ్ఞతతో ప్రార్థన, విన్నపాలు చేస్తూ మీ మనవులు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు బుద్ధి అంతటికీ మించిన దేవుని శాంతి క్రీస్తు యేసుద్వారా మీ హృదయాలకూ మనసులకూ కావలి ఉంటుంది.
8 చివరగా సోదరులారా, ఏవి నిజమైనవో, ఏవి మాననీయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి శుద్ధమైనవో, ఏవి అందమైనవో, ఏవి మంచిపేరు గలవో – శ్రేష్ఠమైనవేవైనా, మెప్పుకు తగినవేవైనా ఉంటే – అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నావల్ల నేర్చుకొన్నవి, స్వీకరించినవి, విన్నవి, నాలో చూచినవి ఆచరణలో పెట్టుకోండి. అప్పుడు శాంతి ప్రదాత అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు.
10 ఇన్ని రోజులైన తరువాత నా గురించి మీ శ్రద్ధ మళ్ళీ వికసించినందుచేత ప్రభువులో చాలా ఆనందించాను. మునుపు కూడా మీకు శ్రద్ధ ఉంది గానీ దానిని చూపడానికి అవకాశం లేకపోయింది. 11  నాకు ఏదైనా అక్కర ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితులలో ఉన్నా తృప్తితో ఉండడం నేర్చుకొన్నాను. 12 దీన స్థితిలో ఎలా బ్రతకాలో సంపన్నతలో ఎలా బ్రతకాలో కూడా నాకు అనుభవ పూర్వకంగా తెలుసు. కడుపునిండా తినడం, ఆకలితో ఉండడం, సమృద్ధి కలిగి ఉండడం, లేమిని అనుభవించడం – ఏ పరిస్థితులలో అయినా ఏ సందర్భంలో అయినా ఎలా ఉండాలో నేను నేర్చుకొన్నాను. 13 నన్ను బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా అన్నిటినీ చేయగలను.
14  అయినా నా కష్టాలలో మీరు తోడ్పడడం మంచిదే. 15 నేను శుభవార్త మొదట ప్రకటించి మాసిదోనియా నుంచి వెళ్ళిన తరువాత, ఇవ్వడంలో పుచ్చుకోవడంలో మీరు తప్ప మరే సంఘంవారు పాలివారు కాలేదని ఫిలిప్పీవాసులైన మీకే తెలుసు. 16 నేను తెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా మీరు నా అక్కరలకు మాటి మాటికి సహాయం పంపారు. 17 నాకు ఈవి కావాలని నేనిలా మాట్లాడడం లేదు. మీ లెక్కకు ప్రతిఫలం అధికం కావాలని కోరుతున్నాను. 18 నాకు అంతా సమృద్ధిగా ఉంది. మీరు పంపినది ఎపఫ్రోదితస్ వల్ల నాకు ముట్టింది గనుక తక్కువేమీ లేకుండా ఉంది. అది చాలా ఇంపైనది, దేవునికి అంగీకారమైన, ఇష్టమైన యజ్ఞం.
19 నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారం మీ అక్కరలన్నీ తీరుస్తాడు. 20 మన తండ్రి అయిన దేవునికి యుగయుగాలకు మహిమ కలుగుతుంది గాక! తథాస్తు!
21 క్రీస్తు యేసులో ఉన్న ప్రతి పవిత్రునికి అభివందనాలు చెప్పండి. నాతో కూడా ఉన్న సోదరులు మీకు అభివందనాలు చెపుతున్నారు. 22 పవిత్రులంతా, ముఖ్యంగా చక్రవర్తి ఇంటివారిలో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెపుతున్నారు.
23 ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకందరికీ తోడై ఉంటుంది గాక! తథాస్తు!