ఫిలిప్పీవారికి లేఖ
1
1 ఫిలిప్పీ✽లో ఉంటూ, క్రీస్తు యేసులో ఉన్న పవిత్రులందరికీ,✽ సంఘ నాయకులకూ✽ పరిచారకులకూ✽ క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి✽ రాస్తున్న సంగతులు. 2 ✝మన తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసు క్రీస్తునుంచీ మీకు కృప, శాంతి కలుగుతాయి గాక!3 మీరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాను. 4 ✽మొదటి రోజునుంచి ఇదివరకు మీరు శుభవార్త✽ విషయంలో భాగస్వాములు, 5 గనుక నేను చేసే ప్రతి ప్రార్థన✽లోనూ మీకోసం ఎప్పుడూ ఆనందం✽తో ప్రార్థిస్తున్నాను. 6 మీలో మంచి పని ఆరంభించినవాడు✽ క్రీస్తు యేసు దినం✽వరకూ దాన్ని కొనసాగించుకొంటూ పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం✽.
7 మీ గురించి నాకిలాంటి భావం ఉండడం న్యాయమే. ఎందుకంటే మీరు నా హృదయంలో✽ ఉన్నారు. అంతేకాదు. నేను ఖైదులో✽ ఉన్నా, శుభవార్త పక్షంగా వాదిస్తూ✽ దానిని రూఢి చేస్తూ ఉన్నా మీరు నాతో దేవుని అనుగ్రహం✽లో పాలివారు. 8 మిమ్ములను చూడాలని నేను యేసు క్రీస్తు హృదయ వాత్సల్యం✽ కలిగి ఎంతో ఆశిస్తున్నాను✽. దేవుడే దీనికి నా సాక్షి. 9 ✽నా ప్రార్థన ఏమిటంటే, దేవుని మహిమ✽, స్తుతులకోసం మీరు క్రీస్తు యేసువల్ల✽ కలిగే నీతిన్యాయాల✽ ఫలాలతో✽ నిండి ఉండి 10 క్రీస్తు దినం వరకూ నిష్కపటులై, ఏ అభ్యంతరమూ కలిగించనివారై✽ ఉండేలా 11 ఏవి శ్రేష్ఠమో✽ వాటినే మెచ్చుకోవడానికి మీ ప్రేమ✽ తెలివి, అన్ని రకాల వివేచనతో అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి.
12 ✽సోదరులారా, నా పరిస్థితులు శుభవార్త మరీ ఎక్కువగా వ్యాపించడానికే✽ కారణమని మీకు తెలియాలని నా కోరిక. 13 ఎలాగంటే, నేను క్రీస్తుకోసమే ఖైదీనని✽ రాజభవనం కావలి వారందరికీ తక్కినవారందరికీ స్పష్టమైంది. 14 ✽అంతే కాక, ప్రభువులోని సోదరులలో ఎక్కువమంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి, దేవుని వాక్కు నిర్భయంగా మాట్లాడడానికి మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకొని ఉన్నారు.
15 ✽కొందరేమో అసూయ, కలహ భావం కారణంగా క్రీస్తును ప్రకటిస్తున్నారు, నిజమే. కానీ, మరికొందరు మంచి ఉద్దేశంతో ప్రకటిస్తున్నారు. 16 మొదట పేర్కొన్నవారు శుద్ధ మనసుతో కాక, కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు – నా బంధకాలకు తోడు బాధ కూడా కలిగిద్దామని వారి భావన. 17 రెండో రకం వారు ప్రేమ భావంతో అలా చేస్తున్నారు – నేను శుభవార్త పక్షంగా వాదించడానికి నియమించబడ్డ వాణ్ణని వీరికి తెలుసు.
18 ✽అయితే ఏం? నటనతోనో యథార్థంగానో అన్ని విధాలుగా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. ఇందుకు నేను ఆనందిస్తున్నాను, ఇకముందు కూడా ఆనందిస్తాను. 19 ✽ఇదంతా మీ ప్రార్థనల✽ద్వారా, యేసు క్రీస్తు ఆత్మ✽ సమృద్ధిగా ఇచ్చేదాని ద్వారా నా విడుదల కోసం జరుగుతూ ఉందని నాకు తెలుసు. 20 నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కాకుండా, ఎప్పటిలాగే ఇప్పుడు కూడా – నా జీవితంవల్ల గానీ మరణంవల్ల గానీ – పూర్ణ ధైర్యంతో✽ నా శరీరంలో✽ క్రీస్తుకు ఘనత కలుగుతుందని✽ ఒకే పట్టుగా అధిక ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నాను. 21 ఎందుకంటే నా మట్టుకైతే జీవించడమంటే క్రీస్తే✽ మరణించడమంటే లాభమే✽.
22 అయినా నేను శరీరంతో ఇంకా బ్రతుకుతూ ఉంటే ఫలవంతమైన పని✽ ఉంటుంది. నేనేమి కోరుకోవాలో✽ నాకు తెలియదు. 23 నేను ఈ రెంటిమధ్య చిక్కుబడి ఉన్నాను – లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని✽ నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం. 24 అయినా నేను శరీరంతో ఇంకా ఉండడం మీ కోసం మరీ అవసరం. 25 దీన్ని గురించి నిశ్చయత కలిగి, నేనింకా లోకంలో నిలిచి ఉండి మీకు విశ్వాసంలో అభివృద్ధి✽, ఆనందం కోసం మీ అందరితో కూడా ఉండిపోతానని✽ నాకు తెలుసు. 26 ఈ విధంగా, నేను మీ దగ్గరకు తిరిగి రావడంవల్ల నన్నుబట్టి క్రీస్తు యేసులో మీ అతిశయం అధికం అవుతుంది.
27 అయితే మీరు క్రీస్తు శుభవార్తకు తగిన విధంగా✽నే ప్రవర్తించండి. నేను మిమ్ములను చూడడానికి వచ్చినా, హాజరు కాకపోయినా మీరు ఏకాత్మతో✽ సుస్థిరంగా నిలుస్తూ✽ మీ విరోధులకు✽ ఏ విషయంలోనూ భయపడకుండా✽, శుభవార్త విశ్వాసం కోసం ఏక మనసుతో పెనుగులాడుతున్నారని✽ మీ సంగతుల గురించి నేను వినాలి. 28 ఇలాంటి ప్రవర్తన మీ విరోధులకు నాశనం, మీకు మోక్షం, దేవుని నుంచి మోక్షం, కలుగుతాయని రుజువు✽గా ఉంది. 29 ✽మునుపు మీరు నాలో పోరాటం ఉండడం చూశారు, అది ఇప్పుడు కూడా నాలో ఉందని విన్నారు. ఆ పోరాటమే మీకు కూడా ఉంది. 30 ఎందుకంటే, క్రీస్తుమీద నమ్మకముంచడం మాత్రమే కాక, ఆయన కోసం బాధలు అనుభవించడం కూడా క్రీస్తుకోసం మీకు అనుగ్రహించబడింది✽.