4
1 ✽మీకు అందిన పిలుపుకు తగినట్టుగా✽ నడుచుకోవాలని ప్రభువులో ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమిలాడు తున్నాను. 2 పూర్ణ వినయంతో సాత్వికంతో✽ ఓర్పుతో ప్రవర్తించండి. ప్రేమభావంతో ఒకరిపట్ల ఒకరు సహనం✽ చూపుతూ ఉండండి. 3 దేవుని ఆత్మ కలిగించే సమైక్యతను✽ శాంతి బంధంలో కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి.4 క్రీస్తు శరీరం✽ ఒక్కటే. దేవుని ఆత్మ✽ ఒక్కడే. మీకందిన పిలుపు గురించిన ఆశాభావం✽ కూడా ఒక్కటే. 5 ఒక్కడే ప్రభువు✽. ఒక్కటే విశ్వాసం✽. ఒక్కటే బాప్తిసం✽. 6 అందరికీ తండ్రి అయిన దేవుడు✽ ఒక్కడే. ఆయనే అందరికీ పైగా, అందరి ద్వారాను, మీలో ప్రతి వ్యక్తిలో✽ ఉన్నాడు.
7 ✽✝అయితే మనలో ప్రతి ఒక్కరికీ క్రీస్తు కొలిచి ఇచ్చిన వరం ప్రకారం కృప ఇవ్వబడింది. 8 ✝అందుచేత ఆయన లేఖనంలో ఇలా చెపుతున్నాడు: ఆయన ఆరోహణం అయినప్పుడు ఖైదీలను ఊరేగింపులో తీసుకువెళ్ళాడు. మనుషులకు ఈవులిచ్చాడు. 9 “ఆరోహణమయ్యాడు” అంటే మొదట ఆయన భూమి క్రింది భాగాలలోకి✽ దిగాడని అర్థమిస్తుంది గదా. 10 క్రిందికి దిగినవాడే సర్వాన్ని నింపేలా✽ ఆకాశాలన్నిటికంటే ఎంతో పైకి ఎక్కిపోయాడు✽.
11 ✝ఆయన తన రాయబారులుగా✽ కొందరినీ, ప్రవక్తలను✽ కొందరినీ, శుభవార్త ప్రచారకులను✽ కొందరినీ, సంఘ కాపరులూ ఉపదేశకులూ✽ అయిన కొందరినీ సంఘానికి ఇచ్చాడు. 12 ✽ఎందుకంటే, పవిత్రులు సేవ✽ చేసేందుకు సమర్థులు కావాలనీ క్రీస్తు శరీరం పెంపొందాలనీ✽ ఆయన ఉద్దేశం. 13 ✽మనమందరమూ నమ్మకంలో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంతో ఏకీభావం పొంది, సంపూర్ణ వృద్ధికి వచ్చేవరకూ – క్రీస్తు సంపూర్ణత ఉన్నతి పరిమాణం అందుకొనేవరకూ ఇలా జరుగుతూ ఉండాలని ఆయన ఉద్దేశం. 14 ✝మనం ఇకనుంచి పసి పిల్లల్లాగా ఉండకూడదు అన్నమాట. అంటే, అలల తాకిడికి అటూ ఇటూ కొట్టుకుపోయే వారిలాగా, ప్రతి మత సిద్ధాంతం గాలికీ ఎగిరిపోయే✽వారిలాగా మనముండకూడదు. మనుషులు కపటంచేత కుయుక్తితో కల్పించే మాయోపాయాలకు కొట్టుకుపోకూడదు. 15 గానీ ప్రేమతో సత్యం చెపుతూ, క్రీస్తులో అన్ని విషయాలలో పెరగాలి. ఆయనే శిరస్సు. 16 ఆయననుంచి శరీరమంతా ప్రతి కీలూ అందించే దానిచేత ఏకమై చక్కగా అమర్చబడి✽ ఉంది. అందులోని ప్రతి భాగమూ సరిగా దాని పని చేయడంవల్ల శరీరం ప్రేమలో పెంపొందుతూ వర్థిల్లుతూ ఉంటుంది.
17 అందుచేత ఇప్పటినుంచి మిగిలిన ఇతర జనాలలాగా ప్రవర్తించకూడదని✽ నేను ప్రభువు పేర సాక్షిగా చెపుతున్నాను. 18 వారు తమ వ్యర్థమైన✽ ఆలోచనలను అనుసరిస్తారు. వారి మనసు చీకటిమయం✽. వారి హృదయాలు బండబారి✽పోవడం చేత వారిలో కలిగిన అజ్ఞానం✽ కారణంగా దేవుని జీవం నుంచి పరాయివారుగా వేరై✽ఉన్నారు. 19 ✽ సిగ్గుమాలినవారై అత్యాశతో అన్ని విధాల కల్మషాలను చేయడానికి కామ వికారాలకు✽ తమను తాము ఇచ్చివేసుకొన్నారు.
20 ✽అయితే మీరలా క్రీస్తును నేర్చుకోలేదు. 21 మీరు ఆయన స్వరం విని ఆయనచేత ఉపదేశం పొందారు. ఇది నిజమైతే యేసులో సత్యమున్న✽ ప్రకారం 22 మీ మునుపటి జీవిత విధానం విషయంలోనైతే మోసకరమైన కోరికలచేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత “మానవుణ్ణి”✽ తొలగించాలి. 23 ✽ మీ మనసు లక్ష్యం విషయంలో కొత్తదనం పొందాలి. 24 దేవుని అనుగుణంగా✽ నిజమైన నీతిన్యాయాలతో పవిత్రతతో సృజించబడ్డ కొత్త “మానవుణ్ణి”✽ ధరించుకోవాలి✽.
25 ✽✽ అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి. మనం ఒకరికి ఒకరం అవయవాలం, గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యం చెప్పుకోండి. 26 ✽ కోపపడండి గాని అపరాధం చేయకుండా ఉండండి. మీకు రేగిన కోపం ప్రొద్దు క్రుంకే ముందే అంతరించాలి. 27 ✽అపనింద పిశాచానికి చోటివ్వకండి. 28 పూర్వం దొంగతనం✽ చేసినవారు ఇకనుంచి దొంగతనం చేయకూడదు. అతడు అక్కరలో ఉన్నవారికి ఏదైనా పంచిపెట్టడానికి✽ ఒక మంచి వృత్తి చేపట్టి స్వహస్తాలతో కష్టించి పని చేయాలి.
29 చెడ్డ మాటలేవీ✽ మీ నోటినుంచి రానివ్వకండి గాని వినేవారికి ప్రయోజనం లభించేలా అవసరాలు చూచి అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలకండి. 30 దేవుని పవిత్రాత్మను దుఃఖపెట్టకండి✽. మోక్ష దినంకోసం ఆయన మీమీద ముద్ర✽ వేశాడు. 31 ✽సమస్తమైన ద్వేషం, ఆగ్రహం, కోపం, అల్లరి, దూషణ, సమస్తమైన దుర్మార్గాన్ని విసర్జించండి. 32 ✽ ఒకరిమీద ఒకరు కరుణభావంతో దయ చూపుతూ ఉండండి. క్రీస్తులో దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారమే మీరూ ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి.