3
1 ఈ కారణంచేత నేను – పౌలును – ఇతర ప్రజలైన మీ నిమిత్తం యేసు క్రీస్తు ఖైదీ అయి ఉన్నాను. 2 మీకోసం తన కృప విషయంలో దేవుడు నాకు అప్పగించిన నిర్వహణ గురించి మీరు వినే ఉంటారు. 3 అంటే, ఆయన క్రీస్తును గురించిన రహస్య సత్యం వెల్లడించి నాకు తెలియజేశాడు – ఇంతకు ముందు ఈ విషయం నేను క్లుప్తంగా రాశాను గదా. 4 అది చదవడంవల్ల క్రీస్తు రహస్య సత్యం గురించి నాకు కలిగిన ఎరుక మీకు అర్థమవుతుంది. 5  ఈ రహస్య సత్యం ఈ కాలంలో దేవుడు తన పవిత్ర రాయబారులకూ ప్రవక్తలకూ తన ఆత్మ ద్వారా వెల్లడి చేసినట్టు పూర్వ కాలాలలో మనుషులకు తెలియజేయలేదు. 6 ఈ సత్యమేమంటే, శుభవార్తవల్ల ఇతర ప్రజలు యూదులతోపాటు సాటి వారసులు, ఒకే శరీరంలో భాగాలు, క్రీస్తులో దేవుని వాగ్దానాలలో వంతుదారులు.
7 దీని విషయంలో నేను సేవకుణ్ణి అయ్యాను. ఇలా కావడం దేవుడు తన కృపప్రకారం, ఆయన బలప్రభావాల కార్యం ద్వారా నాకు ఉచితంగా ప్రసాదించినది. 8 నేను పవిత్రులందరిలోనూ అత్యల్పుణ్ణి. అయినా క్రీస్తు అపార ఐశ్వర్యాన్ని ఇతర జనాలకు ప్రకటించడానికి ఈ కృప నాకు ఇవ్వబడింది! 9 ఆ రహస్య సత్యం సహవాసం ఏమిటో అందరికీ స్పష్టం చేయడానికి ఈ కృప నాకు కలిగింది. యేసుక్రీస్తు ద్వారా అన్నిటినీ సృజించిన దేవునిలోనే అనాది కాలం నుంచీ ఈ సంగతి మరుగై ఉండేది. 10 ఇప్పుడైతే సంఘం ద్వారా పరమ స్థలాలలో ఉన్న ప్రధానులకూ అధికారులకూ దేవుని నానా విధాల జ్ఞానమెలాంటిదో తెలియాలని ఆయన ఉద్దేశం. 11 ఇదంతా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఆయన నెరవేర్చిన శాశ్వత సంకల్పం ప్రకారమే.
12 క్రీస్తు మీది నమ్మకం ద్వారా, ఆయనలో మనకు ధైర్యం, దేవుని సన్నిధానంలోకి నిర్భయమైన ప్రవేశం ఉన్నాయి. 13 అందుచేత, మీకోసం నేను పడుతున్న బాధలకు క్రుంగిపోవద్దని మిమ్ములను వేడుతున్నాను – ఆ బాధలు మీకు ఘనతే!
14 ఈ కారణం చేత నేను మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి ఎదుట మోకరిల్లుతున్నాను. 15 పరలోకంలో, భూమిమీద ఆయన నుంచి ఉన్న ప్రతి వంశానికి పేరు వచ్చింది. 16 విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసముండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మవల్ల బలప్రభావాలతో బలపడాలని ఆయనను తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 17 మీరు ప్రేమలో పాతుకొని స్థిరపడి 18 పవిత్రులందరితోపాటు క్రీస్తు ప్రేమకున్న వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలగాలనీ, 19 జ్ఞానానికి మించిన ఆ ప్రేమ తెలుసుకోవాలనీ మీరు దేవుని సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయినవారు కావాలనీ ఆయనను ప్రార్థిస్తున్నాను.
20 మనలో పని చేస్తూ ఉన్న తన బలప్రభావాల ప్రకారం, మనం అడిగేవాటన్నిటికంటే, ఆలోచించే వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయగలవాడు ఆయన. 21 ఆయనకే సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరాలకూ యుగయుగాలకూ మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.