2
1 ✽మీరు అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారై✽ ఉన్నప్పుడు ఆయన మిమ్ములను బ్రతికించాడు. 2 పూర్వం మీరు వాటిలో నడుచుకొంటూ ఉండేవారు. లోకం పోకడ✽నూ, వాయుమండల రాజ్యాధికారి✽నీ – అంటే, క్రీస్తుపట్ల విధేయత లేనివారిలో పని చేస్తూ ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకొనేవారన్న మాట. 3 మునుపు మనమందరమూ✽ వారితోపాటు మన శరీర స్వభావ కోరికల✽ ప్రకారం ప్రవర్తించేవారం, శరీర స్వభావానికీ మనసుకూ ఇష్టమైనవాటిని తీర్చుకొంటూ ఇతరులలాగే స్వభావసిద్ధంగా దేవుని కోపానికి✽ పాత్రులుగా ఉండేవారం.4 కానీ దేవుడు! కరుణాసంపన్నుడు✽! ఆయన మనలను ఎంతో ప్రేమించాడు✽. 5 ✽మనం మన అతిక్రమాలలో చచ్చినవారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహా ప్రేమనుబట్టి మనలను క్రీస్తుతోపాటు బ్రతికించాడు. (మీకు పాపవిముక్తి, రక్షణ కలిగింది కృపచేతే.)
6 అంతేకాదు. ఆయనతోకూడా మనలను పైకెత్తి✽ ఆయనతోకూడా పరమ స్థలాలలో క్రీస్తు యేసులో కూర్చోబెట్టుకొన్నాడు. 7 ✽రాబోయే యుగాలలో మనమీద క్రీస్తు యేసులో దయ చూపుతూ అపరిమితమైన తన కృపాసమృద్ధి వెల్లడి చేయాలని ఆయన ఉద్దేశం.
8 ✽మీకు పాపవిముక్తి, రక్షణ కలిగింది కృపచేతే, విశ్వాసం ద్వారానే✽. అది మీవల్ల కలిగింది కాదు. దేవుడు ఉచితంగా ఇచ్చినదే✽. 9 ఎవరూ డంబంగా మాట్లాడుకోకుండా ఉండేందుకు అది క్రియలవల్ల కలిగింది కాదు. 10 ✽ఎందుకంటే మనం ఆయన చేసినవారం. దేవుడు ముందుగా ఏర్పాటు చేసిన మంచి పనులలో మనం నడవాలని వాటికోసం మనలను క్రీస్తుయేసులో సృజించాడు.
11 ✽కాబట్టి మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. మునుపు మీరు శారీరకంగా ఇతర ప్రజలు✽. “సున్నతి ఉన్నవారు” అనే బిరుదు వహించినవారు మిమ్ములను “సున్నతి లేనివారు” అని పిలిచేవారు. (ఆ సున్నతి ఉన్నది శరీరంలోనే, హస్త కృత్యం మాత్రమే.) 12 ✽ఆ కాలంలో మీరు క్రీస్తునుంచి వేరుగా ఉన్నారు, ఇస్రాయేల్‌లో పౌరత్వంలేనివారు, బయటివారు, వాగ్దానాలతో కూడిన ఒడంబడికల విషయంలో పరాయివారు. అప్పుడు మీకు లోకమంతట్లో ఆశాభావం లేదు, దేవుడూ లేడు. 13 అయితే మునుపు దూరంగా ఉన్న మీరు✽ ఇప్పుడు క్రీస్తు రక్తంచేత క్రీస్తు యేసులో చేరువయ్యారు.
14 ఆయన తానే మనకు సమాధానం✽. ఆయన మన ఉభయులను ఒక్కటిగా చేశాడు, యూదులకు యూదేతరులకూ మధ్య ఉన్న అడ్డుగోడను కూలగొట్టి తన శరీరం✽ ద్వారా ఆ వైరాన్ని, అంటే నిర్ణయాల్లో ఇమిడి ఉన్న ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో రద్దుచేశాడు. 15 ఇరుపక్షాలను కలిపి తనలో ఒక కొత్త “మానవుణ్ణి” ✽చేయాలనే ఆయన ఉద్దేశం. ఈ విధంగా సమాధానం కల్పించాడు. 16 తన సిలువ మరణం ద్వారా ఆ వైరాన్ని నిర్మూలించి ఉభయ జనాలను ఒకే శరీరంలో దేవునితో సఖ్యపరిచాడు✽.
17 అప్పుడు ఆయన✽ వచ్చి దూరంగా ఉన్న✽ మీకూ, చేరువగా ఉన్న✽వారికీ సమాధానం ప్రకటించాడు. 18 ✽ఆయన ద్వారా మీరూ మేమూ ఒకే ఆత్మద్వారా పరమ తండ్రి సన్నిధానంలోకి ప్రవేశం కలిగి ఉన్నవారము.
19 ✽అందుచేత మీరు ఇకమీదట పరాయివారు కారు, బయటివారు కారు. మీరు పవిత్రులతోకూడా దేవుని రాజ్యంలో సాటి పౌరులే✽! దేవుని ఇంటివారిలో✽ ఉన్నవారే! 20 ✽క్రీస్తు రాయబారులూ✽ ప్రవక్తలూ✽ వేసిన పునాదిమీద మీరు కట్టబడి ఉన్నారు. దానికి యేసు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి.✽ 21 ఆయనలో ఈ కట్టడమంతా ఒక భాగంతో ఒకటి చక్కగా కుదిరినది. ఇది ప్రభువులో పెంపారుతూ పవిత్ర దేవాలయంగా రూపొందుతూ✽ ఉంది. 22 దేవుని ఆత్మలో దేవునికి నివాసం✽గా ఆయనలో మిమ్ములను కూడా✽ నిర్మించడం జరుగుతూ ఉంది.