ఎఫెసువారికి లేఖ
1
1 ఎఫెసులో ఉన్న పవిత్రులూ, క్రీస్తు యేసులో ఉన్న నమ్మకస్థులూ అయిన వారికి దేవుని సంకల్పంవల్ల యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు రాస్తున్న సంగతులు. 2 మన తండ్రి అయిన దేవుని నుంచీ ప్రభువైన యేసు క్రీస్తునుంచీ మీకు కృప, శాంతి కలుగుతాయి గాక!
3 మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడూ తండ్రీ అయినవానికి స్తుతులు కలుగుతాయి గాక! పరమ స్థలాలలో ఆయన సమస్త ఆధ్యాత్మిక ఆశీస్సులతో మనలను క్రీస్తులో దీవించాడు. 4 ఎందుకంటే, మనం ఆయన సన్నిధానంలో పవిత్రంగా, నిర్దోషంగా ఉండాలని ప్రపంచం ఉనికిలోకి రాకముందే ఆయన క్రీస్తులో మనలను ఎన్నుకొన్నాడు. 5 తాను ప్రేమభావంతో యేసు క్రీస్తుద్వారా మనలను కుమారులుగా స్వీకరించడానికి ముందుగానే నిర్ణయించుకొన్నాడు. ఇది ఆయన సంకల్పంలో ఉన్న మంచి ఉద్దేశం ప్రకారమే. 6 దీనిద్వారా తన దివ్య కృపకు కీర్తి కలగాలని ఆయన భావం. ఆ కృప ద్వారా తాను ప్రేమించినవానిలో మనల్ని స్వీకరించాడు. 7 ఆయన కృప సమృద్ధి ప్రకారమే ఆయనలో ఆయన రక్తంద్వారా మనకు విముక్తి, అంటే మన పాపాలకు క్షమాపణ, కలిగింది. 8 ఈ కృప సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనమీద విరివిగా కుమ్మరించాడు. 9 ఆయన తన సంకల్పంలో ఉన్న రహస్య సత్యాన్ని మనకు వెల్లడి చేశాడు. అదేమంటే 10 కాలం పరిపక్వమైనప్పుడు పరలోకంలో, భూమిమీద ఉన్న సమస్తమూ ఏకంగా క్రీస్తులోకి తేవాలని తనలో తన మంచి ఉద్దేశం ప్రకారం సంకల్పించాడు.
11 ఆయనలో మనకు వారసత్వం కూడా లభించింది. దానికి దేవుడు మనలను తన ఉద్దేశం ప్రకారం ముందుగానే నిర్ణయించాడు. ఆయన తన సంకల్పాన్ని అనుసరించిన ఆలోచనను బట్టే సమస్తమూ జరిగిస్తాడు. 12 మొదట క్రీస్తుమీద నమ్మకం కలిగిన మనం తన మహిమకు కీర్తి అయి ఉండాలని ఆయన ఉద్దేశం.
13 మీరు కూడా సత్య వాక్కు – మీ రక్షణ శుభవార్త – విన్నప్పుడు ఆయనమీద నమ్మకం ఉంచారు. మీరు నమ్మి ఆయనలో దేవుడు వాగ్దానం చేసిన పవిత్రాత్మ ముద్ర మీమీద పడింది. 14 పవిత్రాత్మ మనకు మన వారసత్వం గురించి హామీగా ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలిగేందుకు తాను సంపాదించుకొన్న దాని విమోచన పూర్తి అయ్యేవరకూ ఈ హామీ ఉంటుంది.
15 ఈ కారణంచేత, ప్రభువైన యేసుమీద మీ నమ్మకాన్ని గురించీ, పవిత్రులందరిపట్లా మీ ప్రేమభావాన్ని గురించీ విన్నప్పటినుంచి నేను కూడా 16 నా ప్రార్థనలలో మిమ్ములను జ్ఞాపకం ఉంచుకొంటూ, మీ గురించి కృతజ్ఞతలు చెప్పడం మానలేదు. 17 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు – మహిమ స్వరూపి అయి తండ్రి – ఆయనను తెలుసుకోవడంలో జ్ఞానప్రకాశాలు గల మనసు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 18  ఆయన పిలుపు గురించిన ఆశాభావం ఎలాంటిదో మీరు తెలుసుకొనేలా మీ మనోనేత్రాలు వెలుగొందాలనీ పవిత్రులలో ఆయనకున్న మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో, 19 తనను నమ్ముకొన్న మనపట్ల ఆయన బలప్రభావాల అపరిమితమైన ఆధిక్యమెలాంటిదో మీరు తెలుసుకోవాలనీ నా ప్రార్థన. అది తాను క్రీస్తులో వినియోగించుకొన్న మహా బలప్రభావాల ప్రకారమే. 20 ఆ బలప్రభావాలచేత ఆయన క్రీస్తును చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపి పరమ స్థలాలలో తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకొన్నాడు. 21 సర్వాధిపత్యం కంటే, అధికారంకంటే, శక్తికంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగంలో గానీ వచ్చే యుగంలో గానీ పేరుగాంచిన మరి దేనికంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడన్నమాటే. 22 అన్నిటినీ ఆయన పాదాలక్రింద ఉంచాడు. ఆయనను అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు. 23 ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత.