5
1 క్రీస్తు మనలను దాస్యంలో నుంచి విడిపించాడు. ఆ విడుదలలో సుస్థిరంగా నిలిచి ఉండండి, దాస్యం కాడికి మళ్ళీ లొంగిపోకండి. 2 చూడండి, నేను – పౌలునే – మీకీ మాట చెపుతున్నాను – మీరు సున్నతి పొందితే క్రీస్తువల్ల మీకు ప్రయోజనమేమీ ఉండదు. 3 సున్నతి పొందిన ప్రతి మనిషికీ నేను మరో సారి నొక్కి చెప్పేది ఏమిటంటే, అలాంటివాడు ధర్మశాస్త్రం అంతటిని పాటించడానికి బద్ధుడు. 4 మీలో ధర్మశాస్త్రంవల్ల నిర్దోషుల లెక్కలోకి రావాలని చూస్తున్నవారు క్రీస్తు చైతన్యం నుంచి దూరమైపోయారు, కృప మార్గం నుంచి పతనమయ్యారు. 5 ఎందుకంటే, మనం విశ్వాసం మూలమైన నీతిన్యాయాల గురించిన ఆశాభావం నెరవేర్పు కోసం దేవుని ఆత్మ ద్వారా ఆతురతతో ఎదురు చూస్తున్నాం. 6  క్రీస్తు యేసులో సున్నతి గాని సున్నతి లేనితనం గానీ ఏమీ సాధించదు. ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.
7 మునుపు మీరు బాగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. సత్యాన్ని పెడచెవిని పెట్టేలా మిమ్ములను అడ్డగించినదెవరు? 8 విధంగా చేయడానికి ఒప్పించినది మిమ్ములను పిలుస్తున్న దేవుడు కాదు. 9  పొంగజేసే పదార్థం కొంచెమైనా పిండి ముద్దనంతా పొంగజేస్తుంది. 10 మీరు వేరే అభిప్రాయం కలిగి ఉండరని మీ విషయం ప్రభువులో నాకు నమ్మకం ఉంది. మీకు కలవరం కలిగించేవాడు – అతడెవడైనా సరే – శిక్ష భరించవలసివస్తుంది.
11 సోదరులారా, సున్నతి పొందాలని ఒకవేళ నేనింకా ప్రకటిస్తూ ఉంటే నేనెందుకు ఇంకా హింసలకు గురి అవుతూ ఉన్నాను? ఆ పక్షంలో సిలువను గురించిన తొట్రుపాటు కారణం లేకుండా పోతుంది. 12 మిమ్ములను కలవరపెట్టేవారు అంగచ్ఛేదం చేసుకోవాలని కోరి ఉండేవాణ్ణి.
13 సోదరులారా, దేవుడు మిమ్ములను పిలిచింది విడుదలకే అయినా మీ విడుదలను శరీర స్వభావానికి అవకాశంగా వినియోగించుకోకండి. దానికి బదులు ప్రేమభావంతో ఒకరికొకరు సేవ చేయండి. 14 ధర్మశాస్త్రమంతా ఒకే ఒక మాటలో ఇమిడి ఉంది. ఏమిటంటే, “మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.” 15 గానీ మీరు ఒకరినొకరు కరచుకొంటూ దిగమింగివేస్తూ ఉంటే ఒకరివల్ల ఒకరు పూర్తిగా ధ్వంసమైపోతారేమో జాగ్రత్త!
16 నేను చెప్పేదేమంటే, దేవుని ఆత్మకు లోబడి నడుచుకోండి. అప్పుడు శరీర స్వభావం కోరేవాటిని చేయరు. 17 శరీర స్వభావం కోరేవి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ కోరేవి శరీర స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నాయి – పరస్పర వైరం ఉంది, గనుక మీరేవి చేయాలని ఇష్టపడుతున్నారో అవి మీరు చేయలేకపోతున్నారు. 18 గానీ దేవుని ఆత్మ మిమ్ములను నడిపిస్తూ ఉంటే మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు.
19 శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం, 20 విగ్రహపూజ, మంత్ర ప్రయోగం, ద్వేషం, కలహాలు, ఈర్ష్యాభావాలు, కోపోద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు, 21 అసూయ, హత్యలు, త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులు మొదలయినవి. వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్ళీ ముందుగా చెపుతున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు.
22 దేవుని ఆత్మ ఫలమైతే ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, 23 సాత్వికం, ఇంద్రియ నిగ్రహం. ఇలాంటివాటికి వ్యతిరేకమైన నియమమేమీ లేదు. 24 క్రీస్తుకు చెందినవారు శరీర స్వభావాన్ని, దానితోకూడా దాని కోరికలనూ ఇచ్ఛలనూ సిలువ వేశారు. 25 దేవుని ఆత్మలో మనం బ్రతుకుతూ ఉంటే ఆ ఆత్మననుసరించి నడుచుకొందాం. 26 వట్టి డాంబికులం కాకుండా, ఒకరికొకరం కోపం రేపకుండా ఒకరిమీద ఒకరం అసూయపడకుండా ఉందాం.