6
1 సోదరులారా, ఒకవేళ ఎవరైనా ఒకరు అతిక్రమంలో చిక్కుపడితే మీలో ఆధ్యాత్మిక వ్యక్తులు సాత్వికంతో✽ అలాంటి వ్యక్తిని పూర్వ క్షేమ స్థితికి తేవాలి. మీరు కూడా ఆ విషయంలో విషమ పరీక్షకు గురి కాకుండా✽ మీ గురించి చూచుకోవాలి. 2 ✽ఒకరి కష్టమైన భారాలు ఒకరు భరించి తద్వారా క్రీస్తు నియమం నెరవేర్చండి. 3 ✽వట్టివాడెవడైనా తానేదో గొప్పవాణ్ణననుకొంటే తనను మోసం చేసుకొంటున్నాడన్న మాట. 4 ✽ ప్రతి ఒక్కరూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే తనకు అతిశయ కారణం ఉంటుంది. 5 ✽ఎందుకంటే ప్రతి ఒక్కరు తన బరువు తానే మోసుకోవాలి గదా.6 ✝వాక్యోపదేశం పొందిన వ్యక్తి తన మంచి వస్తువులన్నిట్లో ఉపదేశమిచ్చేవానికి కొంత ఇవ్వాలి.
7 ✽మోసపోకండి – దేవుణ్ణి తిరస్కరించి తప్పించుకోవడం అసాధ్యం. మనిషి వెదజల్లే దానినే కోస్తాడు. 8 ✽శరీర స్వభావాన్ని అనుసరించి వెదజల్లేవారు శరీర స్వభావం నుంచి నాశనం అనే పంట కోసుకొంటారు. దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లేవారు ఆత్మనుంచి శాశ్వత జీవమనే పంట కోసుకొంటారు. 9 మంచి చేస్తూ ఉండడం✽లో నిరుత్సాహం చెందకుండా ఉందాం. మనం పట్టు విడవకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకొంటాం. 10 కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అందరికీ✽ – మరి విశేషంగా విశ్వాస గృహానికి చేరినవారికి – మంచి చేస్తూ ఉందాం.
11 నా సొంత చేతితో ఎంత పెద్ద అక్షరాలతో✽ రాస్తున్నానో గమనించండి! 12 ✽సున్నతి పొందాలని మిమ్ములను బలవంతం చేయడానికి ప్రయత్నించేవారి ఆశ ఏమంటే పైకి తాము ఘనులుగా చూపుకోవడమే. క్రీస్తు సిలువను గురించిన హింసలకు తాము గురి కాకుండా ఉండాలని వారి ఉద్దేశం. 13 అయితే సున్నతి ఉన్నవారు సైతం ధర్మశాస్త్రాన్ని ఆచరణలో పెట్టరు✽. మీకు సున్నతి చేయించి ఆ శరీర విషయంలో గురించి అతిశయంగా✽ మాట్లాడాలని వారి ఆశ. 14 నాకైతే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువను బట్టి తప్ప మరి దేనిని బట్టీ అతిశయంగా మాట్లాడడం దూరం అవుతుంది గాక! ఆయన ద్వారా లోకానికి నేనూ నాకు లోకమూ సిలువ✽ మరణం చెందినట్టే✽. 15 క్రీస్తు యేసులోని వారికి సున్నతి సంస్కారం గాని సున్నతి లేకపోవడం గానీ ఏమీ సాధించదు. కావలసినది కొత్త సృష్టి✽. 16 ఈ నియమం✽ ప్రకారం నడుచుకొనేవారందరికి, దేవుని ఇస్రాయేల్ ప్రజకు✽ కూడా శాంతి, కరుణ కలుగుతాయి గాక.
17 ✽నేను ప్రభువైన యేసు ముద్రలు✽ నా శరీరంమీద ధరించుకొంటున్నాను గనుక ఇకమీదట ఎవరూ నన్ను శ్రమ పెట్టకూడదు.
18 సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహం✽ మీ ఆత్మలకు తోడై ఉంటుంది గాక. తథాస్తు!