4
1 నేను చెప్పేదేమిటంటే, వారసునికి ఆస్తి అంతా చెందినా అతడు పసితనంలో ఉన్నంత కాలమూ ఈ విషయంలో అతనికీ దాసునికీ భేదమేమీ లేదు. 2 అంటే, తండ్రి నిర్ణయించే రోజువరకు అతడు సంరక్షకుల క్రింద, ఆస్తి నిర్వాహకుల క్రింద ఉంటాడు. 3 మన సంగతి కూడా అంతే. మనం పసితనంలో ఉన్నప్పుడు లోకం ప్రాథమిక విషయాల క్రింద దాస్యంలో ఉన్నాం.
4 అయితే కాలం పరిపక్వం కాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కుమారుడు స్త్రీ గర్భాన జన్మించాడు, 5 ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారిని విమోచించాలని – మనం దత్త పుత్రులమయ్యేలా – ఆయన ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. 6 మీరు దేవుని సంతానం గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ మనలో “తండ్రీ! తండ్రీ!” అని పిలుస్తున్నాడు. 7 కాబట్టి నీవింకా దాసుడివి కావు, కుమారుడివి. కుమారుడివైతే క్రీస్తు ద్వారా దేవుని వారసుడివి కూడా.
8 కాని, ఆ కాలంలో, మీరు దేవుణ్ణి ఎరగకముందు, ప్రకృతిసిద్ధంగా వాస్తవం కాని దేవుళ్ళకు బానిసత్వంలో ఉన్నారు. 9 ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగినవారు – మరి విశేషంగా దేవుడు మిమ్ములను ఎరిగినవాడు. ఇలాంటప్పుడు దుర్బలమైన, వ్యర్థమైన ప్రాథమిక విషయాలకు మళ్ళీ బానిసలుగా ఉండగోరి వాటి వైపు మళ్ళీ తిరుగుతున్నారు ఎందుకని? 10 మీరు దినాలు, నెలలు, మహోత్సవ కాలాలు, సంవత్సరాలు పాటిస్తారు. 11 మీ విషయంలో నేను పడ్డ కష్టాలు ఒకవేళ వ్యర్థమై పోతాయేమో అని మీ గురించి నాకు భయం వేస్తూ ఉంది.
12 సోదరులారా, నేను మీలాంటివాణ్ణయ్యాను గనుక మీరు నాలాంటివారు కావాలని మిమ్ములను వేడుకొంటున్నాను. మీరు నాకు కీడేమీ చేయలేదు. 13 మొదటి సారి నేను మీకు శారీరక బలహీనత ద్వారా శుభవార్త ప్రకటించానని మీకు తెలుసు. 14 నా శరీరంలో నాకు విషమ పరీక్షగా ఉన్నదాన్ని మీరు చిన్నచూపు చూడలేదు, తృణీకరించలేదు గాని దేవదూతనూ క్రీస్తు యేసునూ స్వీకరించే ప్రకారం నన్ను స్వీకరించారు. 15 అప్పుడు మీకున్న దీవెన ఏది? సాధ్యమైతే మీ కండ్లు ఊడబెరికి నాకిచ్చి ఉండేవారేనని మీ గురించి సాక్ష్యం చెపుతున్నాను. 16 మీతో సత్యం చెప్పడంవల్ల నేను మీకు విరోధినయ్యానా ఏమిటి?
17 వారికి మీరంటే ప్రత్యేక శ్రద్ధే గాని వారి ఉద్దేశం మంచిది కాదు. మీకే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగేలా మిమ్ములను మా నుంచి వేరు చేయాలని కోరుతున్నారు. 18 ఉద్దేశం మంచిదైతే ఎప్పుడైనా ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండడం మంచిదే – నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు. 19 నా చిన్న పిల్లలారా! క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయంలో మళ్ళీ ప్రసవ వేదనలు పడుతూ ఉన్నాను! 20 మీ గురించి నాకు ఎటూ తోచకుండా ఉంది. నేనిప్పుడు మీతో ఉండి మరో విధంగా మాట్లాడాలని నా కోరిక.
21 ధర్మశాస్త్రం క్రింద ఉండగోరే వారలారా, ధర్మశాస్త్రం చెప్పేది మీరు వినడం లేదా, చెప్పండి? 22 ఇలా రాసి ఉంది గదా: అబ్రాహాముకు ఇద్దరు కొడుకులు – బానిసవల్ల ఒకడు, స్వతంత్రురాలివల్ల మరొకడు. 23 గాని బానిస కొడుకు శరీర రీతిగా పుట్టాడు, స్వతంత్రురాలి కొడుకు దేవుని వాగ్దానం ఫలితంగా పుట్టాడు.
24 ఈ విషయంలో అలంకారిక సాదృశ్యం ఉంది. ఎలాగంటే, ఆ ఇద్దరు స్త్రీలూ రెండు ఒడంబడికలు. ఒకటి సీనాయి పర్వతం నుంచి వచ్చి దాస్యానికి పిల్లలను కలిగిస్తుంది. ఇది హాగరు. 25 ఈ హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతం. అది ఇప్పటి జెరుసలంకు గుర్తుగా ఉంది. ఎందుకంటే జెరుసలం తన పిల్లలతోపాటు దాస్యంలో ఉంది. 26 అయితే పైనున్న జెరుసలం స్వతంత్రంగా ఉంది. అదే మనకందరికీ తల్లి.
27  గొడ్రాలా! పిల్లలను కననిదానా! ఆనందించు! ప్రసవ వేదన పడనిదానా! బిగ్గరగా కేకలు పెట్టు! ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే ఒంటరిగా ఉన్నదాని పిల్లలే ఎక్కువ అని రాసి ఉంది గదా.
28 సోదరులారా, మనం ఇస్సాకులాగే వాగ్దాన సంతానం. 29  ఆ కాలంలో శరీరరీతిగా పుట్టినవాడు దేవుని ఆత్మ ప్రకారం పుట్టినవాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. 30 అయితే లేఖనం ఏమంటుంది? – బానిసనూ దాని కొడుకునూ వెళ్ళగొట్టు! ఎందుకంటే బానిస కొడుకు స్వతంత్రురాలి కొడుకుతోపాటు వారసుడు కాబోడు! 31 కాబట్టి, సోదరులారా, మనం బానిస సంతానం కాము గాని స్వతంత్రురాలి సంతానమే.