3
1 ఓ తెలివితక్కువ గలతీయవారలారా! మీరు సత్యానికి లోబడకుండా మిమ్ములను భ్రమపెట్టినదెవరు? సిలువకు గురి అయినట్టే యేసు క్రీస్తును కండ్లకు కట్టినట్టుగా మీకు వివరించడం జరిగింది గదా! 2 ఈ ఒకే విషయం మీ నుంచి తెలుసుకోవాలని నాకుంది. మీరు దేవుని ఆత్మను పొందినది ధర్మశాస్త్ర క్రియలచేతా? విశ్వాసంతో శుభవార్త వినడంవల్లా? 3 మీరింత తెలివితక్కువవారా? దేవుని ఆత్మతో మొదలుపెట్టి ఇప్పుడు శరీర స్వభావంవల్ల మీరు సంపూర్ణులు అవుతున్నారా? 4 మీరిన్ని బాధలుపడింది వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమవుతుందా? 5 మీకు తన ఆత్మను ప్రసాదించి మీ మధ్య అద్భుతాలు జరిగిస్తున్న దేవుడు ధర్మశాస్త్ర క్రియలను బట్టి అలా చేస్తున్నాడా? లేక మీరు విశ్వాసంతో వినడం బట్టేనా?
6 దీనికి అనుగుణంగా అబ్రాహాము “దేవునిమీద నమ్మకం ఉంచాడు. అతనికి ఆ నమ్మకమే నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది.”
7 అందుచేత, విశ్వాస సంబంధులే అబ్రాహాము సంతానమని తెలుసుకోండి. 8 దేవుడు ఇతర జనాలను విశ్వాసం ద్వారానే నిర్దోషులుగా ఎంచుతాడని దూరదృష్టితో లేఖనం ముందుగానే అబ్రాహాముకు “నీ మూలంగా జనాలన్నీ ధన్యమవుతాయి” అని శుభవార్త ప్రకటించింది. 9 అలాగే విశ్వాస సంబంధులే విశ్వాసముంచిన అబ్రాహాముతోకూడా ధన్యులు.
10  ధర్మశాస్త్రం విధించే క్రియల సంబంధులంతా శాపం క్రింద ఉన్నారు. ఎందుకంటే, ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నవన్నీ చేస్తూ ఉండని ప్రతి ఒక్కరూ శాపగ్రస్థులని రాసి ఉంది.
11  ధర్మశాస్త్రంవల్ల దేవుని లెక్కలో ఎవరూ నిర్దోషి కారని తేటతెల్లమే. ఎందుకంటే, “నిర్దోషి దేవునిమీది నమ్మకంవల్లే జీవిస్తాడు.”
12  ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని చట్టాల ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవాడు వాటివల్ల బ్రతుకుతాడు అని రాసి ఉంది.
13 ధర్మశాస్త్రం వల్ల అయిన శాపంనుంచి క్రీస్తు మనలను విమోచించాడు. ఎలాగంటే ఆయన మనకోసం శాపగ్రస్థుడయ్యాడు – “మ్రానుమీద వ్రేలాడే ప్రతి వాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. 14 దానివల్ల, అబ్రాహాముకు ఇచ్చిన దీవెన క్రీస్తు యేసులో ఇతర జనాలకు రావాలనీ దేవుని ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసంద్వారా మనం పొందాలని ఆయన ఉద్దేశం.
15 సోదరులారా, లోక వ్యవహారం ప్రకారం మాట్లాడుతున్నాను – మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి మరేమీ చేర్చరు. 16  వాగ్దానాలు చేసినది అబ్రాహాముకూ అతని సంతానానికీ. దేవుడు అనేకులను ఉద్దేశించి అన్నట్టు “సంతానాలకు” అనలేదు గాని ఒకణ్ణే అన్నట్టు “సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తు. 17 నేను చెప్పేదేమిటంటే, ముందుగా దేవుడు క్రీస్తులో స్థిరపరచిన ఒడంబడికను నాలుగు వందల ముప్ఫయి ఏళ్ళయిన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం కొట్టివేయదు, దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు. 18 ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రంవల్ల అయినదంటే ఇక అది వాగ్దానం వల్ల అయ్యేది కాదన్న మాటే. అయితే దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం మూలంగానే అబ్రాహాముకిచ్చాడు.
19 అలాగైతే ధర్మశాస్త్రమెందుకని? అది అతిక్రమాలను బట్టి కలుపబడింది. ఆ వాగ్దానం ఏ సంతానానికి చేయబడిందో ఆయన వచ్చేంతవరకే ధర్మశాస్త్రం అమల్లో ఉంది. అది దేవదూతల ద్వారా మధ్యవర్తిచేత నియమించబడింది. 20 మధ్యవర్తి ఒక్కరికోసమే ఉండడు గాని దేవుడు ఒక్కడే.
21 ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ బ్రతికించగల ధర్మశాస్త్రం అనుగ్రహించడం వీలుండి ఉంటే వాస్తవంగా నిర్దోషత్వం ధర్మశాస్త్రంవల్లే కలిగి ఉండేవి. 22  కానీ యేసు క్రీస్తు మీది విశ్వాసమూలమైన వాగ్దానం ఆయనను నమ్మేవారందరికీ లభించేందుకు లేఖనం అందరినీ పాపం క్రింద మూసివేసింది. 23 అయితే విశ్వాసం రాకముందు మనం ధర్మశాస్త్రం క్రింద ఖైదీలుగా ఉంచబడ్డాం, తరువాత వెల్లడి అయ్యే విశ్వాసం కోసం అలా ఉంచబడ్డాం. 24 కాబట్టి ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడిలాంటిదై ఉండేది. మనం నమ్మకంవల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చేలా మనలను క్రీస్తుదగ్గరకు నడిపించడమే దాని పని. 25 అయితే విశ్వాసం వచ్చిన తరువాత మనం ఇక బాలశిక్షకుడి క్రింద లేము.
26 ఎందుకంటే, క్రీస్తు యేసు మీది నమ్మకం ద్వారా మీరంతా దేవుని కుమారులు. 27 క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొన్నారు. 28 ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, బానిస అని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు – క్రీస్తు యేసులో మీరందరూ ఒక్కటిగా ఉన్నారు. 29 మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానం, వాగ్దానం ప్రకారమైన వారసులు.