2
1 ✽పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతు✽ను తీసుకొని బర్నబా✽తోకూడా జెరుసలం మళ్ళీ వెళ్ళాను. 2 వెళ్ళాలని దేవునివల్ల నాకు వెల్లడి అయి నేను వెళ్ళాను. ఇతర జనాలలో నేను ప్రకటిస్తున్న శుభవార్త వారికి వివరించి చెప్పాను. అయితే నేను అదివరకు పడ్డ ప్రయాస, అప్పుడు పడుతున్న ప్రయాస వృథా కాకుండా✽ పలుకుబడి గలవారికే ఏకాంతంగా✽ చెప్పాను. 3 ✽నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడు అయినా సున్నతి పొందాలని అతణ్ణి ఎవరూ బలవంతం చేయలేదు. 4 ✽కొందరు కపట సోదరుల కారణంగా అక్కడికి వెళ్ళాం. వారు మనలను దాస్యంలోకి దించాలని క్రీస్తు యేసులో ఉన్న మన స్వేచ్ఛను గూఢచారుల్లాగా కనిపెట్టడానికి వారిని దొంగతనంగా సంఘంలో ప్రవేశపెట్టడం జరిగింది. 5 ✽అయితే మేము వారికి ఒక్క గడియ కూడా లొంగలేదు. శుభవార్త సత్యం మీ మధ్య ఎప్పుడూ నిలిచి ఉండాలని మా ఉద్దేశం.6 ✽ఆ పలుకుబడి గలవారు – వారెంతటివారైనా నాకైతే పర్వా లేదు; దేవుడు మనిషి పైరూపం చూడడు – ఆ పలుకుబడి గలవారు నాకున్న ఎరుకను వృద్ధి ఏమీ చేయలేదు. 7 గానీ సున్నతి ఉన్నవారికోసం అని శుభవార్త పేతురుకు అప్పగించిన దేవుడు సున్నతి లేనివారికోసం అని దానిని నాకప్పగించాడని వారు గ్రహించారు. 8 ఎందుకంటే, ఏ దేవుడైతే పేతురు సున్నతి ఉన్నవారికి క్రీస్తురాయబారి అయి ఉండడానికి అతనిలో పని చేశాడో ఆ దేవుడే నేను ఇతర జనాలకు క్రీస్తురాయబారి అయి ఉండడానికి నాలో పని చేశాడు. 9 నాకు ప్రసాదించిన కృపను గుర్తించి “మూల స్తంభాలుగా” కనిపించిన యాకోబు, కేఫా, యోహానులు సహవాసానికి గుర్తుగా నాతో, బర్నబాతో తమ కుడి చేతులు కలిపారు, మేము ఇతర జనాల దగ్గరికి, తాము సున్నతి ఉన్నవారిదగ్గరికి వెళ్ళాలని సూచించారు. 10 ✽మేము బీదలను జ్ఞాపకం ఉంచుకోవాలని మాత్రం వారు కోరారు. అదంటే నాకు కూడా ఆసక్తి.
11 ✽✽పేతురు అంతియొకయ నగరం వచ్చినప్పుడు నేనతణ్ణి ముఖాముఖిగా ఎదిరించాను. ఎందుకని? అతడు నిందార్హుడు అయ్యాడు. 12 ✽ఎలాగంటే, యాకోబుదగ్గర నుంచి కొందరు రాకముందు అతడు ఇతర జనాలతో భోజనం చేసేవాడు. అయితే వారు వచ్చిన తరువాత అతడు సున్నతి సంస్కారం ఆచరించేవారికి భయపడి వెనక్కి తగ్గి వేరైపోయాడు. 13 ✽తక్కిన యూదులు అతనితో కూడా కపటంగా ప్రవర్తించారు. దీనికి ఫలితంగా బర్నబా సహా వారి కపటంచేత కొట్టుకుపోయాడు.
14 ✽అయితే వారు శుభవార్త సత్యం ప్రకారం సరిగా ప్రవర్తించకపోవడం చూచి నేను అందరి ఎదుటే పేతురుతో ఇలా అన్నాను: “నీవు యూదుడివై ఉండి యూదులలాగా కాకుండా ఇతర జనాలలాగే✽ బ్రతుకుతూ ఉన్నావు గదా. అలాంటప్పుడు ఇతర జనాలను యూదులలాగా బ్రతకాలని బలవంతం✽ చేస్తావేమిటి? 15 ✽మనం పుట్టుకతో యూదులం, ‘ఇతర జనాలకు చెందిన పాపులం’ కాము. 16 ✽అయినా, మనిషి యేసు క్రీస్తుమీది నమ్మకం వల్లే గాని ధర్మశాస్త్ర క్రియలవల్ల నిర్దోషిగా న్యాయవంతుడుగా దేవుని లెక్కలోకి రాడని మనకు తెలుసు, గనుక మనం కూడా ధర్మశాస్త్ర క్రియలవల్ల కాక క్రీస్తుమీది నమ్మకంవల్లే నిర్దోషులుగా లెక్కలోకి వచ్చేలా క్రీస్తు యేసుమీద నమ్మకం పెట్టాం. ధర్మశాస్త్ర క్రియలవల్ల ఎవరూ దేవుని లెక్కలోకి నిర్దోషిగా రారు గదా. 17 ✽అయితే క్రీస్తుద్వారా నిర్దోషుల లెక్కలోకి రావాలని చూస్తూ ఉంటే మనం కూడా పాపులమని తేలితే క్రీస్తు పాపానికి సేవకుడా? కానే కాదు. 18 ✽నేను పడగొట్టినదానిని ఒకవేళ మళ్ళీ నిర్మిస్తే అపరాధినిగా చేసుకొంటాను గదా. 19 నేనైతే దేవుని పట్ల బ్రతికేలా ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాను✽. 20 నేను క్రీస్తుతో కూడా సిలువ మరణం చెందాను✽. ఇకమీదట జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు! శరీరంలో ఉన్న నా ఈ జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను సమర్పించుకొన్న✽ దేవుని కుమారుని మీది విశ్వాసంవల్లే. 21 ✽నేను దేవుని అనుగ్రహాన్ని కొట్టివేయను – ఒకవేళ నిర్దోషత్వం అనేది ధర్మశాస్త్రం ద్వారా వస్తే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్టే!”