గలతీయవారికి లేఖ
1
1 గలతీయ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలకు క్రీస్తు రాయబారి✽ అయిన పౌలనే నానుంచి, నాతో ఉన్న సోదరులందరి నుంచీ అభివందనాలు. 2 నేను రాయబారిగా ఉన్నది మనుషులద్వారా కాదు, మానవుడివల్లా కాదు గాని యేసు క్రీస్తువల్లే, ఆయనను చనిపోయినవారిలో నుంచి✽ సజీవంగా లేపిన తండ్రి అయిన దేవునివల్లే. 3 ✝మన తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ మీకు అనుగ్రహం✽, శాంతి కలుగుతాయి గాక! 4 మన తండ్రి అయిన దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు మనలను ఇప్పటి చెడు యుగం✽నుంచి విడిపించడానికి✽ మన పాపాలకోసం✽ తనను తాను అర్పించుకొన్నాడు. 5 దేవునికి యుగయుగాలకు మహిమ✽ కలుగుతుంది గాక! తథాస్తు.6 మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను. క్రీస్తు కృపవల్ల మిమ్ములను పిలిచినవాని✽ వైపునుంచి✽ మీరు ఇంత త్వరలో వేరొక శుభవార్త✽ వైపు తిరుగుతూ ఉన్నారు! 7 అది శుభవార్త కానే కాదు✽. కానీ కొందరు✽ శుభవార్తను తారుమారు✽ చేయాలని ప్రయత్నిస్తూ మిమ్ములను కలవరపరుస్తున్నారు✽. 8 అయితే మేము మీకు ప్రకటించిన శుభవార్త కాక ఒకవేళ వేరేదేదైనా మేము గానీ పరలోకంనుంచి వచ్చిన దేవదూత గానీ మీకు ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్థుడవుతాడు✽ గాక! 9 ✽మునుపు మేము చెప్పినట్టే ఇప్పుడు మళ్ళీ చెపుతున్నాను – మీరు స్వీకరించిన శుభవార్త గాక వేరేది ఎవరైనా సరే మీకు ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్థుడవుతాడు గాక!
10 ✽నేనిప్పుడు ఒప్పించాలని ప్రయత్నిస్తున్నది మనుషులనా? దేవుణ్ణా? మనుషులను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టాలని చూస్తూ ఉంటే క్రీస్తు దాసుణ్ణయి ఉండేవాణ్ణి కాను!
11 ✝సోదరులారా, నేను ప్రకటించిన శుభవార్త మనుషుల ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. 12 ✽ ఈ శుభవార్త మనుషుల ద్వారా నేను అందుకోలేదు. దానిని ఏ మనిషీ నాకు నేర్పలేదు. యేసు క్రీస్తే దానిని నాకు వెల్లడి చేశాడు.
13 ✝యూద మతంలో నా గత జీవిత విధానాన్ని గురించి మీరు విన్నారు – నేనెలా క్రీస్తు సంఘాన్ని అత్యధికంగా హింసిస్తూ, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాను. 14 అప్పుడు పూర్వీకుల సాంప్రదాయాలంటే నాకెంతో ఆసక్తి. నా స్వజాతివారిలో నా వయసు గల అనేకులను యూద మతం విషయంలో మించిపోయాను.
15 అయితే నేను తన కుమారుణ్ణి ఇతర జనాలలో✽ ప్రకటించాలని నన్ను పుట్టుకతోనే✽ ప్రత్యేకించుకొని తరువాత తన కృపచేత పిలిచిన✽ దేవుడు 16 ✽ఆయనను నాయందు ప్రత్యక్షం చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు నేను మనుషులతో కలిసి ఆలోచించలేదు. 17 ✽నాకంటే ముందుగా క్రీస్తు రాయబారులైనవారి దగ్గరకు జెరుసలం వెళ్ళలేదు గాని అరేబియాకు వెళ్ళిపోయాను. తరువాత దమస్కు నగరానికి మళ్ళీ వచ్చాను.
18 ✽మూడు సంవత్సరాల తరువాత, పేతురును దర్శించడానికి జెరుసలం వెళ్ళాను. అక్కడ అతనితో కూడా పదిహేను రోజులున్నాను. 19 అయితే తక్కిన క్రీస్తు రాయబారులలో ప్రభువు తమ్ముడైన యాకోబును తప్ప మరే ఒక్కరినీ నేను చూడలేదు. 20 ✽నేను మీకు రాస్తున్న దీనిలో అబద్ధమేమీ లేదని దేవుని ఎదుట రూఢిగా చెపుతున్నాను. 21 ✽ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వెళ్ళాను. 22 ✽అప్పుడు, క్రీస్తులో ఉన్న యూదయ సంఘాలకు నా ముఖ పరిచయం కాలేదు. 23 ✽కానీ ఒక సంగతి మాత్రం వారు వింటూ వచ్చారు. ఏమిటంటే, “మునుపు మమ్ములను హింసించినవాడు ఏ విశ్వాసాన్ని నాశనం చేయాలని చూశాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాడు.” 24 వారు నా కారణంగా దేవుణ్ణి స్తుతించారు.