12
1 ✽నేను అతిశయంగా చెప్పుకోవడంవల్ల ప్రయోజనం✽ లేదు. ఇప్పుడు ప్రభు దర్శనాల గురించీ ప్రత్యక్షతల గురించీ చెప్తాను. 2 ✽క్రీస్తులో ఉన్న ఒక మనిషి నాకు తెలుసు. పద్నాలుగేళ్ళ క్రిందట అతణ్ణి మూడో ఆకాశానికి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అప్పుడతడు శరీరంతో ఉన్నాడో నాకు తెలియదు. శరీరం లేకుండా ఉన్నాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. 3 నాకు తెలిసిన అలాంటి మనిషిని పరమానంద నివాసం✽లోకి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అప్పుడతడు శరీరంతో ఉన్నాడో నాకు తెలియదు. శరీరం లేకుండా ఉన్నాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. 4 అక్కడ అతడు వివరించడానికి వీలు కాని విషయాలు విన్నాడు. వాటిని చెప్పడానికి మనిషికి సెలవు లేదు.5 అలాంటి వ్యక్తి గురించి నేను అతిశయంగా చెప్పుకొంటాను గాని నా బలహీనతల విషయంలో తప్ప నన్ను గురించి అతిశయంగా చెప్పుకోను. 6 ✽ఒకవేళ అతిశయంగా చెప్పుకోవాలనుకొన్నా తెలివితక్కువవాణ్ణయి ఉండను. ఎందుకంటే, నేను చెప్పేది సత్యమే. అయినా ఎవరైనా నన్ను చూచి నా మాటలు విని నా గురించి ఎంచినదానికంటే నేను అధికుణ్ణని తలచకుండా అతిశయం మానుకొంటాను.
7 ✽వెల్లడి అయిన ఆ సంగతులు ఎంతో దివ్యమైనవి. వాటిని బట్టి నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా నా శరీరంలో ఒక “ముల్లు” నాకివ్వడం జరిగింది. అది నన్ను నలగ్గొట్టడానికి సైతాను దూత. నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా అలా జరిగింది. 8 ✽ఆ “ముల్లు” నానుంచి తొలగిపోయేలా ముమ్మారు✽ దాని గురించి ప్రభువుకు విన్నవించుకొన్నాను.
9 ✽అయితే ఆయన నాతో ఇలా అన్నాడు: “నా కృప నీకు చాలు. నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే.” అందుచేత✽ క్రీస్తు బలప్రభావాలు నామీద నిలిచి ఉండేలా నా దుర్బలతల గురించే చాలా సంతోషంతో నేను అతిశయంగా చెప్పుకొంటాను. 10 ✽నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి గనుక క్రీస్తుకోసం దుర్బలతలూ నిందలూ కష్టదశలూ హింసలూ బాధలూ అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను✽.
11 అతిశయంగా చెపుతూ నేను తెలివితక్కువ✽ వాణ్ణయ్యేను – మీరే నన్ను బలవంతం చేశారు. వాస్తవానికి మీరు నన్ను మెచ్చుకోవలసి ఉంది✽. నేను వట్టివాణ్ణి✽ అయినా “ఉత్తమోత్తములైన” ఆ రాయబారులకంటే ఏ విషయంలోనూ తక్కువవాణ్ణి కాను. 12 ✽నిజంగా, క్రీస్తు రాయబారుల సూచనలు – సూచకమైన క్రియలూ వింతలూ✽ అద్భుతాలూ✽ పూర్తి సహనంతో మీ మధ్య నావల్ల జరిగాయి. 13 ✝ఇతర సంఘాలకంటే మీరు తక్కువవారైనట్టు ఏ విషయంలో వ్యవహరించాను? నేను మీకు భారంగా లేకపోయాను అంతే – ఈ నా తప్పు క్షమించండి!✽
14 ✽ఇప్పుడు ఈ మూడో సారి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. ఎందుకంటే నాకు కావలసినది మీ సొత్తు కాదు గాని మీరే. తల్లిదండ్రులు పిల్లలకోసం ఆస్తి కూడబెట్టాలి గాని పిల్లలు తల్లిదండ్రులకోసం కూడబెట్టనక్కరలేదు. 15 అలాగే నేను మీ ఆత్మల క్షేమంకోసం నాకు కలిగింది సంతోషంతో ఖర్చు చేస్తాను. నన్నూ ఖర్చు చేసుకొంటాను. అయినా నేను మీపట్ల ఎక్కువ ప్రేమ చూపితే మీరు నాపట్ల తక్కువ ప్రేమ చూపుతారు. 16 ✽అది ఎలాగైనా నేను మీకు భారంగా లేకపోయాను, గాని యుక్తిగా మాయోపాయం వల్ల మిమ్ములను చేజిక్కించుకొన్నానట! 17 నేను మీ దగ్గరకు పంపినవారిలో ఎవరి వల్లనైనా మిమ్ములను వంచించి లాభం సంపాదించుకొన్నానా? 18 మీ దగ్గరకు వెళ్ళాలని తీతును ప్రోత్సహించి అతనితోకూడా మన సోదరుణ్ణి పంపాను. తీతు మిమ్ములను వంచించలేదు, లాభమేమీ సంపాదించు కోలేదు గదా. మేము ఏక మనసుతో ఏక విధానంతో ప్రవర్తించలేదా?
19 ✽ఇంతవరకూ మా పక్షంగా మేము వాదించు కొంటున్నామని మీరనుకొంటున్నారా? మేము మాట్లాడేది దేవుని దృష్టిలో, క్రీస్తులో. ప్రియసోదరులారా, మేము చెప్పేదంతా మీ ఆధ్యాత్మికాభివృద్ధి కోసమే. 20 ✽నేను వచ్చి చూచినప్పుడు ఒక వేళ మీ విషయం ఏమై ఉందో అది నేను కోరినట్టుండదేమో మీరు నా విషయం చూచి అది కూడా మీరు కోరినట్టుండదేమో అని నా భయం. ఒకవేళ కలహాలు, అసూయ, తీవ్ర కోపం చూపడం, జగడాలు, అపనిందలు, గుసగుసలు, మిడిసిపాటు, అల్లరులు ఉంటాయేమో. 21 నేను తిరిగి వచ్చినప్పుడు దేవుడు మీమధ్య నాకు తలవంపులు కలిగిస్తాడేమోననీ, లోగడ పెడదారి పట్టి తాము చేస్తూ ఉన్న అసహ్యకరమైన కార్యాలు, వ్యభిచారం, పోకిరీ తిరుగుళ్ళ విషయం పశ్చాత్తాపపడని అనేకులను గురించి నేను దుఃఖించవలసి వస్తుందేమోననీ నా భయం.