11
1 నేను కొంత తెలివితక్కువగా మాట్లాడితే మీరు ఓర్చుకోవాలని నా ఆశ. వాస్తవానికి మీరు ఓర్చుకొంటూ ఉన్నారు. 2 మీ విషయం నాకు ఆసక్తి✽ ఉంది. ఈ ఆసక్తి దైవికమైనది. ఎందుకంటే, నేను మిమ్ములను ఒకే పురుషునికి✽ ప్రధానం చేశాను, అంటే, మిమ్ములను పవిత్ర కన్యగా క్రీస్తుకు అప్పగించాలని నాకుంది. 3 ✽ కానీ నాకు భయం వేసింది. ఏమిటంటే, సర్పం తన కుయుక్తిచేత హవను మోసగించిన ప్రకారం, మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీనుంచి భ్రష్టమై తొలగిపోతాయేమో అని నా భయం. 4 ✽ఎందుకని? ఎవడైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక వేరే యేసును ప్రకటిస్తే, ఇంతకుముందు మీరు పొందని వేరే ఆత్మను పొందితే, మీరు అంగీకరించని వేరే శుభవార్తను అంగీకరిస్తే ఇదంతా మీరు మహా బాగా ఓర్చుకొంటారు!5 ✽అయితే నేను అలాంటి “ఉత్తమోత్తములైన రాయబారుల” కంటే ఏ మాత్రమూ తక్కువవాణ్ణి కాననుకొంటున్నాను. 6 మాటలలో ఒక వేళ శిక్షణ✽ పొందనివాణ్ణై ఉన్నా తెలివి✽లో శిక్షణ పొందనివాణ్ణి కాదు. మేము అన్ని విధాలుగా మీకు తెలిసిపోయినవారం గదా.
7 ✽ మీకు దేవుని శుభవార్త ఉచితంగా ప్రకటిస్తూ, మిమ్ములను హెచ్చించడానికి నన్ను నేను అణచుకోవడంవల్ల అపరాధం చేశానా? 8 మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకోవడం వల్ల వాటిని దోచుకొన్నాను✽. 9 ✽నేను మీ దగ్గర ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరికీ భారంగా లేను. మాసిదోనియ నుంచి వచ్చిన సోదరులు నా అక్కరలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా చూచుకొన్నాను. ఇకమీదటా అలాగే చూచు కొంటాను. 10 ✝నాలో ఉన్న క్రీస్తు సత్యం తోడు, ఈ నా అతిశయాన్ని అకయ ప్రాంతాలలో ఎవరూ ఆపలేరు. 11 ఎందుకని? మీపట్ల నాకు ప్రేమభావం లేకపోవడంవల్లా? నా ప్రేమభావం దేవునికి తెలుసు. 12 ✽అయినా నేను చేస్తున్నది ఇకముందూ చేస్తాను. కారణమేమిటంటే, కొందరు ఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు – అలాంటి అవకాశంకోసం వెదికేవారికి అవకాశమేమీ లేకుండా చేయాలని నా కోరిక.
13 ✽అలాంటివారు వాస్తవమైన క్రీస్తు రాయబారులు కారు. మోసంగా పని చేసేవారు. క్రీస్తు రాయబారులుగా అనిపించుకోవాలని మారు వేషం వేసుకొనేవారు. 14 ✽ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సైతాను తానే వెలుగుదూత వేషం వేసుకొనేవాడు. 15 అందుచేత వాడి సేవకులు తాము నీతిన్యాయాలకు సేవకులుగా కనబడేలా మారువేషం వేసుకోవడం వింత ఏమీ కాదు. వారి అంతం వారి పనుల ప్రకారమే ఉంటుంది.
16 ✽నేను తెలివితక్కువవాణ్ణని ఎవరూ తలచకూడదని మళ్ళీ చెపుతున్నాను. అలా తలచినా నేను కూడా అతిశయంగా కొంత చెప్పుకొనేలా నన్ను తెలివితక్కువవాణ్ణిగా అయినా స్వీకరించండి. 17 ప్రభువు మాట్లాడే విధంగా నేను ఇప్పుడు మాట్లాడడం లేదు గాని కారణం కలిగి అతిశయంగా చెప్పుకొనే ఈ విషయంలో తెలివితక్కువవాడిలాగా మాట్లాడుతున్నాను. 18 అనేకులు శరీరానుసారంగా బడాయి చెప్పుకొంటారు, గనుక నేను కూడా బడాయి చెప్పుకొంటాను. 19 ✽ఎందుకంటే, ఎంతో జ్ఞానంగల మీరు తెలివితక్కువవారిని సంతోషంతో ఓర్చుకొంటారు! 20 ఎవరైనా మిమ్ములను బానిసలుగా చేస్తే✽, మిమ్ములను దిగమింగివేస్తే, మిమ్ములను చేజిక్కించుకొంటే, తనను గొప్ప చేసుకొంటే, మీ ముఖంమీద కొడితే మీరు ఓర్చుకొంటారు! 21 వారు చేసినట్టు చేయలేక మేము బలహీనులమని మా అవమానానికి నేను ఒప్పుకొంటున్నాను! గాని ఏ విషయంలో అయినా ఎవరికైనా అతిశయించే ధైర్యం✽ ఉంటే ఆ విషయంలో నాకూ ధైర్యం ఉంది – నేను తెలివితక్కువవాడిలా మాట్లాడుతున్నాను.
22 ✽వారు హీబ్రూవారా? నేనూ హీబ్రూవాణ్ణే. వారు ఇస్రాయేల్ వారా? నేనూ ఇస్రాయేల్ వాణ్ణే. వారు అబ్రాహాము సంతానమా? నేనూ అలాంటివాణ్ణే. 23 ✽వారు క్రీస్తు సేవకులా? వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను – నేను మరి ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను✽. లెక్కలేనన్ని దెబ్బలకు గురి అయ్యాను. మరి అనేక సార్లు ఖైదు✽ పాలయ్యాను. తరచుగా ప్రాణాపాయం✽లో ఉన్నాను. 24 ✽యూదులచేత అయిదు సార్లు ముప్ఫయి తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాను. 25 ముమ్మారు నన్ను బెత్తాలతో కొట్టడం, ఒకసారి రాళ్ళతో కొట్టడం✽ జరిగింది. ముమ్మారు నేనున్న ఓడలు పగిలిపోయాయి✽. ఒకసారి పగలూ రాత్రీ సముద్రంలో గడిపాను. 26 పదే పదే✽ ప్రయాణాలు చేస్తూ ఉన్నాను. ప్రవాహాలవల్ల అపాయాలు, దోపిడీదొంగలవల్ల అపాయాలు, స్వజనంవల్ల అపాయాలు, ఇతర జనాలవల్ల అపాయాలు, పట్టణాలలో అపాయాలు, అరణ్యాలలో అపాయాలు, సముద్రంలో అపాయాలు, కపట సోదరులవల్ల అపాయాలు✽ నాకు ఎదురయ్యాయి.
27 నేను ప్రయాసలో✽, కష్టంలో ఉన్నాను. నిద్ర రాని✽ అనేక రాత్రులు గడిపాను. ఆకలిదప్పులతో ఉన్నాను. తరచుగా భోజనం✽ చేయకుండా ఉన్నాను. సరైన బట్టలు లేక చలిలో సమయం గడిపాను. 28 ఆ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలు అన్నిటిని✽ గురించిన ఆతురత అనుదినం నా మీదికి వస్తూ ఉంది. 29 ✽ఎవరికైనా బలహీనత✽ ఉంటే నాకూ బలహీనత ఉన్నట్టుండదా? ఎవరైనా తొట్రుపాటుకు గురైతే నేను మండిపడనా✽? 30 ఒకవేళ నేను అతిశయంగా చెప్పుకోవలసి ఉంటే నా బలహీనత✽ గురించిన విషయాలలోనే చెప్పుకొంటాను. 31 ✽నేను అబద్ధమాడడం లేదని ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి దేవుడూ ఎప్పటికీ స్తుతిపాత్రుడూ అయిన ఆయనకు తెలుసు. 32 ✽దమస్కులో నన్ను పట్టుకోవడానికి అరెత రాజు క్రింద ఉన్న అధికారి దమస్కువారి నగరానికి కావలి ఉంచాడు. 33 అయితే నన్ను కిటికీ గుండా గోడమీదినుంచి గంపలో దింపడం జరిగింది. ఆ విధంగా నేను అతడి చేతికి చిక్కకుండా తప్పించుకుపోయాను.