10
1  ఇప్పుడు నేను – పౌలును – క్రీస్తు సాత్వికం, శాంతం బట్టి మీకు విన్నపం చేస్తున్నాను. మీతో ఉన్నప్పుడు “దీనుణ్ణి”, లేనప్పుడు మీపట్ల “ధైర్యశాలిని” గదా! 2 మేము శరీరానుసారంగా నడుస్తున్నామని కొందరు అనుకొంటున్నారు గదా. నేను అలాంటివారిపట్ల ధైర్యంతో వ్యవహరించాలని నా ఉద్దేశం. అయితే నేను మీ మధ్య ఉన్నప్పుడు అలా జరగకుండా చేయండని మిమ్ములను వేడుకొంటున్నాను. 3 మేము శరీరంలో ఉండి నడుచుకొంటూ ఉన్నా మేము శరీరానుసారంగా యుద్ధం చేయడం లేదు. 4 ఎందుకంటే మా యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు గాని కోటలను పడదోయడానికి దేవుని ద్వారా బలప్రభావాలు గలవి. 5 మేము దేవుని గురించిన జ్ఞానానికి విరుద్ధంగా వివాదాలనూ తనను హెచ్చించుకొనే ప్రతిదానినీ పడగొట్టేస్తున్నాం. ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం. 6 మీ విధేయత పూర్తి అయినప్పుడు సమస్త అవిధేయతను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం కూడా.
7 మీరు పైరూపం మాత్రమే చూస్తున్నారా? ఎవరైనా తాను క్రీస్తు మనిషినని నమ్ముకొంటే, అతడు మళ్ళీ తలచవలసిన విషయమేమిటంటే, అతడు ఎలా క్రీస్తు మనిషో అలాగే మేమూ క్రీస్తు మనుషులం. 8 మీ నాశనంకోసం కాక మీ అభివృద్ధి కోసమే ప్రభువు మాకిచ్చిన అధికారాన్ని గురించి ఒకవేళ నేను కొంత అతిశయంగా చెప్పుకొన్నా నాకు సిగ్గు కలగదు. 9 నా ఉత్తరాలవల్ల మిమ్ములను భయపెట్టేవాడిలాగా ఉండకూడదని ఇలా చెపుతున్నాను. 10  ఎవరో అన్నారు గదా “అతడి ఉత్తరాలు బలీయమైనవి గాని అతడు మన మధ్య ఉన్నప్పుడు శరీరరీత్యా దుర్బలుడు, మాట్లాడే విధానం కొరగానిది.”
11 అలా చెప్పే వ్యక్తి ఈ సంగతి ఆలోచించాలి: మేము లేనప్పుడు ఉత్తరాలలో మా మాటల ప్రకారం ఎలాంటివారమో ఉన్నప్పుడు క్రియల ప్రకారం అలాంటివారమై ఉంటాం. 12 అయినా తమను మెప్పించుకొనేవారి లెక్కలో ఉన్నామని చెప్పడానికి గానీ వారితో మమ్ములను మేమే పోల్చుకోవడానికి గానీ తెగించము. వారేమో తమలో ఒకణ్ణి బట్టి ఒకడు ఎన్నిక చేసుకొంటారు. ఒకడితో ఒకడు పోల్చుకొంటారు. ఇందులో వారికి తెలివి లేదు. 13 మేమైతే మా విషయం మితి మీరి గొప్పగా చెప్పుకోము గాని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన సరిహద్దులలోనే ఉంటాం. ఈ సరిహద్దులలో మీరూ ఉన్నారు. 14 మీరు మా సరిహద్దులలో లేనట్టు మేము మీ విషయంలో మా హద్దు మీరడం లేదు. క్రీస్తు శుభవార్తతో మీ దగ్గరకు వచ్చినది మేమే గదా? 15 మేము మా సరిహద్దు దాటి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు గొప్పలు చెప్పుకోము. మీ విశ్వాసం పెరుగుతూ ఉంటే మీవల్ల మా సరిహద్దులలో మా సేవకు అభివృద్ధి కలుగుతుందనీ, 16 మీకు అవతల ఉన్న ప్రాంతాలలో కూడా శుభవార్త ప్రకటించగలమనీ మా ఆశాభావం. అయితే మరొకరు తన సరిహద్దులలో చేసిన పని గురించి గొప్పగా చెప్పుకోవడం మా ఆశ కాదు. 17 “అతిశయించేవాడు ప్రభువును బట్టే అతిశయించాలి.” 18  తనను తాను మెచ్చుకొనేవాడు కాదు గాని ప్రభువు మెచ్చుకొనేవాడే ఆమోదయోగ్యుడు.