9
1 పవిత్రులకోసమైన ఈ సేవ విషయం నేను మీకు రాయనక్కరలేదు. 2 ఇందులో మీ సంసిద్ధత నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు సంవత్సరంనుంచి చందా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీ గురించి మాసిదోనియవారితో గొప్పగా చెపుతున్నాను. మీ ఆసక్తి వారిలో ఎక్కువమందికి ప్రోత్సాహం కలిగించింది. 3  అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పుకొన్న సంగతులు ఈ విషయంలో వ్యర్థం కాకూడదనీ, నేను చెప్పినట్టే మీరు సిద్ధంగా ఉండాలనీ ఈ సోదరులను పంపుతున్నాను. 4 ఒకవేళ మాసిదోనియవారిలో ఎవరైనా నాతో వచ్చి, మీరు సిద్ధంగా లేకపోతే అది చూస్తారనుకోండి. అలాంటప్పుడు మేము నమ్మకంతో గొప్పగా చెప్పిన దాని గురించి ఈ నమ్మకం వల్ల మాకు సిగ్గు కలుగుతుంది. మీకు కూడా కలుగుతుందని వేరే చెప్పాలా! 5  ఈ కారణంచేత సోదరులు ముందుగానే మీ దగ్గరకు వచ్చి, లోగడ ఇస్తామని మీరు చెప్పిన ధారాళమైన చందా జమ చేసేటందుకు వారిని ప్రోత్సహించడం అవసరమనుకొన్నాను. మీ చందా సిద్ధంగా ఉండాలనీ, అది పిసినిగొట్టుతనంగా ఇచ్చినది కాకుండా ధారాళమైనదిగా ఉండాలనీ నా ఉద్దేశం.
6  ఇందుకు ఒక ఉదాహరణ – కొద్దిగా వెదజల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు. 7  ప్రతి ఒక్కరూ సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకొన్న ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే, ఉల్లాసంతో ఇచ్చే వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు. 8 అంతే కాదు. అన్నిట్లో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీపట్ల సర్వ కృప సమృద్ధిగా అధికం చేయగలడు. 9 దీనిగురించి ఇలా రాసి ఉంది: “అతడు నలుదిక్కులకు వెదజల్లాడు. అక్కరలో ఉన్నవారికి ఇచ్చాడు. అతని నీతిన్యాయాలు శాశ్వతంగా నిలుస్తాయి.”
10 వెదజల్లే వారికి విత్తనాలు, తినడానికి ఆహారం దయచేసే దేవుడు చల్లడానికి విత్తనాలు మీకిస్తాడు, వృద్ధి చేస్తాడు, మీ న్యాయ ఫలాన్ని అధికం చేస్తాడు గాక. 11 ఈ విధంగా ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వసమృద్ధి కలుగుతుంది. దీనివల్ల మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెప్పే కారణం అవుతుంది. 12 ఈ సేవ నిర్వహించడం పవిత్రుల అక్కరలను తీర్చడమే కాకుండా, దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు కలిగేలా చేస్తుంది. 13 ఈ సేవ రుజువైనదనీ మీరు ఒప్పుకొన్న శుభవార్తకు మీ విధేయతనుబట్టీ తమకు, అందరికీ, మీరు ఉదారంగా పంచిపెట్టడం బట్టీ దేవునికి మహిమ కలిగిస్తారు. 14 అంతేగాక, మీలో ఉన్న దేవుని అత్యధిక కృపను బట్టి వారు మీకోసం ప్రార్థన చేస్తూ, మీ మేలు మనసారా కోరతారు.
15 వివరించడానికి సాధ్యం కాని ఆయన ఉచితమైన బహుమతి గురించి దేవునికి కృతజ్ఞతలు!