8
1 ✽✽ఇప్పుడు, సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలకు దేవుడు అనుగ్రహించిన కృపను గురించి మీకు తెలియజేస్తాను. 2 తీవ్రంగా పరీక్షించే కష్టాలలో ఉండి కూడా వారి ఆనంద సమృద్ధినుంచీ వారి అతి దరిద్రంలోనుంచి వారి అధికమైన ఔదార్యం వెల్లువగా ప్రవహించింది. 3 వారిని గురించి నా సాక్ష్యమేమిటంటే, తమంతట తామే ఇష్టపూర్వకంగానే వారు ఇవ్వగలిగినంతా ఇచ్చారు – అసలు దానికంటే ఎక్కువే ఇచ్చారు. 4 అక్కరలో ఉన్న పవిత్రులకోసం ఈ ఉదారతను ఈ సేవలో తమ తోడ్పటును మేము స్వీకరించాలని మనసారా మమ్ములను వేడుకొన్నారు. 5 ✽ఇంతేకాదు. మేము ఆశించినట్టు మాత్రమే కాక, వారు మొదట ప్రభువుకు, దేవుని సంకల్పంవల్ల మాకు కూడా అర్పించుకొన్నారు.6 ✽ తీతు మీలో ఈ ఉదారత మొదలుపెట్టాడు గనుక మీలో దీనిని సంపూర్తి✽ చేయాలని కూడా మేమతణ్ణి పురికొల్పాం. 7 ✝మీకు ప్రతి విషయంలో – విశ్వాసంలో, మాటలో, తెలివిలో, సంపూర్ణ ఆసక్తిలో, మాపట్ల మీకున్న ప్రేమలో సమృద్ధి ఉంది. అలాగే ఈ ఉదారతలో కూడా సమృద్ధి ఉండేలా చూచుకోండి.
8 నేను ఆజ్ఞపూర్వకంగా చెప్పడం లేదు✽ గాని ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమభావం ఎంత వాస్తవమో పరీక్షిస్తున్నాను. 9 ✽మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తెలుసు గదా. ఆయన ధనవంతుడై✽ ఉన్నా మీకోసం దరిద్రుడు అయ్యాడు✽. ఆయన దరిద్రంవల్ల మీరు ధనవంతులు కావాలని ఆయన ఉద్దేశం.
10 మీరు ఇవ్వడం గురించి నా అభిప్రాయమిది✽: సంవత్సరం క్రిందటే మీరు ఏ ఉపకారక్రియ చేయాలని కోరి మొదలు పెట్టారో దాన్ని ఇంకా చేయడం మీకు మేలు. 11 ✽ఇప్పుడు దాన్ని చేస్తూ ముగించాలి. చేయాలని కోరడానికి సంసిద్ధత ఉన్నట్టు మీకున్నదానిలో నుంచి ఇచ్చి సంపూర్తి చేయాలి కూడా. 12 మొదట సిద్ధమైన మనసు ఉంటే ఇచ్చేది అంగీకారంగా✽ ఉంటుంది. ఈ అంగీకారం ఒక వ్యక్తికి ఉన్నదానినిబట్టే గాని లేనిదానినిబట్టి కాదు.
13 ✽ఇతరుల విషయంలో శ్రమ నివారణ చేసి మీకు భారం కలిగించాలని కాదు. 14 గాని సమానత ఉండాలని నా కోరిక. ప్రస్తుతం మీ సమృద్ధి వారి అక్కరలకు సహాయకరంగా, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరలకు సహాయకరంగా ఉండాలని నా భావం. అప్పుడు రాసి ఉన్న దానిప్రకారం సమానత ఉంటుంది – 15 “ఎక్కువగా సేకరించినవారికి ఏమి మిగలలేదు, తక్కువగా సేకరించినవారికి కొరత ఏమీ లేదు.”
16 మీపట్ల నాకున్న శ్రద్ధాసక్తులు దేవుడు తీతు హృదయంలో కూడా పుట్టించాడు. దేవునికి స్తుతులు! 17 తీతు మా విన్నపం అంగీకరించాడు. అంతేకాక, అతడు ఇంకా శ్రద్ధాసక్తులు కలిగి తనకు తానే మీదగ్గరకు వచ్చాడు. 18 క్రీస్తు సంఘాలన్నిటిలోనూ శుభవార్త సేవలో ప్రసిద్ధిగాంచిన సోదరుణ్ణి✽ కూడా అతనితోపాటు పంపుతున్నాం. 19 ✝అంతే కాక ఈ సోదరుడే మాతో కలిసి ఈ చందా తీసుకొని జెరుసలం ప్రయాణం చేయడానికి సంఘాలచేత నిర్ణయమైనవాడు. మేము ప్రభువుకు మహిమ కలిగిద్దామని సహాయం చేయడానికి మీ సిద్ధమైన మనసు చూపుదామనీ, ఈ ఉపకార క్రియ నిర్వహిస్తున్నాం. 20 ✽ సంఘాలిచ్చిన ఈ పెద్ద మొత్తానికి బాధ్యత వహించిన మమ్మల్ని ఎవరూ తప్పు పట్టకుండా ఇలా ప్రయత్నిస్తున్నాం. 21 ఎందుకంటే, ప్రభు దృష్టిలో మాత్రమే కాకుండా మనుషుల దృష్టిలో కూడా నిజాయితీతో ఏర్పాట్లు చేస్తున్నాం.
22 వారితోకూడా మా మరో సోదరుణ్ణి పంపుతున్నాం. అనేక విషయాలలో అనేక సార్లు అతణ్ణి పరీక్షించి అతని శ్రద్ధాసక్తులు తెలుసుకొన్నాం. మీ గురించి కుదిరిన విశేషమైన నమ్మకం బట్టి ఇప్పుడు అతనికి మరి ఎక్కువ శ్రద్ధాసక్తులున్నాయి. 23 తీతు మట్టుకైతే, అతడు నా పాలివాడు, మీ విషయంలో నా సహకారి. అతనితో వస్తున్న మన సోదరుల మట్టుకైతే, వారు సంఘాల దూతలు, క్రీస్తుకు మహిమై✽ ఉన్నారు. 24 అందుచేత సంఘాల ఎదుట బహిరంగంగా వీరికి మీ ప్రేమభావాన్నీ మీ గురించి మాకున్న అతిశయ కారణాన్నీ✽ రుజువు చేయండి.