7
1 ✽ప్రియ సోదరులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని మీద భయభక్తులతో✽ పవిత్రతను సంపూర్తి చేసుకొంటూ శరీరానికీ ఆత్మకూ అంటి ఉన్న మురికి అంతటినుంచీ శుభ్రం చేసుకొందాం.2 ✝మీ హృదయాలలో మాకు చోటివ్వండి. మేమెవరికీ కీడు చేయలేదు, ఎవరినీ భ్రష్టులను చేయలేదు, ఎవరినుంచీ దేనినీ మోసంగా తీసుకోలేదు. 3 మీమీద నింద మోపాలని నేనిలా మాట్లాడడం లేదు. మీరు మా హృదయాలలో ఉన్నారు. మీ దగ్గర బ్రతకడానికీ చనిపోవడానికీ మాకిష్టమని లోగడ చెప్పాను గదా. 4 మీతో నేను అధిక ధైర్యంతో మాట్లాడుతున్నాను. మిమ్ములను బట్టి నేనెంతో గర్విస్తున్నాను. నిండు ఓదార్పుతో ఉన్నాను, మా బాధలన్నిటిలో అత్యధిక ఆనందం✽తో ఉప్పొంగిపోతూ ఉన్నాను.
5 ✽మేము మాసిదోనియకు వచ్చినప్పుడు కూడా మా శరీరాలకు విశ్రాంతి అంటూ లేకపోయింది. అన్ని వైపులా మాకు కష్టాలే. బయట పోరాటాలు, లోపల భయాలు. 6 ✽ అయినప్పటికీ అణగారిపోయినవారిని దేవుడు ఓదార్చేవాడు. తీతు రాకడవల్ల ఆయన మమ్ములను ఓదార్చాడు. 7 అతని రాకడవల్ల మాత్రమే కాదు గాని అతనికి మీ విషయంలో కలిగిన ఆదరణవల్ల కూడా మమ్ములను ఓదార్చాడు. ఎలాగంటే మీ హృదయాభిలాష, మీ శోకం, నేనంటే మీకుండే ఆసక్తి మాకు తెలియజేశాడు. అందుకు నేను మరి ఎక్కువగా ఆనందించాను.
8 ✽ నా ఉత్తరంవల్ల నేను మిమ్ములను దుఃఖపెట్టినా నాకు విచారం లేదు. ఆ ఉత్తరం మీకు కొద్ది కాలం దుఃఖం కలిగించిందని తెలిసి విచారపడ్డాను. 9 ✽ఇప్పుడైతే సంతోషిస్తున్నాను – మీకు దుఃఖం కలిగినందుచేత కాదు గాని మీరు పశ్చాత్తాపపడేటంతగా దుఃఖం కలిగినందుచేతనే. మీకు మావల్ల ఏ విషయంలోనూ నష్టం కాకుండా ఆ దుఃఖం కలిగింది దేవుని వల్ల అయింది. 10 దేవునివల్ల అయిన దుఃఖం✽ విముక్తికి దారితీసే పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది. ఆ విషయంవల్ల విచారం కలగదు. కానీ లౌకిక దుఃఖం చావును కలిగిస్తుంది. 11 ✽ఈ విషయం ఆలోచించండి: దేవునివల్ల అయిన దుఃఖం మీకు కలిగింది. అది మీలో ఎంత శ్రద్ధ కలిగించిందో! ఎంత ప్రతివాదం! ఎంత కోపం! ఎంత భయం! ఎంత హృదయాభిలాష! ఎంత ఆసక్తి! ఎంత ప్రతిక్రియ! ఆ విషయంలో మీరు నిర్దోషులని అన్ని విధాలుగా రుజువు చేసుకొన్నారు. 12 ✝నేను మీకు రాసినా, ఎవడు ఆ దుర్మార్గం చేశాడో, ఆ దుర్మార్గం ఎవరిపట్ల జరిగిందో వారికోసం విశేషంగా రాయలేదు గాని దేవుని ఎదుట మీపట్ల మాకున్న శ్రద్ధాసక్తులు✽ మీకు స్పష్టం కావాలని రాశాను. 13 ✽అలా అయిందని మాకు మీ ఓదార్పులో ఓదార్పు కలిగింది. అంతేకాక తీతుకు కలిగిన ఆనందం ద్వారా మాకు మరి అత్యధికంగా సంతోషం కలిగింది, మీ అందరివల్ల అతని ఆత్మకు ఊరట కలిగింది. 14 మీ గురించి ఏ విషయంలోనైనా అతనితో గొప్పగా మాట్లాడినా నేనేమీ సిగ్గుపాలు కావడం లేదు. మేము మీతో చెప్పినదంతా ఎలా నిజమో అలాగే తీతుతో మేము మీ గురించి గొప్పగా మాట్లాడినది నిజమని తేలింది. 15 మీరు తనను భయాందోళనతో స్వీకరించి విధేయత చూపిన సంగతి అతడు జ్ఞాపకం చేసుకొన్నప్పుడు మీపట్ల అతని వాత్సల్యం అధికమై ఉంది. 16 ప్రతి విషయంలో మీ గురించి నాకు నమ్మకం ఉంది గనుక ఆనందిస్తూ ఉన్నాను.