6
1 అందుచేత మేము దేవునితోపాటు పని చేస్తూ, దేవుని కృపను వ్యర్థంగా పొందకండని మిమ్మల్ని వేడుకొంటున్నాం. 2 ఆయన అంటున్నాడు – అనుకూల సమయంలో మీ ప్రార్థన నేను విన్నాను, రక్షణ దినంలో మీకు సహాయం చేశాను.
ఇదిగో వినండి, “అనుకూల సమయం” ఇప్పుడే! ఇదిగో “రక్షణ దినం” ఇదే!
3 మా సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఏ విషయంలోనూ తొట్రుపడే అడ్డును కలిగించము. 4 మేము దేవుని సేవకులుగా ప్రతి విషయంలోనూ మా యోగ్యతలు కనుపరచుకొంటున్నాం – చాలా సహనంతో, బాధలలో, కష్టాలలో, ఇరుకులలో, 5 దెబ్బలకు గురి అయ్యే సమయాలలో, ఖైదులలో, అల్లరులలో, శ్రమలలో, జాగరణంలో, ఆకలిగా ఉన్న సమయాలలో, 6 పవిత్రతవల్ల, తెలివివల్ల, దీర్ఘశాంతంవల్ల, దయవల్ల, పవిత్రాత్మవల్ల, కపటం లేని ప్రేమవల్ల, 7 సత్యవాక్కువల్ల, దేవుని బలప్రభావాలవల్ల, కుడి ఎడమల నీతి న్యాయాల ఆయుధాలవల్ల 8 ఘనత ఘనహీనతలలో, దూషణ భూషణలలో. చూపుకు మేము వంచకులమైనట్టున్నా యథార్థవంతులమే, 9 గుర్తించబడని వారమైనట్టున్నా ప్రసిద్ధులమే, చనిపోతూ ఉన్నట్టున్నవారమైనా, ఇదిగో బ్రతుకుతూ ఉన్నవారమే, శిక్ష పొందుతూ ఉన్నట్టున్న వారమైనా చంపబడని వారమే, 10 చూపుకు దుఃఖంతో ఉన్నవారమైనా ఎప్పుడు ఆనందిస్తూ ఉన్నవారమే, దరిద్రులమై నట్టున్నా అనేకులను ఐశ్వర్యవంతులుగా చేస్తూ ఉన్నవారమే, ఏమీ లేనివారమైనట్టున్నా సమస్తం ఉన్నవారమే.
11 ఓ కొరింతువారలారా, అరమరిక లేకుండా మీతో మాట్లాడుతున్నాం. మా హృదయ ద్వారం పూర్తిగా తెరచి ఉంది. 12 మీ విషయంలో మా అంతరంగం ఇరుకుగా లేదు గాని మా విషయంలో మీ అంతరంగం ఇరుకుగా ఉంది. 13 మేము చేసినదానికి ప్రతిఫలంగా మీ హృదయ ద్వారం తెరవండి. నా పిల్లలతో చెప్పినట్టే చెపుతున్నాను.
14 నమ్మనివారితో మీరు జతగా ఉండకండి. న్యాయానికి అధర్మంతో వంతు ఏమిటి? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? 15 క్రీస్తుకు బెలియాల్‌తో సమ్మతి ఏమిటి? నమ్మిన వ్యక్తికి నమ్మని వ్యక్తితో భాగమేమిటి? 16 దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక ఏమిటి? మీరు జీవంగల దేవుని ఆలయం. ఇందుకు దేవుడు చెప్పినదేమిటంటే, నేను వారిలో నివాసముంటాను, వారితో నడుస్తాను. వారి దేవుణ్ణయి ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు.
17 అందుచేత వారిలో నుంచి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి అని ప్రభువు చెపుతున్నాడు, కల్మషమైన దానిని ముట్టకండి. నేను మిమ్ములను స్వీకరిస్తాను. 18 మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు కొడుకులూ కూతుళ్ళై ఉంటారు అని అమిత శక్తిగల ప్రభువు అంటున్నాడు.