5
1 భూమిమీద మన నివాసమైన గుడారం నాశనమైపోతే దేవునివల్ల అయిన కట్టడం, చేతులు చేయని ఒక శాశ్వత గృహం పరలోకంలో మనకు ఉంటుందని మనకు తెలుసు. 2 పరలోకసంబంధమైన మన నివాసం ధరించుకోవాలని దీనిలో మూలుగుతూ ఉన్నాం. 3 నిజంగా దానిని ధరించు కొన్నప్పుడు మనం దిగంబరంగా కనబడము. 4  “గుడారం”లో ఉన్న మనం భారంక్రింద మూలుగుతూ ఉన్నాం. ఇది తొలగించబడాలని కాదు గాని ఆ నివాసాన్ని ధరించు కోవాలని – చావుకు లోనయ్యేది జీవంవల్ల మింగివేయబడాలని మన ఆశ.
5 ఈ అవశ్యమైన దానికోసం మనలను తయారు చేసినది దేవుడే. తన ఆత్మను హామీగా మనకు ఇచ్చినది కూడా ఆయనే. 6 ఈ కారణంచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉన్నాం. మనం శరీరంలో నివాసమున్నంత కాలం ప్రభువుతో లేమని తెలుసు – 7 కంటికి కనిపించేవాటివల్ల కాదు గాని విశ్వాసంవల్లే నడుచుకొంటున్నాం. 8 నిబ్బరంగా ఉండి, శరీరంలో ఉండడంకంటే శరీరాన్ని విడిచివెళ్ళి ప్రభువుతో, ఆయన సమక్షంలో ఉండాలని ఇష్టపడుతున్నాం.
9 అందుచేత మేము పెట్టుకొన్న లక్ష్యం ఏమిటంటే, శరీరంలో ఉంటున్నా లేకపోయినా ప్రభువును సంతోషపెట్టడమే. 10 ఎందుకంటే, మనమందరమూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా నిలబడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో ఉండి చేసిన క్రియలకు – చేసినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే – చేసిన వాటి ప్రకారం పొందాలి.
11 అందుచేత మేము ప్రభువుపట్ల భయమంటే ఏమిటో తెలిసి మనుషులను ఒప్పిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో అది దేవునికి తేటగా తెలిసిన విషయమే. అది మీ అంతర్వాణికి కూడా తేటగా తెలిసినదని నా ఆశాభావం. 12  మా యోగ్యతలు మళ్ళీ మీ ముందు పెట్టడం లేదు గాని హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పైరూపాన్ని బట్టే అతిశయించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మా విషయం మీకు అతిశయ కారణం కలిగిస్తున్నాం. 13 మాకు మతి తప్పింది అంటే అది దేవుని కోసమే. మేము స్థిర చిత్తులం అంటే అది మీకోసమే. 14 ఎందుకని? క్రీస్తు ప్రేమ మమ్ములను ఒత్తిడి చేస్తూ ఉంది. ఎలాగంటే మాకీ నిశ్చయం ఉంది: అందరికోసమూ ఒకే వ్యక్తి చనిపోయాడు గనుక అందరూ చనిపోయారు. 15 బ్రతికేవారు ఇకనుంచి తమకోసం బ్రతకకుండా తమ స్థానంలో చనిపోయి మళ్ళీ సజీవంగా లేచినవానికోసమే బ్రతకాలని ఆయన అందరికోసమూ చనిపోయాడు.
16 కనుక ఇకమీదట మేము ఎవరినీ లోక దృష్టితో చూడము. లోగడ క్రీస్తును లోకదృష్టితో తెలుసుకొన్నా ఇప్పుడు ఆయనను అలా తెలుసుకోవడం లేదు. 17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే ఆ వ్యక్తి కొత్త సృష్టి. పాతవి గతించాయి. ఇవిగో అన్నీ క్రొత్తవి అయ్యాయి.
18 అంతా దేవునివల్లే అయినది. ఆయన మమ్ములను క్రీస్తుద్వారా తనతో సఖ్యపరచుకొన్నాడు, సఖ్యపరచే పరిచర్య మాకిచ్చాడు. 19 అంటే క్రీస్తులో దేవుడు ఉండి లోకాన్ని తనతో సఖ్యపరచుకొంటూ, వారిమీద వారి అతిక్రమాలు మోపకుండా ఉన్నాడు. సఖ్యపరచే సందేశం మాకప్పగించాడు.
20 అందుచేత మేము క్రీస్తుకు దూతలం. దేవుడు మాద్వారా వేడుకొంటూ ఉన్నట్టుంది. దేవునితో సఖ్యపడండి అంటూ క్రీస్తు పక్షంగా బతిమాలుతున్నాం. 21 మనం ఆయనలో దేవుని నీతిన్యాయాలయ్యేలా దేవుడే ఏ పాపం లేని ఆయనను మనకోసం పాపంగా చేశాడు.