13
1 ✽ ఈ మూడోసారి నేను మీ దగ్గరకు వస్తున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి విషయం రూఢి కావాలి. 2 మునుపు నేనొక మాట చెప్పాను. మీమధ్య రెండో సారి ఉన్నట్టు ముందుగా చెపుతున్నాను – ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా రాస్తున్నాను. ఏమంటే, నా ద్వారా క్రీస్తు పలుకుతున్నాడని మీకు రుజువు కావాలి✽ గదా. సరే, ఇదివరకు అపరాధం చేస్తున్నవారితో, తక్కిన వారందరితో నేను అంటున్నాను, నేను తిరిగి వచ్చినప్పుడు మీ పట్ల మృదువుగా ఉండను✽. 3 క్రీస్తు మీపట్ల బలహీనుడు కాడు, మీలో బలాఢ్యుడే. 4 “బలహీనత” కారణంగా ఆయన సిలువ మరణానికి గురి అయ్యాడు, గాని దేవుని బలప్రభావాలను బట్టి జీవిస్తూ ఉన్నాడు. ఆయనతో ఐక్యత కలిగిన మేము కూడా బలహీనులమైనా మీపట్ల ఆయనతోపాటు దేవుని బలప్రభావాలనుబట్టి జీవిస్తాం.5 మీరు క్రీస్తు విశ్వాసంలో ఉన్నారో లేరో మిమ్ములను మీరే పరిశోధించుకోండి✽. మిమ్ములను మీరే పరీక్షించుకొని చూడండి. మీరు ఆ పరీక్షలో ఓడిపోయి నిరాకరణకు గురి కాకపోతే, యేసు క్రీస్తు మీలో✽ ఉన్నాడని మీ గురించి మీకు తెలియదా? 6 మేము అలాంటి పరీక్షలో ఓడిపోయి నిరాకరణకు గురైనవారం కామని మీరు గుర్తిస్తారని నా ఆశాభావం. 7 ✽మీరు ఎలాంటి దుర్మార్గతనూ చేయకూడదని దేవునికి ప్రార్థన చేస్తున్నాను – మేము యోగ్యులుగా కనిపించాలని కాదు గాని మేము అయోగ్యులుగా కనిపించినా మీరు మంచినే చేయాలని మా కోరిక. 8 మేము సత్యంకోసమే గాని సత్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేము. 9 ✝మేము బలహీనులమై ఉన్నప్పుడు మీరు బలవంతులై ఉంటే ఆనందిస్తాం. మీరు పరిపూర్ణులు✽ కావాలని కూడా మా ప్రార్థన. 10 ✽ఈ కారణం చేత నేను మీ మధ్య హాజరు కాకపోయిన ఈ సమయాన ఈ సంగతులు రాస్తున్నాను – మీ దగ్గర ఉన్నప్పుడు, ప్రభువు నాకిచ్చిన అధికారం ప్రయోగించి కాఠిన్యం చూపకూడదని. ఈ అధికారం కట్టడానికే గాని పడద్రోయడానికి కాదు.
11 తుదకు, సోదరులారా, ఆనందించండి. పరిపూర్ణులు కండి. ఆదరణ పొందండి. ఏక మనస్సుతో ఉండండి✽. సమాధానంగా బ్రతకండి. అప్పుడు ప్రేమ సమాధానాల✽ దేవుడు మీకు తోడై ఉంటాడు.
12 పవిత్రమైన ముద్దు✽ పెట్టుకొని ఒకరికొకరు అభినందనలు చేసుకోండి. 13 పవిత్రులందరూ మీకు వందనాలు చెపుతున్నారు.
14 ✽ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీకందరికీ తోడై ఉంటాయి గాక! తథాస్తు.