3
1 ✽మా యోగ్యతలు మీముందు పెట్టడానికి మళ్ళీ ఆరంభిస్తున్నామా? కొందరికి అవసరమున్నట్టు, మీకు గానీ మీనుంచి గానీ సిఫారసు లేఖలు మాకవసరమా? 2 ✽మా లేఖ మీరే! ఈ లేఖ మా హృదయాలమీద రాసి ఉండి, మనుషు లందరూ గుర్తించి చదవగలిగేది. 3 ✽మీరు మా పరిచర్య చేత క్రీస్తు రాయించిన లేఖ అని స్పష్టమే. ఈ లేఖ రాసినది సిరాతో కాదు గాని జీవంగల దేవుని ఆత్మతోనే, రాతి పలకల మీద కాదు గాని హృదయాలు అనే శారీరకమైన పలకలమీద. 4 ✽క్రీస్తు ద్వారా మాకు దేవునిమీద ఇలాంటి నమ్మకం ఉంది.5 ✽ మా అంతట మేమే ఏదైనా సాధించినట్టు అనుకోవడానికి కూడా సమర్థులం కాము. మా సామర్థ్యం దేవునినుంచే కలిగి ఉంది. 6 ✽మమ్ములను క్రొత్త ఒడంబడికకు సామర్థ్యం గల సేవకులుగా చేసినది ఆయనే. మేము అక్షరానికి కాదు, ఆత్మకే సేవకులం, ఎందుకంటే అక్షరం చంపుతుంది గాని ఆత్మ జీవమిస్తుంది.
7 రాతి పలకలమీద రాసి చెక్కిన అక్షరాలదై చావు తెచ్చిపెట్టే సేవ మహిమతో వచ్చింది. మోషే ముఖం✽మీద కనిపించిన మహిమాప్రకాశం గతించిపోయేదైనా అతని ముఖంవైపు ఇస్రాయేల్‌వారు తేరి చూడలేకపోయారు. 8 అలాంటప్పుడు ఆత్మ సేవ మరెక్కువ మహిమగలదిగా ఎలా ఉండలేకపోతుంది? 9 శిక్షావిధి కలిగించే సేవకు మహిమ ఉందీ అంటే, నిర్దోషత్వం తెచ్చే సేవకు ఇంకెంతో అత్యధిక మహిమ ఉంది. 10 పూర్వం మహిమ గలదానికి ఈ మహిమ ఎంతో మించిపోయినందువల్ల ఈ సందర్భంలో దానికి మహిమ ఉన్నట్టు లేదు. 11 గతించి పోయేదే మహిమ గలదైతే, నిలిచి ఉండేదానికి ఇంకెంతో మహిమగలది!
12 కాబట్టి మేమిలాంటి ఆశాభావం✽ కలిగి ఎంతో ధైర్యం వహించి మాట్లాడుతున్నాం. 13 ✽ మేము మోషేలాగా చేయము – గతించిపోతున్న దాని అంతాన్ని ఇస్రాయేల్‌వారు తేరి చూడకుండా మోషే తన ముఖంమీద ముసుకు వేసుకొన్నాడు. 14 ✽వారి మనసులు అంధత్వమయింది. ఎలాగంటే నేటివరకూ వారు పాత ఒడంబడిక గ్రంథం చదువుతున్నప్పుడు ఆ ముసుకు ఇంకా ఉంది. ఎందుకంటే ఆ ముసుకు క్రీస్తుద్వారానే రాసినదాన్ని తొలగిపోతుంది. 15 నేటివరకూ మోషే ధర్మశాస్త్రం చదివినప్పుడెల్లా వారి హృదయాలకు ముసుకు ఉంది. 16 అయితే ఎవరైనా ప్రభువువైపు తిరిగినప్పుడు ఆ ముసుకు తొలగిపోతుంది.
17 ✽ప్రభువు ఆత్మే. ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వేచ్ఛ✽ ఉంటుంది. 18 మనమందరమూ ముసుకు లేని ముఖంతో ప్రభు మహిమ అద్దంలో ఉన్నట్టు చూస్తూ మహిమనుంచి మహిమకు ప్రభు ఆత్మచేత ప్రభువు పోలికగా మారుతూ ఉన్నాం✽.