2
1 ✽ గానీ నేను దుఃఖంతో మీ దగ్గరకు తిరిగి రానని నా అంతట నేనే నిశ్చయించుకొన్నాను. 2 ఎందుకంటే నేను మిమ్ములను దుఃఖపెడితే నాకు సంతోషం కలిగించడానికి నావల్ల దుఃఖపడినవారు తప్ప మరింకెవరు? 3 నేను వచ్చేటప్పుడు ఎవరి విషయం నాకు సంతోషం కలగాలో వారి విషయం నాకు దుఃఖం కలగకుండా ముందు ఇదే రాశాను. నా సంతోషమే మీకు సంతోషమని మీ అందరిని గురించిన నా నమ్మకం. 4 ఎంతో బాధతో, హృదయ వేదనతో కన్నీళ్ళు విడుస్తూ మీకు రాశాను. మీకు దుఃఖం కలగాలని కాదు గాని మీరంటే నాకున్న అత్యధిక ప్రేమ మీకు తెలియాలనే అలా రాశాను.5 ✽దుఃఖం కలిగించినవారెవరైనా ఉంటే, ఆ వ్యక్తి దుఃఖం కలిగించినది నాకు కాదు గాని కొంతమట్టుకు మీకందరికీ (ఇంతకంటే కఠినంగా మాట్లాడడం నాకిష్టం లేదు). 6 ✽అలాంటివానిమీద మీలో ఎక్కువమంది కలిగించిన శిక్ష చాలు. 7 ✽కాబట్టి శిక్షకు బదులుగా మీరు అతణ్ణి క్షమించి ఓదార్చడం మంచిది. లేదా, అతనికి అతి దుఃఖం ముంచుకువస్తుందేమో. 8 అందుచేత అతనిపట్ల మీ ప్రేమ మళ్ళీ రూఢిపరచండని మిమ్ములను ప్రాధేయపడుతున్నాను. 9 మీరు అన్నిటిలో విధేయులై✽ ఉంటారో లేదో అని మిమ్మల్ని పరీక్షించేందుకు కూడా అలా రాశాను. 10 ✽మీరు ఎవరినైనా దేనిగురించైనా క్షమిస్తే ఆ వ్యక్తిని నేనూ క్షమిస్తాను. నేను దేనినైనా క్షమించి ఉంటే అది మీ కోసం, క్రీస్తు సముఖంలో ఆ వ్యక్తిని క్షమించాను. 11 ✽సైతాను మనమీద దురుద్దేశం సాధించకూడదని అలా చేశాను. సైతాను తంత్రాలు ఎలాంటివో మనం తెలియనివారం కాము.
12 క్రీస్తు శుభవార్త ప్రకటించడానికి నేను త్రోయ రేవుకు వచ్చినప్పుడు ప్రభువు నాకు ద్వారం✽ తెరిచాడు. 13 అయితే నా సోదరుడైన తీతు✽ కనబడకపోవడంచేత నా ఆత్మకు నెమ్మది లేకపోయింది. అప్పుడు వారిదగ్గర సెలవు తీసుకొని మాసిదోనియ✽కు బయలు దేరాను.
14 ✽దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్ములను ఎప్పుడూ నడిపిస్తూ ఉన్నాడు, క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని✽ మాద్వారా అంతటా గుభాళించేలా చేస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతలు కలుగుతాయి గాక! 15 ✽రక్షణ పొందుతున్న వారిమధ్య, నశిస్తున్నవారిమధ్య కూడా, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాం. 16 ✽నశిస్తున్నవారికి మరణకరమైన మరణ వాసనగా ఉన్నాం. రక్షణగలవారికి జీవప్రదమైన జీవ వాసనగా ఉన్నాం. ఇలాంటి విషయాలకు సమర్థులెవరు?✽ 17 మేము దేవుని వాక్కువల్ల అక్రమలాభం✽ సంపాదించేవారం కాము. అలాంటివారు చాలామంది ఉన్నారు. మేమైతే నిజాయితీపరులం✽, దేవుడు పంపినవారం✽, దేవుని ఎదుటే క్రీస్తులో మాట్లాడేవారం.