2 కొరింతువారికి లేఖ
1
1 ✽ కొరింతులో ఉన్న దేవుని సంఘానికీ అకయ✽ అంతటా ఉన్న పవిత్రులందరికీ దేవుని సంకల్పంవల్ల యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు, మన సోదరుడు తిమోతి✽ రాస్తున్న విషయాలు. 2 ✝మన తండ్రి అయిన దేవుని నుంచీ మన ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ మీకు అనుగ్రహం, శాంతి కలుగుతాయి గాక.3 ✽✽మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగుతుంది గాక. ఆయన కరుణామయుడైన✽ తండ్రి, అన్ని విధాల ఆదరణ✽ అనుగ్రహించే దేవుడు. 4 ఆయన మమ్ములను మా కష్టాలన్నిటిలోనూ✽ ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఈ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టంలో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. 5 క్రీస్తు బాధలు✽ మాలో అధికమవుతూ ఉన్నాయి గాని ఆ ప్రకారమే క్రీస్తుద్వారా మా ఆదరణ కూడా అధికమవుతూ ఉంది. 6 ✽మాకు కష్టాలు వస్తే అవి మీ ఆదరణ, మీ రక్షణ కోసం. మేము పడుతున్న బాధలే మీరు పడుతున్నప్పుడు వాటిని సహించడానికి ఈ ఆదరణ మీకు బలవత్తరమైనది. మాకు ఆదరణ కలిగితే అదీ మీ ఆదరణ, రక్షణ కోసం. 7 ✽మీకు బాధలలో ఎలా వాటా ఉందో అలాగే ఆదరణలో కూడా వాటా ఉందని మాకు తెలుసు, గనుక మీ గురించి మా ఆశాభావం సుస్థిరమైనది.
8 సోదరులారా, ఆసియా✽ రాష్ట్రంలో మాకు కలిగిన కష్టాల విషయం మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం కాదు. అక్కడ అపరిమితంగా, మా బలానికి మించిన విధంగా భారం✽ వహించాం. అసలు మేము ప్రాణాలపై ఆశలు వదులుకొన్నాం. 9 మా మీద మాకు నమ్మకం పోయి చనిపోయినవారిని సజీవంగా లేపే దేవునిమీదే నమ్మకం ఉంచేలా మాలో మాకు మరణం✽ విధించినట్టు అనిపించింది. 10 ✽అయితే ఆయన ఇంత గొప్ప మరణం నుంచి మమ్ములను తప్పించాడు, తప్పిస్తూ ఉన్నాడు కూడా – మీరు మా కోసం చేస్తున్న ప్రార్థనలతో మాకు తోడ్పడుతూ ఉంటే ఇకనుంచి కూడా తప్పిస్తాడని ఆయనమీద ఆశాభావం ఉంచుతూ ఉన్నాం. 11 ✽అనేకుల ప్రార్థనల ద్వారా మాకు కలిగిన ఈ అనుగ్రహం కోసం మా విషయంలో అనేకులు దేవునికి కృతజ్ఞత చెపుతారు.
12 ✽మేము శరీర స్వభావ సంబంధమైన జ్ఞానంతో కాక, దేవుని కృపవల్లే దేవుడు అనుగ్రహించే నిజాయితీతో, సరళతతో లోకంలో, విశేషంగా మీపట్ల ప్రవర్తించామని మా అంతర్వాణి సాక్ష్యం చెప్తూ ఉంది. ఇదే మా అతిశయం✽. 13 మీరు చదివి అర్థం చేసుకోగల సంగతులే మీకు రాస్తున్నాం. మరేమీ రాయకుండా, మీరు అంతంవరకు అర్థం చేసుకొంటారని ఆశాభావంతో ఉన్నాం. 14 మన ప్రభువైన యేసు వచ్చే రోజున✽ మీరు మాకు ఎలాగో మేము మీకు అలాగే అతిశయకారణమై ఉంటామని మీరు కొంతమట్టుకు మమ్ములను అర్థం చేసుకొన్నారు కూడా.
15 ✽✽నేనీ నమ్మకంతో మొదట మీ దగ్గరకు రావాలను కొన్నాను, – మీకు రెండో సారి మేలు కలగాలని 16 మాసిదోనియకు వెళ్తూ ఉన్నప్పుడు మిమ్ములను దర్శించి మాసిదోనియ నుంచి మళ్ళీ మీదగ్గరికి రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంపగలరనీ నా ఆలోచన. 17 చపలచిత్తంతో అలా ఉద్దేశించానా? నేను “అవును, అవును” అన్న తరువాత “కాదు, కాదు” అంటూ శరీర స్వభావం ప్రకారం నా ఏర్పాట్లు చేసుకొంటున్నానా? 18 ✽దేవుడు నమ్మదగినవాడు గనుక అలాగే మేము మీకు చెప్పే మాట “అవును” “కాదు” అనే రెండూ కాదు. 19 మేము – సిల్వానుస్, తిమోతి, నేను – మీ మధ్య ప్రకటించిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు విషయంలో “అవును” “కాదు” అనే రెండూ లేవు. ఆయన విషయంలో “అవును” అనేదే ఉంది. 20 అంటే, దేవుని వాగ్దానాలన్నీ ఆయనలో “అవును” అనేదే ఉంది. ఆయనలో తథాస్తు అనేదే ఉంది. అలా మా ద్వారా దేవునికి మహిమ కలుగుతున్నది. 21 ✽క్రీస్తులో మిమ్ములనూ మమ్ములనూ సుస్థిరం చేస్తున్నది దేవుడే. మనలను అభిషేకించి✽ 22 మనకు ముద్ర వేసి✽ మన హృదయంలో తన ఆత్మను హామీగా✽ ప్రసాదించినది కూడా దేవుడే.
23 ✽దేవుణ్ణి నాకు సాక్షిగా పిలుస్తున్నాను – మిమ్ములను నొప్పించకుండేలా నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. 24 ✽మీ విశ్వాసంమీద పెత్తనం చెలాయించేవారమని మేము చెప్పడం లేదు. విశ్వాసంవల్ల మీరు స్థిరంగా ఉన్నారు గానీ మీ ఆనందం విషయంలో మేము మీతో జతపనివారం.