15
1 సోదరులారా, నేను మీకు ప్రకటించిన శుభవార్త ఇప్పుడు మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను. మీరు అంగీకరించినది ఇదే. ఇందులోనే మీరు నిలిచి ఉన్నారు. 2 మీరు వట్టిగా నమ్మనివారైతే, నేను మీకు ప్రకటించిన ఉపదేశం గట్టిగా అంటిపెట్టుకొని ఉంటే దీనివల్లే మీకు పాపవిముక్తి ఉంది కూడా.
3 నేను అంగీకరించిన దాన్ని ఆరంభంలో మీకు అందించాను. ఏమంటే లేఖనాల ప్రకారమే క్రీస్తు మన పాపాలకోసం చనిపోయాడు. 4 లేఖనాల ప్రకారమే ఆయనను పాతిపెట్టడమూ, మూడో రోజున ఆయన సజీవంగా లేవడమూ జరిగింది. 5 అప్పుడాయన కేఫాకు కనబడ్డాడు, తరువాత “పన్నెండుగురి”కి కనిపించాడు. 6 ఆ తరువాత అయిదు వందలమందికి మించిన సోదరులకు ఒకే సమయంలో కనిపించాడు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ బతికే ఉన్నారు గాని కొందరు కన్ను మూశారు. 7 ఆ తరువాత ఆయన యాకోబుకు కనిపించాడు. ఆ తరువాత తన రాయబారులందరికీ కనిపించాడు. 8 చివరగా నాకు – అకాలంగా జన్మించిన వాడిలాంటి నాకు కూడా కనిపించాడు.
9 క్రీస్తు రాయబారులందరిలో నేను తక్కువవాణ్ణి, క్రీస్తురాయబారి అనే బిరుదుకు తగనివాణ్ణి. ఎందుకంటే దేవుని సంఘాన్ని హింసించాను. 10 అయితే ఇప్పుడు నేనేమై ఉన్నానో అదై ఉన్నది దేవుని అనుగ్రహంవల్లే. నాపట్ల ఆయన అనుగ్రహం వ్యర్థం కాలేదు. ఎలాగంటే, వారందరికంటే నేనెక్కువగా కష్టించి పని చేశాను – నేను కాదు గాని నాకు తోడైవున్న దేవుని అనుగ్రహమే. 11 అయితే నేను గానీ వారు గానీ మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే.
12 క్రీస్తును చనిపోయినవారిలో నుంచి లేపడం జరిగిందని ప్రకటన వినిపిస్తూ ఉంటే, చనిపోయినవారు లేవడం అనేది ఉండదని మీలో కొందరు చెపుతున్నారేమిటి? 13 చనిపోయినవారు లేవడం అనేది లేదూ అంటే, క్రీస్తు కూడా లేవలేదన్న మాటే. 14 క్రీస్తు లేవకపోతే మా ఉపదేశం వ్యర్థం, మీ నమ్మకం కూడా వ్యర్థం. 15 అంతేకాదు, మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులుగా కనిపిస్తాం. ఎందుకంటే చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే దేవుడు క్రీస్తును లేపలేదన్నమాటే, గాని ఆయన క్రీస్తును లేపాడని మేము దేవుణ్ణి గురించి సాక్ష్యం చెప్పాం గదా. 16 చనిపోయినవారు లేవడం జరగని విషయమైతే క్రీస్తు లేవలేదు. 17 క్రీస్తు లేవకపోతే మీ నమ్మకం వట్టిదే! మీరింకా మీ పాపాలలోనే ఉన్నారు. 18 అంతేకాదు, క్రీస్తులో ఉండి కన్ను మూసినవారు నశించిపోయారు కూడా. 19 క్రీస్తులో మనకు ఆశాభావం ఈ బ్రతుకు మట్టుకే గనుక ఉంటే మనం మనుషులందరిలోకి జాలిగొలిపేవాళ్ళం.
20 అయితే క్రీస్తు చనిపోయినవారిలో నుంచి లేచాడు. కన్ను మూసినవారిలో ఆయన ప్రథమ ఫలమయ్యాడు. 21  ఒక మనిషి ద్వారా మరణం కలిగింది గనుక మరణించిన వారిని లేపడం కూడా ఒక మనిషిద్వారా కలిగింది. 22 ఆదాములో అందరూ చనిపోతారు. అలాగే క్రీస్తులో అందరినీ బ్రతికించడం జరుగుతుంది. 23 అయితే ప్రతి ఒక్కరికీ తన వరుస ప్రకారమే అలా జరిగేదిమొదట ప్రథమ ఫలంగా ఉన్న క్రీస్తుకు, తరువాత ఆయన తిరిగి వచ్చేటప్పుడు క్రీస్తు ప్రజలకు.
24 ఆ తరువాత, ఆయన సమస్త ప్రభుత్వాన్ని, సమస్త అధికారాన్ని, శక్తినీ రద్దుచేసి రాజ్యాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించిన తరువాత, అంతం వస్తుంది. 25 ఎందుకంటే విరోధులందరినీ తన పాదాలక్రింద పెట్టుకొనేవరకూ క్రీస్తు రాజ్యం చేయాలి. 26 చివరగా నాశనం కాబోయే విరోధి మరణం. 27 దేవుడు ఆయన పాదాలక్రింద సమస్తమూ ఉంచాడు. అయితే ఆయన క్రింద సమస్తమూ ఉంచాడని ఆయన చెప్పిన మాటలో ఆయన క్రింద సమస్తమూ ఉంచినవాడు ఉండడని తేటతెల్లమే. 28 సమస్తమూ కుమారునికి వశమైన తరువాత దేవుడు సమస్తంలోనూ సమస్తమై ఉండేలా కుమారుడు కూడా తన క్రింద సమస్తమూ ఉంచిన ఆయనకు వశమవుతాడు.
29 ఒకవేళ అలా కాకపోతే చనిపోయినవారికోసం బాప్తిసం పొందినవారు చేసేదేమిటి? చనిపోయినవారు ఎంత మాత్రం లేవరూ అంటే వారికోసం బాప్తిసం పొందడమెందుకని?
30  అంతేకాదు. మేము ఘడియ ఘడియకూ ప్రాణాపాయంలో ఎందుకుండాలి? 31 మన ప్రభువైన క్రీస్తు యేసులో మీగురించి నాకున్న అతిశయాన్నిబట్టి నొక్కి చెపుతున్నాను – నేను ప్రతి రోజూ చావుకు గురి అవుతున్నాను. 32 నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడినది మానవ ఉద్దేశంతోనే గనుక అయితే నాకు లాభమేమిటి? చనిపోయిన వారు లేవకుండా ఉంటే “రేపు చచ్చిపోతాం గనుక తిందాం, తాగుతాం”. 33 మోసపోకండి – “చెడు సహవాసం మంచి అలవాట్లను చెడగొడతుంది”. 34 దేవుని విషయమైన తెలివి కొందరికి లేదు – మీకు సిగ్గు కలిగించాలని ఈ మాట చెపుతున్నాను – గనుక నీతిన్యాయాలను గురించి బుద్ధి తెచ్చుకొని పాపం చేయకండి.
35 అయితే ఎవడైనా ఒకడు ఇలా అనవచ్చు: “చనిపోయినవారిని లేపడమెలాగు? వారికెలాంటి దేహం ఉంటుంది?”
36 తెలివితక్కువవాడా, మీరు చల్లే విత్తనం చావకపోతే దానిలో నుంచి జీవం ఉట్టిపడదు గదా. 37 అంతేకాదు, మీరు విత్తేది – అది గోధుమ గింజ కానివ్వండి, మరే గింజయినా కానివ్వండి – గింజే గాని కలగబోయే ఆకారం మీరు విత్తరు. 38 దేవుడు ఆ గింజలోనుంచి ఏ ఆకారం కలగాలని ఇష్టపడ్డాడో అదే కలిగిస్తున్నాడు, విత్తనాలలో ప్రతి దానికి దాని సొంత ఆకారం కలిగిస్తాడు. 39 అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం ఒక రకం, మృగ మాంసం వేరే రకం, చేప మాంసం వేరు, పక్షి మాంసం వేరు. 40 అలాగే ఆకాశంలో ఆకారాలున్నాయి, భూమి మీద ఆకారాలున్నాయి. అయితే ఆకాశంలో ఉన్నవాటి వైభవం ఒక తీరు. భూమిమీద ఉన్నవాటి వైభవం మరో తీరు. 41 సూర్యమండలం వైభవం ఒక తీరు, చంద్రబింబం వైభవం మరో తీరు, నక్షత్రాల వైభవం ఇంకో తీరు. వైభవం విషయంలో నక్షత్రానికి మరో నక్షత్రానికి భేదం ఉంది.
42 చనిపోయినవారు సజీవంగా లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించే శరీరాన్ని విత్తడం, నశించని శరీరాన్ని లేపడం జరుగుతుంది. 43 దానిని గౌరవం లేని స్థితిలో విత్తడం, దివ్య స్థితిలో లేపడం జరుగుతుంది. దానిని దౌర్బల్య స్థితిలో విత్తడం, బలమైన స్థితిలో లేపడం జరుగుతుంది. 44 ఈ ప్రకృతిసిద్ధమైన శరీరంగా దానిని విత్తడం, ఆధ్యాత్మికమైన శరీరంగా లేపడం జరుగుతుంది. ప్రకృతి సిద్ధమైన శరీరం ఉంది, ఆధ్యాత్మిక శరీరం కూడా ఉంది. 45  ఈ సందర్భంలో, మొదటి మనిషి ఆదాము సజీవుడయ్యాడని రాసి ఉంది. అయితే చివరి ఆదాము బ్రతికించే ఆత్మ.
46 మొదట కలిగింది ఆధ్యాత్మికమైనది కాదు గాని ప్రకృతి సిద్ధమైనదీ. తరువాత ఆధ్యాత్మికమైనది కలిగేది. 47 మొదటి మానవుడు భూసంబంధి, మట్టినుంచి రూపొందినవాడు. రెండో మానవుడు పరలోకంనుంచి వచ్చిన ప్రభువు. 48 మట్టివారు ఆ మట్టివానిలాంటివారు, పరలోక సంబంధులు ఆ పరలోక సంబంధిలాంటివారు. 49 మనం ఆ మట్టివాని పోలిక ధరించినట్టే ఆ పరలోక సంబంధి పోలిక కూడా ధరించుకొంటాం.
50 సోదరులారా, నేను చెప్పేదేమిటంటే, రక్తమాంసాలకు దేవుని రాజ్యంలో వారసత్వం ఉండదు. నశించేదానికి నశించనిదానిలో వారసత్వముండదు. 51  ఇదిగో వినండి, ఒక రహస్య సత్యం మీకు తెలియజేస్తున్నాను – మనమంతా కన్ను మూయము గాని మనమంతా మార్పు చెందుతాం. 52 ఇది ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటునే, చివరి బూర సమయంలోనే జరుగుతుంది. ఆ బూర మ్రోగుతుంది, చనిపోయినవారిని నశించనివారుగా లేపడం జరుగుతుంది, మనకు మార్పు కలుగుతుంది. 53 ఈ నశించేది నశించనిదానిని ధరించు కోవాలి, ఈ మరణించేది మరణించని దానిని ధరించుకోవాలి. 54 ఈ నశించేది నశించనిదాన్ని ధరించుకొని ఈ మరణించేది మరణించనిదాన్ని ధరించు కొన్నప్పుడు, రాసి ఉన్న ఈ మాట నెరవేరుతుంది: విజయం మృత్యువును మ్రింగివేసింది. 55 “ఓ మరణమా, నీ విషపుకొండి ఎక్కడ? మృత్యులోకమా, నీ విజయమెక్కడ?”
56 మరణం కొండి అపరాధమే. అపరాధానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. 57 కాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు! ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనకు విజయం ఇస్తున్నాడు! 58 అందుచేత, నా ప్రియ సోదరులారా, సుస్థిరంగా నిశ్చలంగా ఉండండి. ప్రభువులో మీ ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడూ ప్రభుసేవ అధికంగా చేస్తూ ఉండండి.