14
1 ప్రేమ విధానం అనుసరించండి. ఆధ్యాత్మిక సామర్థ్యాలు కూడా మనసారా కోరండి – దేవుని మూలంగా పలికే సామర్థ్యం విశేషంగా కోరండి. 2  ఎదుటి వారికి తెలియని భాషలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు, మనుషులతో కాదు. ఎందుకంటే అతడు చెప్పేదేదో ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మవల్ల రహస్య సత్యాలు పలుకుతున్నాడు. 3 దేవుని మూలంగా పలికేవాడైతే మనుషులకు అభివృద్ధి, ప్రోత్సాహం, ఓదార్పు మాటలు పలుకుతాడు. 4 తెలియని భాషలో మాట్లాడేవాడు తనకే అభివృద్ధి కలిగించుకొంటాడు. దేవునిమూలంగా పలికేవాడు క్రీస్తు సంఘానికి అభివృద్ధి కలిగిస్తాడు. 5 మీరంతా భాషలలో మాట్లాడాలని నా కోరిక గాని మీరు దేవునిమూలంగా పలకాలని మరి ఎక్కువగా కోరుతున్నాను. సంఘానికి అభివృద్ధి కలిగేలా భాషలలో మాట్లాడేవాడు అర్థం చెపితేనే తప్ప అతడికంటే దేవుని మూలంగా పలికేవాడే గొప్ప.
6 సోదరులారా, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి భాషలలో మాట్లాడుతాననుకోండి. వెల్లడి అయిన సంగతి గానీ తెలివైనమాట గానీ దేవునిమూలంగా పలికే విషయం గానీ ఉపదేశం గానీ మీకు చెప్పకపోతే నావల్ల మీకు ప్రయోజనం ఏమిటి? 7 ప్రాణం లేని వస్తువులు కూడా – పిల్లనగ్రోవి, తంతివాయిద్యం స్వరం చేస్తూ ఉన్నప్పుడు వేరువేరు స్వరాలు వినిపించకపోతే వాయించేదేదో ఎలా తెలుసు? 8 బూర స్పష్టం కాని ధ్వని ఇస్తే ఎవరు యుద్ధానికి సిద్ధపడుతారు? 9 అలాగే మీరూ నాలుకతో స్పష్టంగా అర్థమయ్యే మాటలు పలకకపోతే పలికేదేదో ఎలా తెలుసు? మీరు గాలిలోకి మాట్లాడుతూ ఉంటారు!
10 ఎన్నో రకాల భాషలు లోకంలో ఉన్నాయి గాని వాటిలో అర్థం లేనిది ఏది లేదు. 11 మాట్లాడే వ్యక్తి భాష నాకు అర్థం కాకపోతే నేను ఆ వ్యక్తికి పరాయివాణ్ణి, మాట్లాడే వ్యక్తి నాకు పరాయివాడన్న మాటే. 12 ఇలా ఉంటే మీరు ఆధ్యాత్మిక వరాల విషయంలో ఆసక్తిపరులై ఉండి, సంఘాభివృద్ధి కోసమైన సామర్థ్యాలు సమృద్ధిగా ఉండేలా కోరుకోండి. 13 కనుక తెలియని భాషలో మాట్లాడేవాడు అర్థం చెప్పేలా ప్రార్థన చేయాలి. 14 ఎందుకంటే, నేను తెలియని భాషలో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది గాని నా మనసు ఫలించదు. 15 అలాగైతే ఏమి? ఆత్మతో ప్రార్థిస్తాను, మనసుతో కూడా ప్రార్థిస్తాను. ఆత్మతో గానం చేస్తాను, మనసుతో కూడా గానం చేస్తాను.
16 లేకపోతే, మీరు ఆత్మతో మాత్రమే స్తోత్రం చేస్తే, ఇలాంటి విషయాలలో అభ్యాసం లేనివారిలో ఒకరు మీ కృతజ్ఞత మాటలకు “ఆమేన్” అనడం ఎలాగా? మీరు చెప్పేదేమిటో ఆ వ్యక్తికి తెలియదు గదా. 17 మీరేమో బాగా కృతజ్ఞత చెపుతున్నారు గాని ఎదుటి వ్యక్తికి ఆధ్యాత్మిక అభివృద్ధి కలగదు. 18 మీరందరి కంటే నేను భాషలలో ఎక్కువగా మాట్లాడుతున్నందుకు నా దేవునికి కృతజ్ఞత చెపుతున్నాను. 19 అయినా నేను సంఘంలో ఏదో భాషలో పదివేల మాటలు పలకడంకంటే ఇతరుల ఉపదేశం కోసం అయిదు మాటలు నా మనసు పెట్టి చెప్పడం నాకిష్టం.
20 సోదరులారా, ఆలోచించడంలో చిన్న పిల్లల్లాగా ఉండకండి. చెడుతనం విషయంలో పసిపాపల్లాగే ఉండండి గాని ఆలోచించడంలో పెద్దవారై ఉండండి. 21  ధర్మశాస్త్ర గ్రంథంలో రాసినది ఏమిటంటే, ప్రభువు ఇలా అంటున్నాడు, “నేను ఈ ప్రజతో అన్య భాషలు మాట్లాడేవారిచేత, అన్య పెదవులచేత మాట్లాడిస్తాను. అయినా, అదంతా కలిగినా, వారు నా మాట వినరు.” 22 అలాగైతే భాషలలో మాట్లాడడం అనేది నమ్మనివారికే సూచన గాని నమ్మినవారికి కాదు. దేవుని మూలంగా పలకడమైతే నమ్మినవారికే సూచన గాని నమ్మనివారికి కాదు. 23 సంఘమంతా ఒకే స్థలంలో సమకూడినప్పుడు అందరూ భాషలలో మాట్లాడుతూ ఉంటే ఈ విషయాలలో అభ్యాసం లేనివారు గానీ నమ్మనివారు గానీ లోపలికి వస్తారనుకోండి. అలాంటప్పుడు మిమ్ములను వెర్రివారని వారు చెప్పుకోరా? 24 కానీ అందరూ దేవునిమూలంగా పలుకుతూ ఉంటే నమ్మనివాడు గానీ అభ్యాసం లేనివాడు గానీ లోపలికి వస్తే తాను అపరాధిననీ లెక్క అప్పగించవలసివుందనీ అందరివల్ల అతనికి ఒప్పుదల కలుగుతుంది. 25 ఈ విధంగా అతని హృదయంలో దాగి ఉన్న విషయాలు వెల్లడి అవుతాయి, గనుక అతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడని చెపుతాడు.
26 సోదరులారా, ఎలా ఉంది? మీరు సమకూడేటప్పుడు ఒకరికి కీర్తన పాడాలని ఉంటుంది. లేదా జ్ఞానోపదేశం చేయాలని ఉంటుంది, మరొకరికి వెల్లడి అయిన సంగతి చెప్పాలని ఉంటుంది, మరొకరికి ఏదో భాషలో మాట్లాడాలని ఉంటుంది, లేదా భాష అర్థం చెప్పాలని ఉంటుంది. అంతా ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే జరగనివ్వండి. 27 ఏదో భాషలో ఎవరైనా మాట్లాడితే దానికి ఇద్దరు చాలు – ముగ్గురికంటే ఎక్కువమంది మాట్లాడకూడదు. వారు వంతులప్రకారం మాట్లాడాలి, ఒకరు అర్థం చెప్పాలి. 28 అర్థం చెప్పేవాడు లేకపోతే వారు సంఘంలో మౌనం వహించి తనతో దేవునితో మాట్లాడుకోవాలి.
29 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు. తక్కినవారు వివేచించాలి. 30 కూర్చుని ఉన్న మరొకరికి ఏదైనా వెల్లడి అయితే మొదటి వ్యక్తి మౌనం వహించాలి. 31 అందరూ నేర్చుకొనేలా, ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకరి తరువాత ఒకరు దేవునిమూలంగా పలకవచ్చు. 32 మరొకటి – ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల వశంలో ఉన్నాయి. 33 ఎందుకంటే దేవుడు అల్లరిని కాదు గాని ప్రశాంతిని కలిగించేవాడు.
పవిత్రుల సంఘాలన్నిటిలోలాగా 34 మీ సంఘ సభలలో స్త్రీలు మౌనం వహించాలి – వారికి మాట్లాడడానికి సెలవు లేదు. ధర్మశాస్త్రం కూడా చెప్పినట్టే వారు అణిగిమణిగి ఉండాలి. 35 వారికి ఏదైనా నేర్చుకోవాలని ఉంటే తమ భర్తలను ఇంట్లో అడగాలి. సంఘంలోనైతే స్త్రీలు మాట్లాడడం అవమానకరం. 36 ఏమిటి? మొదట దేవుని వాక్కు బయలుదేరినది మీలోనుంచా? అది వచ్చినది మీ దగ్గరికేనా?
37 ఎవరైనా తాను ప్రవక్తనని గానీ ఆధ్యాత్మిక వ్యక్తినని గానీ అనుకొంటే నేను మీకు రాస్తున్న విషయాలు ప్రభు ఆజ్ఞలే అని బాగా గుర్తించాలి. 38 అయితే ఎవరైనా అజ్ఞానం ఎన్నుకొంటే అజ్ఞానంలో ఉండనివ్వండి.
39 కాబట్టి, సోదరులారా, దేవునిమూలంగా పలకడానికి మనస్ఫూర్తిగా కోరండి. భాషలలో మాట్లాడడం నిషేధించకండి. 40  అంతా మర్యాదగా, క్రమంగా జరగనివ్వండి.