13
1 ఒకవేళ నేను మనుషుల భాషలలో, దేవదూతల భాషలలో మాట్లాడినా నాకు దైవిక ప్రేమ లేకపోతే గణగణమనే గంటలాగా, టింగుటింగుమనే తాళంలాంటి వాడినే. 2 ఒకవేళ నాకు దేవునిమూలంగా పలికే వరం ఉన్నా, అన్ని రహస్య సత్యాలూ జ్ఞానమంతా తెలిసినా, కొండలను తొలగించి వేసే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, దైవిక ప్రేమ లేకపోతే నేను వట్టివాడినే. 3 నా ఆస్తిపాస్తులన్నీ ఖర్చు చేసి బీదల పోషణకోసం ధార పోసినా, నా శరీరాన్ని కాలిపోవడానికి అప్పగించినా, నాకు దైవిక ప్రేమ లేకపోతే ప్రయోజనమంటూ నాకేమీ ఉండదు.
4  ప్రేమకు దీర్ఘశాంతం ఉంది. ఈ ప్రేమ దయ చూపుతుంది. ప్రేమకు అసూయ ఉండదు. ఈ ప్రేమ డంబాలు చెప్పుకోదు, గర్వంతో ఉప్పొంగదు. 5 అది అయోగ్యంగా ప్రవర్తించదు, సొంత ప్రయోజనం చూచుకోదు. కోపానికి రేకెత్తించబడదు. అపకారాన్ని లెక్క చేయదు. 6 ఈ ప్రేమ దుర్మార్గం విషయంలో సంతోషించదు గాని సత్యం విషయంలోనే సంతోషిస్తుంది. 7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటిలో నమ్ముతుంది, అన్నిటిలో ఆశాభావంతో ఎదురు చూస్తుంది. అన్నిటినీ ఓర్చుకొంటుంది.
8 దైవిక ప్రేమ ఎన్నడూ గతించదు. ప్రవక్తలు పలికేవి ఉన్నా అవి నిరర్థకమవుతాయి. భాషలు ఉన్నా అవి అంతరిస్తాయి. తెలివి ఉన్నా అదీ కాలగతి అవుతుంది. 9 ఎందుకంటే, మనకు తెలిసినది కొంతమట్టుకే మనం ప్రవక్తగా పలకడం కొంత మట్టుకే. 10 పరిపూర్ణమైనది వచ్చినప్పుడు కొంతమట్టుకే ఉండేవి అంతమవుతాయి. 11 నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగే మాట్లాడాను. చిన్నవాడిలాగే తలచాను, చిన్నవాడిలాగే భావించాను. కాని పెద్దవాణ్ణయినప్పుడు చిన్నవారికి చెందేవాటిని మానివేశాను. 12 అలాగే ప్రస్తుతం మనం అద్దంలో చూస్తున్నట్టు అస్పష్టంగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖా ముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసినది కొంతమట్టుకే. అప్పుడైతే దేవునికి నేను తెలిసినప్రకారమే నేను తెలుసుకొంటాను.
13 ఇప్పుడు విశ్వాసం, ఆశాభావం, దైవిక ప్రేమ – ఈ మూడు నిలిచి ఉన్నాయి. అయితే వీటిలో ఉత్తమమైనది దైవిక ప్రేమే!