12
1 సోదరులారా, దేవుడిచ్చే ఆధ్యాత్మిక సామర్థ్యాలను గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. 2  పూర్వం మీరు ఇతర జనాలై ఎలాగైనా ఉన్నప్పుడు మూగ విగ్రహాల దగ్గరకు నడిపించబడి కొట్టుకుపోతూ ఉండేవారని మీకు తెలుసు. 3 అందుచేత నేను మీకు తెలియజేసేదేమిటంటే, దేవుని ఆత్మవల్ల మాట్లడేవారెవరూ “యేసు శాపగ్రస్థుడు” అనరు. అంతేకాదు. పవిత్రాత్మవల్ల తప్ప ఎవరూ “యేసే ప్రభువు” అనలేరు.
4 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన ఇచ్చే కృపావరాలు నానా విధాలు. 5 ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు నానా విధాలు. 6 అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే గాని కార్యకలాపాలు నానా విధాలు. 7 దేవుని ఆత్మ ప్రభావ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికీ ఇవ్వడం జరుగుతుంది. అది అందరి మేలుకోసమే. 8 ఆత్మవల్ల ఒకరికి జ్ఞానవాక్కు ఇవ్వబడుతుంది. ఆ ఒకే ఆత్మ ద్వారా మరొకరికి తెలివైన మాట ఉంటుంది. 9 ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి ప్రత్యేక విశ్వాసం ఉంటుంది. ఆ ఒకే ఆత్మవల్ల మరొకరికి రోగులను బాగు చేసే కృపావరాలు ఉంటాయి. 10 మరొకరికి అద్భుతాలు చేసే సామర్థ్యం, మరొకరికి ప్రవక్తగా మాట్లాడే సామర్థ్యం, మరొకరికి ఆత్మలను గుర్తించే సామర్థ్యం, మరొకరికి నానా భాషలు మాట్లాడే సామర్థ్యం, మరొకరికి భాషల అర్థం చెప్పే సామర్థ్యం ఉంటుంది. 11  ఆ ఒకే ఆత్మ తానే ఇవన్నీ జరిగిస్తూ తనకు ఇష్టమున్నట్టే ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచి ఇస్తున్నాడు.
12 శరీరం ఒకటే అయినా దానికి అనేక అవయవాలు ఉన్నాయి. ఆ ఒకే శరీరానికి అనేక అవయవాలున్నా అనేకమైనా అన్నీ ఒకే శరీరం. క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు. 13 ఎలాగంటే, మనం యూదులమైనా గ్రీసు దేశస్థులమైనా సరే, బానిసలమైనా స్వతంత్రులమైనా సరే, మనమంతా ఒకే ఆత్మలో ఒకే శరీరంలోకి బాప్తిసం పొందాం. మనకందరికి ఒకే ఆత్మలో పానం చేయడానికి అనుగ్రహించబడింది.
14 శరీరమంటే ఒకే అవయవం కాదు గాని అనేక అవయవాలు. 15 ఒక వేళ పాదం “నేను చేయిని కాను గనుక శరీరంలో లేను” అంటే దాన్నిబట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా? 16 చెవి “నేను కన్నును కాను గనుక శరీరంలో లేను” అంటే దాన్నిబట్టి అది శరీరంలో లేనిదై ఉంటుందా? 17 శరీరమంతా కన్నే అయితే వినడం ఎలా? అంతా వినడమైతే వాసన చూడడం ఎలా? 18 కానీ దేవుడు తన ఇష్టప్రకారమే అవయవాలలో ప్రతిదానినీ శరీరంలో ఉంచాడు. 19 అవన్నీ ఒకటే అవయవమైతే శరీరం ఏమవుతుంది? 20 ఇప్పుడైతే అవయవాలు అనేకం, శరీరం ఒక్కటే.
21 ఇలాంటప్పుడు కన్ను చేయితో “నువ్వు నాకక్కరలేదు” అనలేదు. తల పాదాలతో “మీరు నాకక్కరలేదు” అనలేదు. 22 అసలు, శరీరంలో తక్కువ బలమున్నట్లు అనిపించుకొనే అవయవాలే ఎక్కువ అవసరం. 23 మనం ఏ అవయవాలకు తక్కువ ఘనత ఉందనుకొంటామో వాటినే ఎక్కువగా ఘనపరుస్తాం. ఏ అవయవాలకు అందం లేదో వాటికే ఎక్కువ అందం కలిగిస్తాం. 24 అందం ఉన్న అవయవాలకు అలా కలిగించడం అక్కర్లేదు. శరీరంలో ఏమీ అనైక్యత ఉండకూడదనీ, అవయవాలన్నీ ఒకదానికోసం ఒకటి ఒకే విధంగా శ్రద్ధ వహించాలనీ 25 దేవుడు తక్కువదానికి ఎక్కువ ఘనత కలిగించి శరీరాన్ని రూపొందించాడు. 26 శరీర అవయవాల్లో ఒకటి బాధపడితే దానితోకూడా తక్కిన అవయవాలన్నీ బాధపడుతాయి. ఒకదానికి గౌరవం కలిగితే తక్కిన అవయవాలన్నీ సంతోషిస్తాయి.
27 క్రీస్తు శరీరమంటే మీరు. మీలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఒక అవయవం. 28 దేవుడు తన సంఘంలో నియమించినవారెవరంటే మొట్టమొదట క్రీస్తు రాయబారులు. రెండో గుంపువారు ప్రవక్తలు, మూడో గుంపువారు ఉపదేశకులు, తరువాత అద్భుతాలు చేసేవారు, తరువాత రోగులను బాగు చేసే కృపావరాలు గలవారు, ఉపకారాలు చేసేవారు, నాయకత్వం వహించగలవారు, నానా భాషలు మాట్లాడేవారు. 29 అందరూ క్రీస్తురాయబారులు కారు గదా. అందరు ప్రవక్తలు కారు గదా. అందరూ ఉపదేశకులు కారు గదా. అందరూ అద్భుతాలు చేసేవారు కారు గదా. 30 అందరూ రోగులను బాగు చేసే కృపా వరాలు గలవారు కారు గదా. అందరూ భాషలు మాట్లాడేవారు కారు గదా. అందరూ భాషల అర్థం చెప్పేవారు కారు గదా.
31  ఆధ్యాత్మిక కృపావరాలలో అన్నిటికంటే మేలి రకమైనవాటిని ఆసక్తితో కోరండి. అయినా అన్నిటినీ మించిన దివ్య మార్గం మీకు వెల్లడి చేస్తాను.