11
1 ✽ నేను క్రీస్తును అనుకరించి ప్రవర్తిస్తూ ఉన్న ప్రకారం మీరూ నన్ను అనుకరించి ప్రవర్తిస్తూ ఉండండి. 2 అన్ని విషయాలలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకొంటూ నేను మీకప్పగించిన సాంప్రదాయక ఉపదేశాలు✽ పాటిస్తున్నారు, గనుక మిమ్ములను మెచ్చుకొంటున్నాను. 3 ఇప్పుడు మరో సంగతి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అదేమిటంటే, ప్రతి పురుషునికి శిరస్సు✽ క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. 4 ✽✽ఏ పురుషుడైనా సరే తల కప్పుకొని ప్రార్థన చేసినా, దేవునిమూలంగా పలికినా తన తలమీదికి అవమానం తెచ్చిపెట్టుకొంటున్నాడు. 5 ✽కానీ ఏ స్త్రీ అయినా సరే తల కప్పుకోకుండా ప్రార్థన చేసినా, దేవుని మూలంగా పలికినా తన తలమీదికి అవమానం తెచ్చిపెట్టుకొంటున్నది. ఆమె తల గొరిగినదానితో సాటి. 6 స్త్రీ తల కప్పుకోకపోతే ఆమె తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి. తలవెంట్రుకలు కత్తిరించు కోవడమూ, పూర్తిగా గొరిగి ఉండడమూ ఒక స్త్రీకి అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి.7 ✽✽పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమ, గనుక తన తల కప్పుకోకూడదు. స్త్రీ అయితే పురుషుడి మహిమ. 8 ✽ ఎందుకంటే, పురుషుడు స్త్రీలోనుంచి రాలేదు గాని స్త్రీ పురుషుడిలోనుంచి వచ్చింది. 9 అంతేకాదు, స్త్రీని పురుషుడి కోసం సృజించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీకోసం కాదు. 10 ✽అందుచేత దేవదూతల కారణంగా అధికార సూచన స్త్రీకి తలమీద ఉండాలి.
11 అయినా ప్రభువులో స్త్రీ సంబంధం లేనిదే పురుషుడు ఉండడు, పురుషుడి సంబంధం లేకుండా స్త్రీ ఉండదు. 12 ✽స్త్రీ పురుషుడిలోనుంచి వచ్చింది. మళ్ళీ పురుషుడు స్త్రీ ద్వారానే జన్మిస్తాడు. గాని అన్నిటి ఉత్పత్తి దేవుని నుంచే. 13 ✽మీరంతట మీరు నిర్ణయించుకోండి – స్త్రీ తల కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం యుక్తమా? 14 ✽పురుషునికి పొడువైన వెంట్రుకలు ఉంటే అది అతనికి అవమానమనీ 15 స్త్రీకి పొడువైన వెంట్రుకలుంటే ఆమెకు ఘనమనీ మీరు స్వభావ పూర్వకంగా నేర్చుకోవడం లేదా? స్త్రీకి తలవెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడినది. 16 ✽ఎవరైనా దీన్ని గురించి వివాదం పెట్టుకొన్నట్టు ఉంటే మాలో గానీ దేవుని సంఘాలలో గానీ దీనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆచారం లేదని తెలుసుకోవాలి.
17 ✽ఈ ఆదేశాలు ఇస్తూ మిమ్ములను మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే, మీరు సమకూడడం ఎక్కువ మేలు కోసం కాదు గాని తక్కువ మేలుకే. 18 ✽ మొదటి విషయం ఏమిటంటే, మీరు సంఘంగా సమకూడేటప్పుడు మీలో మీకు కక్షలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. 19 ఎందుకంటే, మీలో దేవుడు మెచ్చుకొనే✽వారెవరో స్పష్టం కావడానికి మీలో విభేదాలు✽ ఉండితీరాలి. 20 ✽అందుచేత మీరు ఒక చోట సమకూడేటప్పుడు అది ప్రభు భోజనం తినడానికి కాదు. 21 మీరు తినే సమయంలో ప్రతి ఒక్కరూ ఇతరులకోసం చూడకుండా ముందుగా తన సొంత భోజనం తింటారు. ఈ విధంగా ఒకరు ఆకలితో ఉండిపోతారు. మరొకరు మత్తుగా ఉంటారు. 22 ఏమిటిది? అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తున్నారా? ఏమీ లేనివారిని సిగ్గుపరుస్తారా ఏమిటి? నేను మీతో ఏమి చెప్పాలి? ఈ విషయంలో మిమ్ములను మెచ్చుకొంటానా? మెచ్చుకోను.
23 ✽నేను మీకు అందించినది ప్రభువు నుంచి నాకు వచ్చింది: ప్రభువైన యేసును శత్రువులకు పట్టియిచ్చిన రాత్రి, ఆయన రొట్టె చేతపట్టుకొని 24 దేవునికి కృతజ్ఞత చెప్పాడు. అప్పుడు రొట్టె విరిచి “ఇది తీసుకొని తినండి. ఇది మీకోసం✽ విరిగి పోయిన నా శరీరం✽. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి✽ ఇది చేయండి✽” అన్నాడు. 25 ✽భోజనమైన తరువాత ఆ ప్రకారమే ఆయన పాత్ర చేతపట్టుకొని “ఈ పాత్ర నా రక్తం మూలమైన క్రొత్త ఒడంబడిక. మీరు దీనిలోనిది త్రాగేటప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి” అన్నాడు. 26 మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోది త్రాగేటప్పుడెల్లా✽ తద్వారా ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు✽.
27 ✽అందుచేత ఎవరైతే తగని విధంగా ప్రభువుకు చెందిన ఈ రొట్టె తింటారో, పాత్రలోది త్రాగుతారో ప్రభు రక్త శరీరాల విషయంలో అపరాధులు అవుతారు. 28 ✽ప్రతి ఒక్కరూ తనను పరీక్షించుకొని ఆ రొట్టె తిని ఈ పాత్రలోది త్రాగాలి. 29 ఎందుకంటే, ప్రభు శరీరాన్ని గురించి సరిగా నిర్ణయించ కుండా✽, తగని విధంగా తిని త్రాగేవాడు తనమీదికి శిక్షావిధి✽ తెచ్చుకొంటూ తిని త్రాగుతున్నారు. 30 ✽ఈ కారణంచేతే మీలో అనేకులు నీరసించి అనారోగ్యంగా ఉన్నారు. మరి అనేకులు కన్ను మూశారు✽. 31 ✽ అయితే మనలను మనమే విమర్శ చేసుకొంటూ ఉంటే మనకు విమర్శ చేయడం జరగదు. 32 ✽ మనకు విమర్శ జరిగినప్పుడు మనం లోకంతోపాటు శిక్షావిధికి గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి దిద్దుతున్నాడు.
33 ✽అందుచేత, నా సోదరులారా, భోజనం చేయడానికి సమకూడినప్పుడు ఒకరి కోసం ఒకరు చూచి ఉండండి. 34 మీరు సమకూడడం తీర్పుకు కారణం కాకుండా ఎవరికైనా ఆకలి ఉంటే తన ఇంటిలోనే తినాలి. నేను వచ్చేటప్పుడు తక్కిన సంగతులను సరి చేస్తాను.