10
1 ✽సోదరులారా, ఈ వాస్తవాలు మీకు తెలియకుండా ఉండకూడదని నా కోరిక: మన పూర్వీకులంతా మేఘం✽ క్రింద ఉన్నారు, అందరూ సముద్రం✽ గుండా వెళ్ళారు. 2 ✽అందరూ మేఘంలోనూ సముద్రంలోనూ మోషే సంబంధంలోకి బాప్తిసం పొందారు. 3 ✽అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారం తినేవారు. 4 ✽ అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే పానీయం త్రాగేవారు. ఎలాగంటే, తమవెంట వస్తూ ఉన్న ఆత్మ సంబంధమైన బండలోనుంచి వచ్చిన నీళ్ళు త్రాగేవారు. ఆ బండ క్రీస్తే. 5 ✽అయినా వారిలో ఎక్కువమందివల్ల దేవునికి సంతోషం కలగలేదు గనుక వారి దేహాలు ఎడారిలో చెల్లాచెదురయ్యాయి.6 ✽✽వారు చెడ్డవాటిని కోరారు కూడా. మనం అలా చెడ్డవాటిని కోరకూడదని జరిగిన ఆ విషయాలు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి. 7 ✽ మీరు వారిలో కొందరిలాగా విగ్రహపూజకులు కాకండి. వారి విషయం ఇలా రాసి ఉంది: “ప్రజలు తింటూ త్రాగుతూ ఉండడానికి కూర్చున్నారు, లేచి ఆడారు.” 8 ✽ వారిలో కొందరు వ్యభిచారం చేశారు. మనం అలా చేయకూడదు. ఆ కారణం చేత వారిలో ఇరవై మూడు వేలమంది ఒకే రోజున హతమై కూలారు. 9 ✽ వారిలో కొందరు క్రీస్తును పరీక్షించారు కూడా. మనం అలా చేయకూడదు. అలా చేసినవారు పాముల కాటుచేత నాశనమయ్యారు. 10 ✽ వారిలో కొందరు సణిగారు. మనం సణగకూడదు. సణిగినవారు సంహారకునిచేత నాశనమయ్యారు.
11 ఈ విషయాలన్నీ ఉదాహరణలుగా✽ వారికి సంభవించాయి. ఇవి యుగాల నెరవేర్పులలో✽ ఉన్న మన ఉపదేశం కోసం రాసి ఉన్నాయి. 12 ✽కనుక నిలుచున్నాననుకొనే వ్యక్తి పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
13 మనుషులకు మామూలుగా కలిగే పరీక్షలు✽ గాక మరే పరీక్షా మీమీదకి రాలేదు. దేవుడైతే నమ్మకమైనవాడు – మీ బలాన్ని మించిన పరీక్ష ఏదీ మీకు రానియ్యడు. రానిచ్చిన పరీక్ష మీరు భరించగలిగేలా దానితోపాటు తప్పించుకొనే దారిని కలిగిస్తాడు.
14 ✽✽ అందుచేత, నా ప్రియ సోదరులారా, విగ్రహ పూజనుంచి పారిపోండి! 15 మీరు తెలివైనవారై ఉన్నట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పేది మీరే తేల్చి చూచుకోండి.
16 ✽మనం దీవించే దీవెన పాత్ర క్రీస్తు రక్త సహవాసం కాదా? మనం విరిచే రొట్టె క్రీస్తు శరీర సహవాసం కాదా? 17 ✽మనం అనేకులమైనా ఒకటే రొట్టె, ఒకటే శరీరం ఎందుకంటే మనమంతా ఆ ఒకే రొట్టెలో పాల్గొంటున్నాం.
18 ✽ శరీర సంబంధంగా ఇస్రాయేల్‌జనాన్ని చూడండి. బలుల మాంసం తినేవారు బలిపీఠంతో భాగస్థులు గదా. 19 ✽✝నా భావమేమిటి? విగ్రహంలో గాని విగ్రహానికి అర్పితమైనదానిలో గానీ ఏమైనా ఉందని చెపుతున్నానా? 20 ✽లేదు, గాని ఇతర జనాలు అర్పించే బలులు దయ్యాలకే అర్పిస్తున్నారు గాని దేవునికి కాదు. మీరు దయ్యాలతో సహవాసం చేయడం నాకిష్టం లేదు. 21 ✽మీరు ప్రభు పాత్రలోది, పిశాచాల పాత్రలోది కూడా త్రాగలేరు. ప్రభువుకు చెందిన బల్లమీద ఉన్నవాటిలో, పిశాచాల బల్లమీద ఉన్నవాటిలో కూడా వంతు తీసుకోలేరు. 22 ✽ ప్రభువుకు రోషం కలిగిస్తామా? ఆయనకంటే మనం బలవంతులమా?
23 ✝అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది అయితే అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గానీ ప్రతీదీ అభివృద్ధి కలిగించదు. 24 ✽స్వప్రయోజనం ఎవరూ చూచుకోకూడదు గాని ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమం చూడాలి. 25 ✽అంగడిలో అమ్మే ఏ మాంసం అయినా తినవచ్చు. దాని గురించి అంతర్వాణి కారణంగా ప్రశ్నలేవీ అడగకండి. 26 ✽ ఎందుకంటే, “భూమి, దానిమీద ఉన్నదంతా ప్రభువుకు చెందినవే.” 27 ✽ప్రభువును నమ్మనివారిలో ఎవరైనా మిమ్ములను భోజనానికి పిలుస్తారనుకోండి. వెళ్ళడానికి మీకిష్టం ఉంటే వెళ్ళి మీకు వడ్డించినది ఏదైనా, దాని గురించి అంతర్వాణినిబట్టి ఏ ప్రశ్నా అడగకుండా, తినండి. 28 ✽అయితే ఒకవేళ “ఇది విగ్రహాలకు అర్పించినది” అంటూ ఎవడైనా మీతో చెపితే అలా తెలియజేసిన వానికోసం, అంతర్వాణికోసం దాన్ని తినకండి. ఎందుకంటే “భూమి, దాని మీద ఉన్నదంతా ప్రభువుకు చెందినవే.” 29 ✽“అంతర్వాణి” – మీది కాదు గాని ఎదుటి వ్యక్తి అంతర్వాణి గురించి అంటున్నాను. నా స్వేచ్ఛను వేరొకరి అంతర్వాణి ఎందుకు విమర్శించాలి? 30 నేను దానిని కృతజ్ఞతతో పుచ్చుకొంటే దేనికోసం దేవునికి కృతజ్ఞత చెపుతానో దానివల్ల నేను నిందపాలు కావడం ఎందుకు?
31 ✽అందుచేత మీరు తిన్నా, త్రాగినా, ఏమి చేసినా దేవునికి మహిమ కలిగించడానికే అన్నీ చేయండి. 32 ✽ యూదులకు గానీ గ్రీసు దేశస్థులకు గానీ దేవుని సంఘానికీ✽ గానీ అభ్యంతరమేమీ కలిగించకండి. 33 ✽ ఇలాగే నేను కూడా స్వప్రయోజనం చూచుకోకుండా, అనేకులు పాపవిముక్తి పొందాలని వారికి ప్రయోజనం కలిగేలా అందరినీ అన్నిటిలో సంతోష పెడుతున్నాను.