9
1 నేను క్రీస్తురాయబారిని కానా? నాకు స్వేచ్ఛ లేదా? మన ప్రభువైన యేసు క్రీస్తును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పని ఫలితం కాదా? 2 ఒకవేళ ఇతరులకు నేను క్రీస్తురాయబారిని కాకపోయినా నిస్సందేహంగా మీ మట్టుకైనా రాయబారినే. ప్రభువులో రాయబారిననే సత్యానికి మీరే ముద్రలాంటివారు. 3 మీ మధ్య నన్ను విమర్శించేవారికి నా ప్రత్యుత్తరమిదే. 4 అన్నపానాలకు మాకు హక్కు లేదా? 5 తక్కిన క్రీస్తురాయబారులు, ప్రభు సోదరులు, కేఫా కూడా, విశ్వాసంలో సోదరీలైన తమ భార్యలను వెంటబెట్టుకొని ప్రయాణిస్తారు. అలాంటి హక్కు మాకు లేదా? 6 జీవనంకోసం పని చేయకుండా ఉండడానికి బర్నబా, నేను మాత్రమే హక్కు లేనివారమా? 7 సొంత ఖర్చుపెట్టుకొని సైనికుడుగా యుద్ధానికి వెళ్ళే వాడెవడు? ద్రాక్షతోట వేసుకొని దాని పండ్లు తిననివాడెవడు? మందను కాస్తూ మంద పాలు త్రాగనివాడెవడు?
8 మానవ రీతిగా ఇలా అంటున్నానా? కాదు. ధర్మశాస్త్రం కూడా ఇలా చెపుతుంది గదా! 9 “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు” అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. అయితే దేవుడు పట్టించుకొనేది ఎద్దుల విషయమేనా? 10 లేకపోతే, ఇలా చెప్పినది మనకోసమేనా? మన కోసమే రాసి ఉంది. కారణం ఏమిటంటే, దున్నేవాడు ఆశాభావంతో దున్నాలి. కళ్ళం ఆశాభావంతో నూర్పించేవాడు కూడా తాను ఆశాభావంతో పని చేసిన దానిలో పాల్గొనాలి. 11 మేము మీలో ఆధ్యాత్మిక విత్తనాలు చల్లినవారమైతే మీనుంచి శరీరంకోసమైన వాటిని కోయడం గొప్ప విషయమా? 12 ఇతరులు మీమీద ఇలాంటి హక్కులో పాల్గొంటూ ఉంటే మాకు ఈ హక్కు మరీ ఎక్కువగా ఉంటుంది గదా. అయినా మేమీ హక్కు వినియోగించుకోలేదు. క్రీస్తు శుభవార్తకు ఆటంకమేమీ కలిగించకూడదని అన్నిటినీ ఓర్చుకొంటున్నాం.
13 పవిత్రమైన వాటి విషయంలో సేవ చేసేవారు దేవాలయానికి చెందిన భోజనపదార్థాలు తింటారనీ, బలిపీఠందగ్గర పని చేసేవారికి బలిపీఠం అర్పణలలో భాగం ఉంటుందనీ మీకు తెలియదా? 14  అలాగే శుభవార్త ప్రకటించేవారికి శుభవార్తవల్లే జీవనోపాధి కలగాలని ప్రభువు విధించాడు.
15 నేనైతే ఈ హక్కులలో ఏవి ఉపయోగించుకోలేదు. నాపట్ల ఆ ప్రకారం జరగాలని నేనిది రాయడం లేదు. నా అతిశయాన్ని ఎవడైనా నిరర్థకంగా చేయడంకంటే నాకు చావే మేలు. 16 నేను శుభవార్త ప్రకటిస్తున్నానంటే ఇందులో అతిశయ కారణం ఏమీ లేదు. ఎందుకంటే ప్రకటించే అవసరత నా మీద ఉంచబడి ఉంది. ఒకవేళ నేను శుభవార్త ప్రకటించకపోతే, అయ్యో, నాకెంత నష్టం! 17 ఇష్టపూర్వకంగా ఈ పని చేస్తే నాకు బహుమతి. ఇష్టపూర్వకంగా చేయక పోయినా నాకు కార్యనిర్వాహకత్వం అప్పగించబడింది. 18 అలాగైతే నా బహుమతి ఏది? నేను శుభవార్త ప్రకటించే టప్పుడు తద్వారా జీవనం చేసే నా హక్కు అధికంగా వినియోగించుకోకుండా క్రీస్తు శుభవార్త ఉచితంగా అందిచడమే నా బహుమతి.
19 అందరి విషయంలో నాకు స్వేచ్ఛ ఉంది. అయినా ప్రభువుకోసం ఎక్కువమందిని సంపాదించాలని అందరికీ బానిసనయ్యాను. 20 యూదులను సంపాదించడానికి యూదులకు యూదుడి లాంటివాణ్ణయ్యాను. ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారిని సంపాదించడానికి ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడి లాంటివాణ్ణయ్యాను. 21  దేవుని పట్ల ధర్మశాస్త్రం లేనివాణ్ణి కాను గాని క్రీస్తు న్యాయశాస్త్రం క్రింద ఉన్నవాణ్ణి. అయినా ధర్మశాస్త్రం లేనివారిని సంపాదించడానికి వారికి ధర్మశాస్త్రం లేనివాడి లాంటివాణ్ణయ్యాను. 22 బలహీనులను సంపాదించడానికి బలహీనులకు బలహీనుడి లాంటివాణ్ణయ్యాను. కొందరికి పాపవిముక్తి కలిగించడానికి అందరికీ అన్ని రకాలవాణ్ణయ్యాను. 23 శుభవార్తలో వారితో పాలివాణ్ణి కావాలని నేనిలా చేస్తున్నది శుభవార్తకోసమే.
24 పరుగు పందెంలో పరుగెత్తే వారంతా పరుగెత్తుతారు గానీ బహుమతి లభించేది ఒకరికే అని మీకు తెలియదా? అలాగే మీకూ బహుమతి లభించేలా పరుగెత్తండి. 25 క్రీడాకారుడు అన్నిటిలో తనను అదుపులో ఉంచుకొంటాడు. వారేమో పాడైపోయే ఆకుల కిరీటం కోసం అలా చేస్తారు. మనమైతే ఎన్నడూ పాడు కాని కిరీటంకోసం అలా చేస్తున్నాం. 26 అందుచేత నేను పరుగెత్తుతున్నది నిశ్చయత లేకుండా కాదు. నేను ముష్టియుద్ధం చేస్తున్నది గాలిలో దెబ్బలు వేసినట్టు కాదు. 27 ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే అయోగ్యుణ్ణి అనే తీర్పుకు గురి కాకుండా నా శరీరాన్ని నలగ్గొట్టి వశం చేసుకొంటున్నాను.