8
1 విగ్రహాలకు అర్పితమైనవాటి విషయం: మనకందరికీ తెలివి ఉందని మనకు తెలుసు. తెలివి ఉప్పొంగ జేస్తుంది, ప్రేమ అయితే అభివృద్ధిని కలిగిస్తుంది. 2 ఎవరైనా తనకు ఏదైనా తెలుసుననుకొంటే తెలుసుకోవలసిన విధంగా ఇంకా తెలుసుకోలేదన్న మాట. 3 ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆయనకు ఆ వ్యక్తి తెలుసు.
4 అందుచేత విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే విషయంలో మనకు తెలిసినదేమిటంటే, లోకంలో విగ్రహం అనేది వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు. 5 “దేవుళ్ళు” లోకంలో, స్వర్గంలో ఉన్నట్టు జనులు చెప్పుకొన్నా (ఇలాంటి “దేవుళ్ళు” “ప్రభువులు” అనేకులున్నారు), 6  మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయనవల్లే సమస్తం కలిగింది. మనం ఆయనకోసమే. ఒకే ప్రభువు ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే సమస్తం కలిగింది. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
7 అయినా ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతవరకు విగ్రహం గురించి స్మృతి కలిగి తాము తింటున్నది విగ్రహానికి అర్పితమైనట్టు భావించి తింటున్నారు. వారి అంతర్వాణికి చాలినంత వివేచనాశక్తి లేకపోవడంచేత అది అశుద్ధి అవుతుంది. 8 గాని తిండి మనల్ని దేవునికి సిఫారసు చేయదు. మనం ఏదైనా తింటే ఎక్కువవారమూ కాము. తినకపోతే తక్కువవారము కాము.
9  అయినా మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులకు తప్పటడుగు వేయించే అడ్డు కాకుండా చూచుకోండి. 10 సత్యం తెలిసిన మీరు విగ్రహమున్న స్థలంలో తింటే ఎవడైనా ఒకడు చూస్తాడనుకోండి. విశ్వాసంలో బలహీనుడైన అతడి అంతర్వాణికి విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే ధైర్యం కలగదా? 11 క్రీస్తు ఎవరికోసం చనిపోయాడో విశ్వాసంలో ఆ బలహీన సోదరుడు మీ తెలివివల్ల పాడైపోవాలా? 12 మీరు సోదరులకు వ్యతిరేకంగా పాపం చేసి తక్కువ వివేచనశక్తి ఉన్నవారి అంతర్వాణికి దెబ్బ కొట్టడంవల్ల మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
13 కాబట్టి, తిండి నా సోదరుడు తప్పటడుగు వేయడానికి కారణమైతే, నా సోదరుడు తప్పటడుగు వేయకూడదని నేను ఇంకెన్నడూ మాంసం తినను.