7
1 మీరు నాకు రాసినవాటి విషయం – స్త్రీని ముట్టకపోవడం పురుషుడికి మేలు. 2 అయినా జారత్వం ఉన్న సంగతినిబట్టి ప్రతి పురుషుడు సొంత భార్య, ప్రతి స్త్రీ సొంత భర్త కలిగి ఉండవచ్చు. 3 భర్త తన భార్యపట్ల వివాహధర్మం నెరవేరుస్తూ ఉండాలి, తన భర్తపట్ల భార్యకూడా అలాగే చేయాలి. 4 భార్యకు తన శరీరంమీద అధికారం లేదు – అది భర్తకే ఉంది. అలాగే భర్తకు తన శరీరం మీద అధికారం లేదు – అది భార్యకే ఉంది. 5 మీకు ఉపవాసం, ప్రార్థన కోసం సావకాశం కలిగించుకోవడానికి కొంత కాలంవరకు ఇద్దరూ సమ్మతిస్తేనే తప్ప ఒకరికి ఒకరు లొంగిపోకుండా ఉండకూడదు. ఆ తరువాత, మీ కోరికలు అదుపులో ఉంచుకోలేకపోవడం బట్టి సైతాను మిమ్ములను శోధించ కుండేలా మళ్ళీ కలుసుకోండి.
6 నేనిది ఆజ్ఞగా చెప్పడం లేదు, గాని అనుమతిగా మాత్రమే. 7 అయినా మనుషులంతా నాలాగే ఉండాలని నా కోరిక. అయితే ప్రతి ఒక్కరికి దేవుని నుంచి సొంత కృపావరం ఉంది. ఇది ఒకరికి ఒక విధంగా మరొకరికి ఇంకో విధంగా ఉంటుంది. 8 కానీ నాలాగే ఉండిపోతే మంచిదని పెళ్ళికాని వారితో, విధవరాండ్రతో అంటున్నాను. 9 అయినా కోరికలు అదుపులో ఉంచుకోవడం వారిచేత కాకపోతే పెళ్ళి చేసుకోవచ్చు. కామాగ్నితో మాడిపోతూ ఉండడం కంటే పెళ్ళి చేసుకోవడం మంచిది.
10  పెళ్ళైనవారికి నేనిచ్చే ఆదేశమిదే – అసలు, ఇచ్చేది నేను కాదు, ప్రభువే: “భార్య భర్తకు వేరైపోకూడదు.” 11 ఒకవేళ వేరైపోయినా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండాలి. లేదా, భర్తతో సమాధానపడాలి. భర్త భార్యను విడిచిపెట్ట కూడదు.
12 తక్కినవారితో ప్రభువు కాదు, నేనే ఇలా చెపుతున్నాను: ఒక సోదరునికి ప్రభువును నమ్మని భార్య ఉందనుకోండి. ఆమెకు అతనితో కాపురం చేయడం ఇష్టమైతే అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. 13 ఒకామెకు ప్రభువును నమ్మని భర్త ఉన్నాడనుకోండి. అతనికి ఆమెతో కాపుర ముండడం ఇష్టమైతే ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు. 14 ఎందుకంటే నమ్మని భర్త నమ్మిన భార్య కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినవాడు నమ్మని భార్య నమ్మిన భర్త కారణంగా దేవుని చేత ప్రత్యేకించబడినది. లేకపోతే మీ పిల్లలు అశుద్ధులుగా ఉండి ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రంగా ఉన్నారు.
15 ఒకవేళ నమ్మని వ్యక్తి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. అలాంటి పరిస్థితిలో సోదరునికి గానీ సోదరికి గానీ బంధనం లేదు. దేవుడు మనలను శాంతి అనుభవించడానికి పిలిచాడు. 16 పెళ్ళైన స్త్రీ! నీద్వారా నీ భర్తకు పాపవిముక్తి కలుగుతుందేమో – నీకేమి తెలుసు? పెళ్ళైన పురుషుడా! నీ ద్వారా నీ భార్యకు పాపవిముక్తి కలుగుతుందేమో – నీకేమి తెలుసు?
17 ప్రతి ఒక్కరూ తనకు దేవుడు ఇచ్చిన ప్రకారం, ప్రభువు పిలిచిన పరిస్థితిలో సాగిపోవాలి. క్రీస్తుసంఘాలన్నిటికీ నేనిచ్చే ఆదేశమిదే. 18 సున్నతి గలవానికి పిలుపు వచ్చిందా? అతడు సున్నతి గురుతు మాపుకోవడానికి పూనుకోకూడదు. సున్నతి లేనివారికి పిలుపు వచ్చిందా? అతడు సున్నతి పొందకూడదు. 19 సున్నతి పొందడంలో ఏమీ లేదు, పొందకపోవడంలోనూ ఏమీ లేదు. ముఖ్యమైన సంగతి దేవుని ఆజ్ఞలను పాటించడమే.
20 ప్రతి ఒక్కరూ తనకు ఏ స్థితిలో దేవుని పిలుపు వచ్చిందో ఆ స్థితిలోనే ఉండిపోవాలి. 21 బానిసగా ఉన్నప్పుడు మీకు పిలుపు వచ్చిందా? దాని గురించి బెంగపెట్టుకోకండి, గాని ఒకవేళ స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం వస్తే దానిని వినియోగం చేసుకోండి. 22 బానిసగా ఉన్నప్పుడు ప్రభువులోకి పిలుపు పొందిన వ్యక్తి ప్రభువుకు చెందిన స్వతంత్రుడు. అలాగే స్వతంత్రుడుగా ఉన్నప్పుడు పిలుపు అందిన వ్యక్తి క్రీస్తు బానిస. 23 వెలపెట్టి మిమ్ములను కొనుక్కోవడం జరిగింది గనుక మనుషులకు బానిసలు కాకండి. 24 సోదరులారా, ప్రతి ఒక్కరు తనకు ఏ స్థితిలో పిలుపు వచ్చిందో ఆ స్థితిలో దేవునితో నిలిచి ఉండాలి.
25 కన్యలను గురించి ప్రభువు ఆదేశం నాకు లేదు. అయినా, ప్రభువుచేత ఆయన కరుణ మూలంగా నమ్మతగిన వాణ్ణయి నా మనసులోది తెలియజేస్తాను – 26 ఇప్పటి కష్టదశ కారణంగా మనిషి తానున్న పరిస్థితిలోనే నిలిచి ఉండడం మంచిదని నా తలంపు. 27 మీరు భార్యకు కట్టుబడి ఉన్నారా? విడుదల కోసం ప్రయత్నించకండి. భార్య లేకుండా ఉన్నారా? భార్య కావాలని వెదకకండి. 28 ఒకవేళ మీరు పెళ్ళి చేసుకొన్నా అది మీకు అపరాధం కాదు. కన్య పెళ్ళి చేసుకొంటే అది ఆమెకు అపరాధం కాదు. అయినా అలాంటివారికి శరీరసంబంధమైన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకూడదని నా కోరిక.
29 సోదరులారా, నేను చెప్పేదేమిటంటే కాలం కొద్దిగానే ఉంది, గనుక ఇకమీదట భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుండాలి. 30 ఏడ్చేవారు ఏడవనట్టుండాలి. సంతోషించే వారు సంతోషించనట్టు ఉండాలి. కొనుక్కొనేవారు తమది అంటూ ఏమీ లేనట్టుండాలి. 31 లోకంలో ఉన్నవాటిని వినియోగించేవారు దుర్వినియోగం చేయనట్టుండాలి. ఎందుకని? ఈ లోక విధానం గతించిపోతూ ఉంది.
32 మీరు కలత లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళికాని మనిషి ప్రభు విషయాలలో శ్రద్ధ వహిస్తాడు. తాను ప్రభువును ఎలా మెప్పించగలనా అని అతడి శ్రద్ధ. 33 పెళ్ళి అయిన మనిషి ఈ లోకసంబంధమైన వాటిలో శ్రద్ధ వహిస్తాడు, భార్యను ఎలా మెప్పించగలనా అని అతడి శ్రద్ధ. 34 అలాగే, పెళ్ళైన స్త్రీకీ కన్యకూ వ్యత్యాసం ఉంది. పెళ్ళికాని స్త్రీ ప్రభు విషయాలలో శ్రద్ధ వహిస్తుంది. తాను శరీరంలో ఆత్మలో పవిత్రంగా ఉండాలని ఆమె శ్రద్ధ. పెళ్ళి అయిన స్త్రీ లోకసంబధమైనవాటిలో శ్రద్ధ వహిస్తుంది, తాను భర్తను ఎలా మెప్పించగలనా అని ఆమె శ్రద్ధ. 35 ఇది మీ ప్రయోజనం కోసమే చెపుతున్నాను. మిమ్ములను బంధించాలని కాదు గాని ఏది యుక్తమో దానిని ప్రోత్సాహించాలనీ, మీరు ఇతర శ్రద్ధలు లేకుండా ప్రభువుకు సేవ చేస్తూ ఉండాలనీ నా ఉద్దేశం.
36 ఒక మనిషికి కన్య అయిన కూతురు ప్రాయం మించిపోయింది అనుకోండి. ఆమెకు పెళ్ళి చేయకపోవడం అయోగ్యమనీ పెళ్ళి తప్పనిసరి అనీ అతడు అనుకొంటే తన ఇష్టప్రకారం జరిగించవచ్చు. అందులో అతనికి అపరాధం ఉండదు. వారిని పెళ్ళి చేసుకోనివ్వవచ్చు. 37 అయితే మనోబలంతో ఉండి బలవంతమేమీ లేకుండా తన ఇష్టప్రకారం చేయగలిగితే కన్య అయి ఉన్న తన కూతురును పెళ్ళి లేకుండా ఉంచుతానని హృదయంలో నిశ్చయించుకొంటే అదీ మంచిది. 38 గనుక ఆమెకు పెళ్ళి చేసేవాడు మంచి చేస్తున్నాడు, పెళ్ళి చేయనివాడు దానికంటే ఇంకా మంచి చేస్తున్నాడు.
39  భర్త బ్రతికి ఉన్నంతవరకూ భార్య చట్టం ప్రకారం అతడికి కట్టుబడి ఉంటుంది. ఒక వేళ భర్త చనిపోతే ఆమెకు నచ్చినవాణ్ణి వివాహమాడడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంది, గాని ప్రభువులో ఉన్నవాణ్ణి మాత్రమే వివాహమాడాలి. 40 అయినా ఆమె ఉన్న పరిస్థితిలోనే ఉండిపోతే ఎక్కువ సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇందులో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా భావన.