4
1  కాబట్టి ప్రతి మనిషి మమ్ములను ఇలా భావించాలి: మేము క్రీస్తు సేవకులం, దేవుని రహస్య సత్యాల విషయంలో నిర్వాహకులం. 2  ఆ మాటకు వస్తే ప్రతి నిర్వాహకుడు నమ్మకంగా ఉండవలసినదే. 3 అయితే నేను మీ విమర్శకు గానీ మరే మానవ విమర్శకు గానీ గురి కావడం నాకు అల్పమైన సంగతే అనిపిస్తుంది. అసలు, నన్ను నేను విమర్శించుకోను. 4 నాకు తెలిసినంత మట్టుకు నేను ఏ విషయంలోనూ దోషిని కాను. కానీ ఇందువల్లే నిర్దోషిగా లెక్కలోకి రాను, నన్ను తీర్పు తీర్చేవాడు ప్రభువే. 5 ఆ కాలం రాకముందే ప్రభువు వచ్చేంతవరకు దేనికీ తీర్పు తీర్చకండి. ఆయన చీకటిలో దాగివున్నవాటిని వెలుగులోకి తీసుకువస్తాడు, మనుషుల అంతరంగాలలో ఉన్న ఆలోచనలు బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన మెప్పు దేవునివల్ల కలుగుతుంది.
6 సోదరులారా, మీ మేలుకోసం నన్నూ అపొల్లోనూ ఉదాహరణగా తీసుకొని ఈ విషయాలు వివరించాను. అంటే, మమ్ములనుబట్టి మీరు లేఖనాలలో రాసి ఉన్నదానికంటే మించి ఆలోచించకూడదని నేర్చుకోవాలనీ మీరొకరి పక్షం వహించి మరొకరికి వ్యతిరేకంగా విర్రవీగకూడదనీ అలా చేశాను. 7 నిన్ను ఏకైక వాణ్ణిగా చేసినదెవరు? నీవు దేవుని నుంచి పొందినది తప్ప నీకు మరేం కలిగి ఉంది? అది పొందినదే గనుక అయితే పొందినది కానట్టే గొప్పలు చెప్పుకొంటున్నావేం?
8 మీరిప్పటికే పూర్తిగా తృప్తిపడ్డారట గదూ! అప్పుడే ధనవంతులయ్యారట! మేము లేకుండానే రాజులుగా ఏలారట! మీతో కూడా మేము రాజ్యమేలేలా మీరు నిజంగా రాజులు కావాలని నా అభిలాష. 9 ఎందుకంటే, దేవుడు క్రీస్తురాయబారులమైన మమ్ములను అందరికంటే చివరి వరుసలో, మరణ శిక్షకు గురైన వారుగా ప్రదర్శిస్తున్నాడని నాకనిపిస్తుంది. మేము ప్రపంచానికి – మనుషులకూ దేవదూతలకూ – వింత ప్రదర్శనగా తయారయ్యాం. 10 మేము క్రీస్తుకోసం మందబుద్ధులం. మీరైతే క్రీస్తులో బుద్ధిమంతులటగా! మేమేమో బలహీనులం. మీరు బలవంతులట! మీరేమో ఘనతకెక్కినవారు! మేము అవమానం పాలైనవారం.
11  ఈ గడియ వరకూ మేము ఆకలిదప్పులతో ఉన్నాం. సరిపోని దుస్తులు తొడుక్కొంటున్నాం. పిడిగుద్దులు తింటున్నాం. నిలువ నీడ లేకుండా ఉన్నాం. 12 సొంత చేతులతో కష్టపడి పని చేస్తున్నాం. నిందల పాలయినప్పుడు దీవిస్తాం. హింసలకు గురి అయితే ఓర్చుకొంటాం. 13 అపనిందలు వచ్చినప్పుడు వేడుకొంటాం. ఇప్పటివరకూ మేము ఇతరుల దృష్టిలో లోకంలోని చెత్తాచెదారంలాగా, అన్నిట్లో నీచమైనదానిలాగా ఉన్నాం.
14 నేనీ విషయాలు రాసే కారణం మీకు సిగ్గు కలిగిద్దామని కాదు గాని నా ప్రియమైన పిల్లలని హెచ్చరికలు రాస్తున్నాను. 15 క్రీస్తులో మీకు క్రమశిక్షణ ఇచ్చేవారు పదివేలమంది ఉన్నా, మీకు తండ్రులు అనేకులు లేరు. ఎందుకంటే, క్రీస్తు యేసులో శుభవార్త ద్వారా మీకు తండ్రి అయినది నేనే. 16  కాబట్టి నాలాగే ప్రవర్తించండని మిమ్ములను వేడుకొంటున్నాను. 17 ఇందుకోసమే తిమోతిని మీ దగ్గరకు పంపాను. అతడు ప్రభువులో నాకు నమ్మదగిన ప్రియమైన కొడుకు. అతడు క్రీస్తులో నా జీవితవిధానాలు ఎలాంటివో మీకు జ్ఞాపకం చేస్తాడు. అంతటా అన్ని సంఘాలకు నేను ఉపదేశించేది ఈ విధానాలే.
18 నేను మీ దగ్గరకు రాకుండా ఉన్నట్టు కొందరు విర్రవీగుతూ ఉన్నారు. 19 అయితే ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరకు వచ్చి విర్రవీగుతూ ఉన్నవారి మాటలు కాదు – వారి బలప్రభావాలు ఎలాంటివో తెలుసుకొంటాను. 20 దేవుని రాజ్యమంటే మాటలు కాదు, బలప్రభావాలతో కూడినది. 21 నేను మీ దగ్గరకు బెత్తంతో రావాలా? ప్రేమభావంతో, మృదువైన మనసుతో రావాలా? ఏది మీ కోరిక?