3
1 అయినా, సోదరులారా, నేను ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడే విధంగా మీతో మాట్లాడలేక పోయాను. శరీర స్వభావులతోనే క్రీస్తులో ఉన్న చంటి బిడ్డలతోనే మాట్లాడే విధంగా మీతో మాట్లాడ వలసి వచ్చింది. 2 నేను మీకిచ్చినది పాలే గాని అన్నం కాదు. ఇంతవరకు అన్నం తినడం మీ చేతకాదు. ఇప్పుడు కూడా మీ చేత కాదు. 3 ఎందుకంటే మీరు శరీర స్వభావుల్లాంటివారు. మీ మధ్య అసూయ, జగడాలు, విభాగాలు ఉన్నాయి అంటే మీరు శరీర స్వభావాన్ని అనుసరించే మామూలు మనుషులైనట్టున్నారు గదా.
4  ఒకరేమో “నేను పౌలు పక్షంవాణ్ణి” అని, మరొకరు “నేను అపొల్లో మనిషిని” అని అంటూ ఉంటే మీరు శరీర స్వభావాన్ని అనుసరించేవారు కారా? 5 పౌలు ఎవడు? అపొల్లో ఎవడు? పరిచారకులే గదా. వీరిద్దరికీ ప్రభువు అవకాశాలు ఇచ్చినప్పుడు వీరిద్వారా మీరు నమ్మారు. 6 నేను నాటాను, అపొల్లో నీళ్ళు పెట్టాడు, అంతేగాని పెరిగేలా చేసినది దేవుడే. 7 అలాగైతే నాటేవాడిలో గానీ నీళ్ళు పెట్టేవాడిలో గానీ ఏమీ లేదు. పెరిగేలా చేసిన దేవునిలోనే అంతా ఉంది. 8 నాటేవాడు నీళ్ళు పెట్టేవాడు ఒకటిగా ఉన్నారు. ఒక్కొక్కరికి తన కృషికొలది ప్రతిఫలం దొరుకుతుంది. 9 మేము దేవునితో కలిసి పని చేసేవారం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.
10 దేవుడు నాకు ప్రసాదించిన కృపప్రకారం నేను నేర్పుగల నిర్మాతనై పునాది వేశాను. మరొకడు దానిమీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కట్టే ప్రతి ఒక్కరూ తాను ఎలా నిర్మిస్తున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. 11  వేసిన ఈ పునాది యేసు క్రీస్తే. ఈ పునాది గాక వేరేది ఎవ్వరూ వేయలేరు. 12 ఎవరైనా ఈ పునాదిమీద బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, గడ్డి, కసవు – ఇలాంటివాటితో నిర్మిస్తే, 13 ప్రతి ఒక్కరి పని ఎలాంటిదో స్పష్టమవుతుంది. ఆ రోజు దాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే అది మంటలచేత వెల్లడి అవుతుంది. ప్రతి ఒక్కరి పని ఎలాంటిదో ఆ మంటలు పరీక్షిస్తాయి. 14 ఎవరైనా పునాదిమీద కట్టినది నిలిస్తే, అతనికి ప్రతిఫలం లభిస్తుంది. 15 తాను కట్టినది కాలిపోతే ఆ వ్యక్తి నష్టం అనుభవిస్తాడు. తన మట్టుకు తనకు విముక్తి ఉంటుంది గాని అది మంటలద్వారా వచ్చినట్టే ఉంటుంది.
16 మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా? 17 దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఆ వ్యక్తిని పాడు చేస్తాడు. ఎందుకంటే, దేవుని ఆలయం పవిత్రమైనది. మీరే ఈ ఆలయం.
18 ఎవరూ తనను తాను మోసగించుకోకూడదు. మీలో ఎవరైనా ఈ లోకంలో తనను జ్ఞానిని అనుకొంటే జ్ఞానం సంపాదించుకోవడానికి తెలివితక్కువ వ్యక్తిగా అయిపోవాలి. 19 ఎందుకంటే, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో తెలివితక్కువ తనమే. “ఆయన జ్ఞానులను తమ సొంత యుక్తి మూలంగానే పట్టుకొంటాడు” అని రాసి ఉన్నది గదా. 20  జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమని ప్రభువుకు తెలుసునని కూడా రాసి ఉన్నది.
21  ఇలా ఉండగా ఎవరూ మనుషులను బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే అంతా మీది. 22 పౌలు గానీ, అపొల్లో గానీ, కేఫా గానీ, లోకం గానీ, బ్రతుకు గానీ, చావు గానీ, ఇప్పుడున్నవి గానీ, తరువాత వచ్చేవి గానీ – అంతా మీవే! 23 మీరు క్రీస్తుకు చెందేవారు, క్రీస్తు దేవునికి చెందేవాడు.